క్రీడాభూమి

బౌలర్లు గెలిపించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, డిసెంబర్ 6: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌తో జరిగిన ఆధిపత్య పోరులో ఆస్ట్రేలియా బౌలర్లే గెలిచారు. కష్టసాధ్యమనుకున్న విజయాన్ని వారే జట్టుకు అందించారు. దీనితో, రెండో టెస్టును తన ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా, ఐదు మ్యాచ్‌ల ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 442 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అందుకు సమాధానంగా ఇంగ్లాండ్ 227 పరుగులు మాత్రమే సాధించగలిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో 215 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమై, 138 పరుగులకే కుప్పకూలింది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని అందుకోవడంతో ఇంగ్లాండ్ ముందు 354 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. దీనిని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ మ్యాచ్ నాలుగో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. దీనితో చివరి రోజున ఆటలో 178 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో ఆరు వికెట్లు మిగిలాయి. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ది పైచేయి అవుతుందా లేక ఆస్ట్రేలియా బౌలర్లు అనుకున్నది సాధిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్‌కు విజయం అసాధ్యమేమీ కాదన్న వాదన బలంగా వినిపించింది. అయితే, కీలకమైన చివరి రోజున ఆస్ట్రేలియా బౌలర్ల హవా కొనసాగింది. ఆట మొదలైన తొలి ఓవర్‌లోనే క్రిస్ వోక్స్ ఔటయ్యాడు. 5 పరుగులు చేసిన అతనిని వికెట్‌కీపర్ టిమ్ పైన్ క్యాచ్ పట్టగా జొష్ హాజెల్‌వుడ్ పెవిలియన్‌కు పంపాడు. క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి విశేష ప్రయత్నం చేస్తూ, పోరాటాన్ని కొనసాగించిన కెప్టెన్ జో రూట్ 67 పరుగులు చేసి, హాజెల్‌వుడ్ బౌలింగ్‌లోనే పైన్‌కే దొరికిపోయాడు. జట్టును ఆదుకుంటాడనుకున్న మోయిన్ అలీ కేవలం రెండు పరుగులు చేసి, నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెవెనుదిరిగాడు. చివరిలో జానీ బెయిర్‌స్టో జట్టును ఆదుకోవడానికి విఫలయత్నం చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ 8 పరుగులు చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పైన్‌కు చిక్కగా, బెయిర్‌స్టో 36 పరుగులు సాధించి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అతని వికెట్‌తో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌కు 84.2 ఓవర్లలో 233 పరుగుల వద్ద తెరపడింది. నాటౌట్‌గా నిలిచిన జేమ్స్ ఆండర్సన్‌కు ఒక్క బంతిని ఎదుర్కొనే అవకాశం కూడా రాలేదు. మిచెల్ స్టార్క్ 88 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టగా, జొష్ హాజెల్‌వుడ్, నాథన్ లియాన్ చెరి రెండు వికెట్లు తీశారు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి, ఆస్ట్రేలియా మెరుగైన స్కోరును సాధించేందుకు తోడ్పడిన షాన్ మార్ష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. యాషెస్ సిరీస్ చరిత్రలో మొట్టమొదటిసారి డే/నైట్ ఈవెంట్‌గా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిరస్మరణీయ విజయాన్ని అందుకొని, ఈనెల 14 నుంచి పెర్త్‌లో మొదలయ్యే మూడో టెస్టులోనూ గెలవడం ద్వారా సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే దూకుడుమీద ఉంది. ఆలోగా 9, 10 తేదీల్లో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఒక ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 149 ఓవర్లలో 8 వికెట్లకు 442 డిక్లేర్డ్ (డేవిడ్ వార్నర్ 47, ఉస్మాన్ ఖాజా 53, స్టీవెన్ స్మిత్ 40, పీటర్ హ్యాండ్స్‌కోమ్ 36, షాన్ మార్ష్ 126, టిమ్ పైన్ 57, జేమ్స్ ఆండర్సన్ 1/74, స్టువర్ట్ బ్రాడ్ 2/72, క్రిస్ వోక్స్ 1/84, క్రెగ్ ఓవర్టన్ 3/105).
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 76.1 ఓవర్లలో 227 ఆలౌట్ (అలస్టర్ కుక్ 37, క్రిస్ వోక్స్ 36, క్రెగ్ ఓవర్టన్ 41, నాథన్ లియాన్ 4/60, మిచెల్ స్టార్క్ 3/49, పాట్ కమిన్స్ 2/47).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 58 ఓవర్లలో 138 ఆలౌట్ (ఉస్మాన్ ఖాజా 20, మిచెల్ స్టార్క్ 20, షాన్ మార్ష్ 19, జేమ్స్ ఆండర్సన్ 7/43, క్రిస్ వోక్స్ 4/36).
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 84.2 ఓవర్లలో ఆలౌట్ 233 (మార్క్ స్టోన్‌మన్ 35, జో రూట్ 67, దావీద్ మలాన్ 29, జానీ బెయిర్‌స్టో 36, మిచెల్ స్టార్క్ 3/88, జొష్ హాజెల్‌వుడ్ 2/49, పాట్ కమిన్స్ 1/39, నాథన్ లియాన్ 2/45).