క్రీడాభూమి

కోహ్లీ, రోహిత్ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, అక్టోబర్ 29: కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ శతకాలతో కదంతొక్కి, ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన చివరి వనే్డలో న్యూజిలాండ్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకూ హోరాహోరీగా పోరాడిన కివీస్ చివరికి ఏడు వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 15 పరుగుల దూరంలో నిలవగా, మ్యాచ్ ఎవరి పక్షానికి చేరుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, ఆ కీలక ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా వేశాడు. ఎనిమిది పరుగులిచ్చిన అతను ఒక వికెట్ కూడా తీసి, కివీస్ పరుగుల వేటను అడ్డుకున్నాడు. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉందని తెలిసినప్పటికీ, తమ బౌలింగ్ సామర్థ్యంపై నమ్మకం ఉంచిన అతను ఫీల్డింగ్‌వైపు మొగ్గు చూపాడని స్పష్టమవుతున్నది. శిఖర్ ధావన్ కేవలం 14 పరుగులు చేసి, టిమ్ సౌథీ బౌలింగ్‌లో విలియమ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతను ఔటైన వెంటనే, భారత బ్యాటింగ్‌ను కట్టడి చేస్తామన్న ధీమా కివీస్ ఆటగాళ్లలో కనిపించింది. కానీ, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీతో కలిసి రోహిత్ స్కోరుబోర్డును పరుగులు తీయించాడు. వీరిద్దరూ శతకాలతో రాణించడంతో, గ్రీన్ పార్క్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై సాధించిన 303 పరుగుల స్కోరును భారత్ అధిగమించగలిగింది. కోహ్లీ, రోహిత్ రెండో వికెట్‌కు 211 బంతుల్లో 230 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం కివీస్ పేలవమైన బౌలింగ్‌కు అద్దం పడుతుంది. 138 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 18 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 147 పరుగులు సాధించిన తర్వాత మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో టిమ్ సౌథీ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 6 బంతుల్లో 8 పరుగులు చేసి, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లోనే టిమ్ సౌథీకే దొరికాడు. జట్టు స్కోరు 300 పరుగుల మైలురాయిని అధిగమించిన తర్వాత కోహ్లీ వికెట్ కూలింది. 106 బంతుల్లో 113 పరుగులలు సాధించిన అతనిని విలియమ్‌సన్ క్యాచ్ పట్టగా టిమ్ సౌథీ వెనక్కు పంపాడు. మహేంద్ర సింగ్ ధోనీ (25), ఇన్నింగ్స్ చివరి బంతికి కేదార్ జాధవ్ (18) ఔట్‌కాగా, నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్లకు 337 పరుగులు సాధించగలిగింది. దినేష్ కార్తీక్ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఆడం మిల్నే, మిచెల్ సాంట్నర్ తలా రెండేసి వికెట్లు కూల్చారు.
టాప్ ఆర్డర్ పోరాటం
భారత్‌ను ఓడించి, సిరీస్‌ను సాధించాలన్న పట్టుదలతో ఉన్న న్యూజిలాండ్ 44 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను మార్టిన్ గుప్టిల్ రూపంలో కోల్పోయింది. 14 బంతుల్లో 10 పరుగులు చేసిన అతను జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో దినేష్ కార్తీక్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విలియమ్‌సన్‌తో కలిసి ఓపెన్ కొలిన్ మున్రో జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ 109 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 62 బంతుల్లో, 75 పరుగులు చేసిన మున్రోను యుజువేంద్ర చాహల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది.విలియమ్‌సన్ 84 బంతులు ఎదుర్కొని 64, రాస్ టేలర్ 47 బంతుల్లో 39, టామ్ లాథమ్ 52 బంతుల్లో 65 చొప్పున పరుగులు చేసి, కివీస్ ఆశలను సజీవంగా నిలిపారు. హెన్రీ నికొల్స్ 24 బంతుల్లోనే 37 పరుగులు చేసి అవుట్‌కావడంతో ఆ జట్టు విజయావకాశాలు దెబ్బతిన్నాయి. మిచెల్ సాంట్నర్ 9 పరుగులు చేసి పెవిలియన్ చేరగా న్యూజిలాండ్ 50 ఓవర్లలో 331 పరుగులకు చేరగలిగింది. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 8, టిమ్ సౌథీ 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

* రోహిత్ శర్మతో కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించడం కోహ్లీకి ఇది నాలుగోసారి. వనే్డ చరిత్రలో ఇది కూడా ఒక రికార్డే. గౌతం గంభీర్/ విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, సచిన్ తెండూల్కర్/ ఉపుల్ తరంగ/ మహేల జయవర్ధనే మూడేసి పర్యాయాలు వనే్డల్లో డబుల్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్‌ను సాధించారు.
* రోహిత్ శర్మ 15వ వనే్డ సెంచరీని సాధించి, భారత్ తరఫున అత్యధిక శతకాల జాబితాలో వీరేందర్ సెవాగ్ సరసన స్థానం సంపాదించాడు. సచిన్ తెండూల్కర్ 49, విరాట్ కోహ్లీ 32, సౌరవ్ గంగూలీ 22 అతని కంటే ముందున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకూ రోహిత్‌కు ఇది 13వ శతకం. ఈ కాలంలో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ (19), హషీం ఆమ్లా (16) తర్వాత మూడో స్థానాన్ని అతను ఆక్రమించాడు.
* కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రోహిత్ సెంచరీ చేయడం ఇది రెండోసారి. ఇంతకు ముందు, 2015లో అతను దక్షిణాఫ్రికాపై 150 పరుగులు సాధించాడు. మరే ఇతర బ్యాట్స్‌మన్ ఇక్కడ రెండు సెంచరీలు చేయలేదు. కాగా, ఒకే మైదానంలో ఒకటికంటే ఎక్కువ శతకాలు సాధించడం రోహిత్‌కు ఇది మూడోసారి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో అతను రెండేసి సెంచరీలు నమోదు చేశాడు.

వనే్డ ఇంటర్నేషనల్ కెరీర్‌లో అత్యంత వేగంగా 9,000 పరుగుల మైలురాయిని చేరిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. అతను 194 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అంతకు ముందు 205వ ఇన్నింగ్స్‌లో తొమ్మిది వేల పరుగులను పూర్తి చేసిన ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) రికార్డును కోహ్లీ అధిగమించాడు. మొత్తం మీద వనే్డల్లో ఈ మైలురాయిని దాటిన 19వ బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీకి అగ్రస్థానం లభించింది. ఈ ఏడాది అతను ఇంత వరకూ 1,460 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న 1,424 పరుగుల రికార్డును అధిగమించాడు. అంతేగాక, ఒకే ఏడాదిలో ఆరు సెంచరీలు చేసిన కెప్టెన్లలోనూ కోహ్లీ నంబర్ వన్‌గా నిలవడం విశేషం. గత పదేళ్ల కాలంలో ఈ విధంగా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన రెండో కెప్టెన్ అతను.

చిత్రాలు..సెంచరీ హీరో రోహిత్ శర్మ,
*కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ