క్రీడాభూమి

ధోనీకే చెన్నై పగ్గాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 7: చెన్నై సూపర్ కింగ్స్ 2015 రోస్టర్ నుంచి ఐదుగురు ఆటగాళ్లను తమ వద్ద ఉంచుకోవచ్చని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ చెన్నై జట్టుకు వస్తాడనీ, అతనికే పగ్గాలు దక్కుతాయనీ అభిమానులు ఆశిస్తున్నారు. చెన్నై ఫ్రాంచైజీ డైరెక్టర్ జార్జి జాన్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ధోనీని సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నాడు. పూర్వం మాదిరిగానే చెన్నై వచ్చే ఐపీఎల్‌లోనూ అద్భుతాలు సృష్టిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశాడు. అయితే, మరో స్టార్ ఆటగాడు సురేష్ రైనా గురించి అతను ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమానార్హం. స్పాట్ ఫిక్సింగ్ కేసు తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో రెండేళ్ల సస్పెన్షన్ వేటుకు గురైన చెన్నై వచ్చే ఏడాది మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న నేపథ్యంలో, ఆ జట్టులో ఎవరెవరు ఉంటారన్నది ఆసక్తిని రేపుతున్నది. టోర్నమెంట్ పాలక మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం సస్పెన్షన్ కాలాన్ని పూర్తి చేసుకున్న సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ జట్లు తమతమ పాత ఆటగాళ్ల నుంచి ముగ్గురు భారతీయులను, ఇద్దరు విదేశీయులను తమ వద్దే ఉంచుకోవచ్చు. లేదా ఐదుగురు భారతీయులను డీటైన్ చేయవచ్చు. మిగతా వారిని మాత్రం వేలంలో కొనుగోలు చేయాలి. కాగా, ధోనీ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, దక్షిణాఫ్రికా స్టార్ ఫఫ్ డు ప్లెసిస్, డ్వెయిన్ బ్రేవో స్థానాలు దాదాపుగా ఖాయమని స్పష్టమవుతున్నది. ధోనీకి సన్నిహితంగా ఉండే రవీంద్ర జడేజాను జట్టులోనే ఉంటుకోవాలని అనుకుంటే రైనా వేలానికి వెళ్లక తప్పదు. జట్టుకు సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడమేగాక, ఆ ఫ్రాంచైజీ అధినేత, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు అత్యంత సన్నిహితుడు కావడం కూడా ధోనీ పట్ల సీఎస్‌కే మొగ్గు చూపడానికి కారణమని తెలుస్తున్నది. స్థానికుడైన అశ్విన్‌ను తీసుకోకపోతే, అభిమానుల నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం సీఎస్‌కేకు ఉందని అంటున్నారు. అందుకే వీరిద్దరినీ విడుదల చేయరాదని తీర్మానించినట్టు సమాచారం. జడేజా ప్రస్తుతం జాతీయ జట్టులో ఆడుతున్నాడు కాబట్టి, అతని పేరు కూడా వినిపిస్తున్నది. అదే నిజమైతే, ఐపీఎల్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా రికార్డులు సృష్టించిన సురేష్ రైనా పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్‌కు రైనా నాయకత్వం వహించాడు. ధోనీ రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ తరఫున ఆడాడు. మొదట ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ అతనిని తొలగించి, స్టీవెన్ స్మిత్‌కు పగ్గాలు అప్పచెప్పింది. ఐపీఎల్‌లో గణాంకాలను పరిశీలిస్తే, ధోనీ కంటే రైనా చాలా మెరుగైన స్థితిలో ఉన్నాడు. అయితే, ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం ధోనీవైపే మొగ్గు చూపుతున్నది. దీనితో ఈ ఏడాది రైజింగ్ పుణే, గుజరాత్ లయన్స్ తరఫున ఆడిన మిగతా ఆటగాళ్లతోపాటు అతను కూడా వేలానికి వెళ్లాల్సి వస్తుంది.

చిత్రం..మహేంద్ర సింగ్ ధోనీ