క్రీడాభూమి

ఇప్పుడు మేమే చాంపియన్లం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: అంతర్జాతీయ బాడ్మింటన్ టోర్నమెంట్లలో ఇప్పటివరకూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన లిన్ దాన్, లీ చోంగ్ వెయి లాంటి మేటి ఆటగాళ్ల శకం ముగిసినట్లేనని, ఇప్పుడు ఈ టోర్నీల్లో ఎవరైనా రాణించేందుకు విస్తృతమైన అవకాశాలు లభిస్తున్నాయని భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. కెరీర్‌లో మునుపెన్నడూ లేనంత అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న ‘ఆంధ్రావాలా’ శ్రీకాంత్ కేవలం ఐదు నెలల వ్యవధిలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను కైవసం చేసుకున్న విషయం విదితమే. దీంతో అతను ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన తొలి భారతీయుడిగా, ప్రపంచంలో ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా ఆవిర్భవించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టోర్నమెంట్లు కేవలం కొద్ది మంది ఆటగాళ్ల చుట్టూనే తిరగడం లేదని, ఈ టోర్నీల్లో తనతో పాటు ఎంతో మంది ఆటగాళ్లు విజయం సాధించగలుగుతున్నారని శ్రీకాంత్ స్పష్టం చేశాడు. ‘లీ చోంగ్ వెయి (మలేషియా), లిన్ దాన్ (చైనా) లాంటి ఆటగాళ్లు చాలా కాలం నుంచి గుత్త్ధాపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన అంతర్జాతీయ బాడ్మింటన్ టోర్నీల్లో ఇప్పుడు చాలా మంది సత్తా చాటుకోగలుగుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు మన దేశానికి చెందిన మరికొంత మంది ఆటగాళ్లు, అలాగే డెన్మార్క్‌కు చెందిన విక్టర్ ఎక్సెల్‌సెన్ లాంటి వారు ఈ టోర్నీల్లో విజయం సాధించగలుగుతున్నారు. ఏ ఆటలోనైనా ఎక్కువ మంది చాంపియన్లు ఉండటం చాలా మంచిది’ అని శ్రీకాంత్ విలేఖరులతో అన్నాడు. ఇటీవల డెన్మార్క్ ఓపెన్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీల్లో టైటిళ్లను కైవసం చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రీకాంత్‌ను హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో ఘనంగా సత్కరించారు. ఈ విజయాలకు ముందు అతను ప్రస్తుత సీజన్‌లో ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో కూడా టైటిళ్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ బాడ్మింటన్ టోర్నమెంట్లలో చాలా మంది ఆటగాళ్లు చక్కగా రాణిస్తున్నారని, అదృష్టం కలసి వస్తే ఎవరు ఎవరినైనా ఓడించగలుగుతున్నారని శ్రీకాంత్ అన్నాడు. ప్రస్తుతం లీ చోంగ్, లిన్ దాన్ లాంటి ఆటగాళ్ల కెరీర్ చరమాంకంలో ఉందని మీరు భావిస్తున్నారా? అని విలేఖర్లు ప్రశ్నించగా, తాను అలా అనుకోవడం లేదని, బాడ్మింటన్‌లో చాలా కాలం పాటు ఆధిపత్యాన్ని కొనసాగించి అత్యున్నత స్థాయికి చేరుకున్న వారికి మళ్లీ పుంజుకునేందుకు అవసరమైన అనుభవం ఎంతో ఉందని శ్రీకాంత్ తెలిపాడు. ‘ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్‌లో ఆడిన లిన్ దాన్ లాంటి ఆటగాళ్లను ఎవరూ తేలిగ్గా తీసుకోరు. వారి నుంచి ప్రత్యర్థులకు ఎప్పుడూ తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. కానీ మనం కూడా రాణించగలమన్న నమ్మకం మనకు ఉండి తీరాలి’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.
గత వారం ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించి సత్తా చాటుకున్న శ్రీకాంత్ ఇప్పుడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేందుకు చేరువ అవుతున్నాడు. అయితే దీని గురించి తాను పెద్దగా ఆలోచించదల్చుకోలేదని అతను స్పష్టం చేశాడు. ‘నిజంగానే నేను ర్యాంకింగ్‌ల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. గత పది నెలల కాలం నుంచి నేను చక్కగా రాణించగలుగుతున్నా. మున్ముందు కూడా ఇదేవిధమైన ప్రదర్శన కొనసాగించి ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నా’ అని శ్రీకాంత్ చెప్పాడు. త్వరలో జరుగనున్న చైనా ఓపెన్ టోర్నీలో మీరు విజయం సాధిస్తే ప్రపంచ బాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోగలుగుతారా? అని ప్రశ్నించగా, ఎవరైనా స్థిరంగా రాణించగలిగితే ర్యాంకులు వాటంతట అవే వస్తాయని, అంతే తప్ప ర్యాంకుల వెనుక పరుగెత్తాలని తాను అనుకోవడం లేదని, ప్రతి టోర్నమెంట్‌లో రాణించాలని మాత్రమే కోరుకుంటున్నానని శ్రీకాంత్ స్పష్టం చేశాడు. వచ్చే వారం నేషనల్ చాంపియన్‌షిప్‌లో పోటీ పడబోతున్నానని, ఆ తర్వాత చైనా ఓపెన్, హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లతో పాటు డిసెంబర్‌లో దుబాయ్‌లో జరుగనున్న బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నానని శ్రీకాంత్ వివరించాడు. ‘ప్రస్తుతం నేను చాలా సంతోషంతో ఉన్నా. ఈ ఏడాది ఇప్పటివరకూ నేను టైటిళ్లు సాధించిన నాలుగు సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లు ఎంతో భిన్నమైనవి. 2015లో ఇండియా ఓపెన్ విజేతగా నిలిచిన నేను ఇండోనేషియా ఓపెన్ టైటిల్‌ను సాధించేందుకు చాలా సమయం పట్టింది’ అని శ్రీకాంత్ తెలిపాడు. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో విక్టర్ ఎక్సెల్‌సెన్‌ను ఓడించిన తనకు కొద్ది రోజుల క్రితం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్‌లో తన సహచరుడు హెచ్‌ఎస్.ప్రణయ్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురైందని శ్రీకాంత్ చెప్పాడు.

చిత్రం..భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్