క్రీడాభూమి

దేశంలో 81మ్యాచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారత్‌లో 2019-2023 కాలానికి ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం 81 మ్యాచ్‌లు జరుగుతాయి. సోమవారం జరిగిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఫ్యూచర్ టూర్ ప్రోగామ్ (ఎఫ్‌టీపీ)ని లాంఛనంగా ఆమోదించారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కాగా, రాబోయే ఎఫ్‌టీపీలో 30 మ్యాచ్‌లు అదనంగా జరుగుతాయి. అయితే, క్రికెటర్లు మ్యాచ్‌లు ఆడాల్సిన రోజులను బీసీసీఐ తగ్గించింది. రాబోయే ఎఫ్‌టీపీ ప్రకారం ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లను ఢీ కొంటుంది. ఇంతకు ముందు రూపొందిన ప్రణాళికను అనుసరించి 2019 నుంచి 2023 వరకూ ఐదేళ్ల కాలానికి 51 మ్యాచ్‌లు ఉండేవని, అయితే, ఎస్‌జీఎంలో ఈ సంఖ్యను 81కి పెంచుతూ తీర్మానాన్ని ఆమోదించామని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. మ్యాచ్‌లు 60 శాతం పెరిగితే, మ్యాచ్‌లు ఆడే రోజులు 20 శాతం తగ్గినట్టు వివరించాడు. ఏఏ మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ ఉంటాయనే విషయాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని అమితాబ్ చౌదరి తెలిపాడు. కొత్త ఎఫ్‌టీపీలో భారత్ స్వదేశంలో ఎక్కువ సంఖ్యలో టీ-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుందని పేర్కొన్నాడు. అదే విధంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లతో టెస్టు సిరీస్‌లు ఉంటాయన్నాడు. తక్కువ స్థాయిలో ఉన్న జట్లతోనూ, అన్ని ఫార్మాట్స్‌లో సిరీస్‌లను రూపొందిస్తామని తెలిపాడు. కేవలం నాలుగు జట్లే ఎక్కువ సంఖ్యలో టెస్టు మ్యాచ్‌లు ఆడతాయా? అని ఓ విలేఖరి అడినప్పుడు ‘అంతే అనుకోవాలి’ అని సమాధానమిచ్చాడు. మొత్తం మీద ఐదేళ్ల కాలానికి 306 ప్లేయింగ్ డేస్ ఉంటాయని, ప్రస్తుత ఎఫ్‌టీపీలో ఇవి 390 రోజులని అమితాబ్ చౌదరి వివరించాడు. 2018లో మ్యాచ్‌ల ప్రసార హక్కులకు మళ్లీ బిడ్డింగ్‌ను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో, రాబోయే ఎఫ్‌టీపీలో బీసీసీఐ బాగా లాభపడుతుందని అన్నాడు.
కొచ్చితో రాజీ లేదు
కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీతో రాజీ పడకూడదని బీసీసీఐ తీర్మానించింది. ఇంతకు ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక ఫ్రాంచైజీగా ఉన్న కొచ్చి నిర్ణీత సమయానికి బిడ్డింగ్ మొత్తాన్ని కట్టకపోవడంతో బీసీసీఐ నుంచి సస్పెన్షన్ వేటును ఎదుర్కొంది. అయితే, ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం కొచ్చిలో ఆడాల్సిన కనీస మ్యాచ్‌లను కేటాయించలేదని ఈ ఫ్రాంచైజీ ఆరోపించింది. ఒప్పందాన్ని బీసీసీఐ ఉల్లంఘించిందని, అందుకే తమకు నష్టపరిహారం చెల్లించాని కోర్టుకెక్కింది. ఈ వాదనతో ఏకీభవిస్తూ, 850 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని ఇటీవలే కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో, కొచ్చితో రాజీకి రావాలని, ఎంతోకొంత ముట్టచెప్పి వివాదానికి తెరదించాలని బీసీసీఐలోని ఒక వర్గం సూచించింది. కానీ, ఎస్‌జీఎంలో ఎక్కువ మంది సభ్యులు రాజీకి సుముఖత వ్యక్తం చేయలేదు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత, ఉన్నత కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని బీసీసీఐ తీర్మానించింది.
షరతులతో ఆర్‌సీఏకు గ్రీన్ సిగ్నల్
రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సీఏ)పై విధించిన సస్పెన్షన్‌ను కొన్ని షరతులతో ఎత్తివేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీని ఏ రకంగానూ జోక్యం చేసుకోనివ్వరాదన్నది ఇందులో ప్రధాన షరతుగా తెలుస్తున్నది. లలిత్ మోదీపై బీసీసీఐ మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ రూపకర్తగా, దానిని క్రికెట్ చరిత్రలోనే ఒక నూతనాధ్యాయంగా తీర్చిదిద్దిన అతను కొద్దికాలానికే సర్వం తానేనన్న రీతిలో ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అందుకే, అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అతనిపై వేటు వేశాడు. ఆర్‌సీఏలో లలిత్ మోదీ జోక్యం చేసుకోవడంతో, ఆ సంఘాన్ని కూడా బీసీసీఐ నిషేధించింది. ఇప్పుడు ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
డోపింగ్ పరీక్షకు ససేమిరా
క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు జరపాలంటూ జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) చేసిన డిమాండ్‌ను బీసీసీఐ తోసిపుచ్చింది. డోపింగ్ పరీక్షలకు అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) మార్గదర్శకంతోనే ఈ ప్రతిపాదన చేసినట్టు నాడా వాదిస్తున్నప్పటికీ బీసీసీఐ సానుకూలంగా స్పందించలేదు. వాడానే తాము గుర్తిచడం లేదని, కాబట్టి నాడా ప్రతిపాదనలను ఆమోదించే ప్రసక్తే లేదని సోమవారం నాటి ఎస్‌జీఎంలో బీసీసీఐ సభ్యులు స్పష్టం చేశారు.