క్రీడాభూమి

షరపోవా జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 2: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా అందాల భామ మరియా షరపోవా జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో ఆమె అమెరికా యువ క్రీడాకారిణి సోఫియా కెనిన్‌పై విజయం సాధించి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అయితే పురుషుల సింగిల్స్ విభాగంలో యుఎస్ ఓపెన్ 2014 ఎడిషన్ చాంపియన్ మారిన్ సిలిక్‌తో పాటు అమెరికా ఆటగాడు జాన్ ఇస్నర్‌కు చుక్కెదురైంది. 2006లో యుఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన షరపోవా డోపింగ్ కేసులో 15 నెలల పాటు నిషేధాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆడుతున్న తొలి గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్ ఇదే. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో ఆమె 7-5, 6-2 సెట్ల తేడాతో కెనిన్ (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 139వ స్థానం)ను మట్టికరిపించింది. క్వార్టర్ ఫైనల్ బెర్తు కోసం షరపోవా లాత్వియాకి చెందిన 16వ సీడ్ క్రీడాకారిణి అనస్తాసిజా సెవత్సొవాతో తలపడనుంది. కెరీర్‌లో ఐదు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన షరపోవా గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ సందర్భంగా మెల్డోనియం అనే ఉత్ప్రేరకాన్ని వాడినట్లు డోపింగ్ పరీక్షల్లో తేలడంతో ఆమెపై 15 నెలల పాటు నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. 2011 నుంచి 15 గ్రాండ్‌శ్లామ్ టోర్నీల్లో షరపోవా ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడం ఇది 14వ సారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిషేధాన్ని పూర్తి చేసుకున్న షరపోవాకు ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు వైల్డ్‌కార్డును నిరాకరించగా, ఆ తర్వాత గాయం కారణంగా ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నీకి దూరమైన విషయం విదితమే. ముంజేతి గాయంతో ఇబ్బందులు పడుతున్న షరపోవా ఒకే ఒక్క హార్డ్‌కోర్ట్ మ్యాచ్‌లో ఆడినప్పటికీ యుఎస్ ఓపెన్‌లో ఆమెకు వైల్డ్‌కార్డు లభించింది. ఈ అవకాశాన్ని ఆమె చక్కగా సద్వినియోగం చేసుకుని అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. షరపోవాతో పాటు అమెరికా ‘నల్ల కలువ’ వీనస్ విలియమ్స్, వింబుల్డన్ చాంపియన్ గార్బిన్ ముగురుజా, పెట్రా క్విటోవా కూడా తమతమ ప్రత్యర్థులను ఓడించి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఈ టోర్నీలో తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగిన వీనస్ విలియమ్స్ మూడో రౌండ్ పోరులో 6-3, 6-4 తేడాతో 95వ ర్యాంకు క్రీడాకారిణి మరియా సక్కరి (గ్రీస్)పై విజయం సాధించగా, ముగురుజా 6-1, 6-1 తేడాతో 31వ సీడ్ మగ్దలెనా రిబరికోవాను, 2011, 2014లో వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సాధించిన పెట్రా క్విటోవా 6-0, 6-4 తేడాతో 18వ సీడ్ క్రీడాకారిణి కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్)ను మట్టికరిపించారు.
ఇస్నర్‌కు జ్వెరెవ్ షాక్
పురుషుల సింగిల్స్ విభాగంలో క్రొయేషియాకి చెందిన ఐదో సీడ్ ఆటగాడు మారిన్ సిలిక్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వింబుల్డన్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత గాయం కారణంగా కొద్ది రోజుల క్రితం వరకూ ఆటకు దూరంగా ఉన్న అతను మూడో రౌండ్ పోరులో అర్జెంటీనాకు చెందిన 29వ సీడ్ ఆటగాడు డిగో ష్వార్ట్జ్‌మన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడి 6-4 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకున్న సిలిక్‌కి ఆ తర్వాత ప్రత్యర్థి చుక్కలు చూపించాడు. ఫలితంగా 5-7, 5-7, 4-6 తేడాతో వరుసగా మూడు సెట్లు చేజార్చుకున్న సిలిక్‌కు ఓటమి తప్పలేదు. అలాగే అమెరికా క్రీడాకారుడు జాన్ ఇస్నర్ కూడా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పదో సీడ్ ఆటగాడిగా బరిలోకి దిగిన ఇస్నర్ మూడో రౌండ్‌లో 4-6, 3-6, 6-7(7/5) తేడాతో జర్మనీకి చెందిన 23వ సీడ్ ఆటగాడు మిషా జ్వెరెవ్ చేతిలో పరాజయం పాలవగా, ఇతర మ్యాచ్‌లలో ఇటలీకి చెందిన పౌలో లొరెంజీ 6-2, 6-4, 6-4 తేడాతో తమ దేశానికే చెందిన థామస్ ఫాబియానోపై, దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ ఆండర్సన్ 6-4, 6-3, 6-2 తేడాతో బోర్నా కొరిక్ (క్రొయేషియా)పై విజయం సాధించి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.