క్రీడాభూమి

కోహ్లీ Vs గేల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 30: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ రెండో సెమీ ఫైనల్‌లో భారత్, వెస్టిండీస్ జట్లు ఢీకొంటున్నప్పటికీ, పోరు మాత్రం ఇరు జట్ల స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ మధ్యే ఉంటుందనేది వాస్తవం. ఇద్దరూ ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించగల సమర్థులే. జట్లు తమపై ఆధారపడేలా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న వారే. కాగా ఈ టోర్నీలో మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడి పరాజయాన్ని ఎదుర్కొన్న భారత జట్టు ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లను గెల్చుకొని సెమీస్ చేరింది. పాకిస్తాన్‌పై సులభంగానే నెగ్గినప్పటికీ, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి అంచున నిలిచి, అతి కష్టం మీద బయటపడింది. న్యూజిలాండ్‌పై 23 పరుగులు చేసిన కోహ్లీ, పాకిస్తాన్‌పై అజేయంగా 55 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్‌పై 24 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ చేతిలో 47 పరుగుల తేడాతో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా తర్వాత కోల్‌కతా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొని మరో 13 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తడబడినప్పటికీ ఒక పరుగు తేడాతో గట్టెక్కింది. హార్దిక్ పాండ్య వేసిన చివరి ఓవర్‌లో ఓ రనౌట్‌సహా మొత్తం మూడు వికెట్లు కూలడం టీమిండియాను గెలిపించింది. పాండ్య ఒక్కసారిగా లక్షలాది మందికి అభిమాన క్రికెటర్‌గా మారిపోయాడు.
వెస్టిండీస్ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా, ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్‌లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. అప్పటికి 10 బంతులు మిగిలి ఉన్నాయి. మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడిన విండీస్ మూడు బంతులు మిగిలి ఉండగా, మూడు వికెట్ల తేడాతో గెలిచింది. హ్యాట్రిక్ విజయాలను సాధించి మంచి ఊపుమీద ఉన్న వెస్టిండీస్ ఏమాత్రం ప్రాధాన్యం లేని చివరి గ్రూప్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై ప్రయోగాలు చేసింది. కానీ, అవి బెడిసికొట్టగా, ఐదు బంతులు మిగిలి ఉండగా, ఆరు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ అజేయ శతకంతో రెచ్చిపోయాడు. శ్రీలంకపై బ్యాటింగ్ చేసే అవకాశం అతనికి లభించలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులే చేసిన అతను బౌలింగ్‌లో రాణించి రెండు వికెట్లు పడగొట్టాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతినిచ్చింది.
బ్యాటింగ్‌లో భారత్ టాప్
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో పటిష్టంగా ఉంది. ధోనీ స్వయంగా మంచి బ్యాట్స్‌మన్. కోహ్లీ కీలక భూమిక పోషిస్తుండగా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఆజింక్య రహానే వంటి హేమాహేమీలు జట్టులో ఉన్నారు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్లుగా సేవలు అందిస్తున్నారు. బ్యాటింగ్‌లో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలో తెలియక జట్టు మేనేజ్‌మెంట్ ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. బౌలింగ్ విభాగానికి వస్తే, ఆశిష్ నెహ్రా, రవిచంద్రన్ అశ్విన్ కీలక భూమిక పోషిస్తున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా భారీగా పరుగులిస్తుండగా, హార్దిక్ పాండ్య మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్నాడు. హర్భజన్ సింగ్, పవన్ నేగీలకు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ విభాగం కొంత బలహీనంగా కనిపిస్తున్నది. టీమిండియా హాట్ ఫేవరిట్‌గా మైదానంలోకి దిగుతున్నప్పటికీ, వెస్టిండీస్ నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయోనన్న భయం అభిమానులను వెంటాడుతున్నది. 2010లో టి-20 వరల్డ్ కప్‌ను గెల్చుకున్న విండీస్ మరోసారి టైటిల్ కోసం పోటీపడుతుండగా, మొదటి ట్రోఫీని కైవసం చేసుకున్న భారత్ ఫైనల్‌పై కనే్నసింది. దీనితో పోరు ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయం.
కుదుటపడుతున్న విండీస్
వెస్టిండీస్ జట్టు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి), ఆటగాళ్ల మధ్య చాలాకాలం నెలకొన్న విభేదాలు ఆ జట్టు పతనానికి కారణమయ్యాయి. టి-20 వరల్డ్ కప్‌లో సీనియర్ ఆటగాళ్లు ఆడతారా లేక ద్వితీయ శ్రేణి క్రికెటర్లతోనే నడిపిస్తారా అన్న అనుమానాలు చివరి క్షణం వరకూ అభిమానులను వెంటాడాయి. ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో సమస్యకు తెరపడింది. క్రిస్ గేల్ వంటి సీనియర్లు మళ్లీ జట్టులోకి వచ్చారు. అతనితోపాటు కెప్టెన్ డారెన్ సమీ, డ్వెయిన్ బ్రేవో, మార్లొన్ సామ్యూల్స్ వంటి ఆటగాళ్లకు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి అనుభవం ఉంది. మిగతా వారంతా యువ ఆటగాళ్లే. అనుభవ రాహిత్యం ఆ జట్టుకు సమస్యగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, తమపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో విండీస్ క్రికెటర్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. గెలిచినా, ఓడినా ఒకటేనన్న అభిప్రాయంతో తెగిస్తున్నందువల్ల విండీస్ చిరస్మరణీయ విజయాలను అందుకోగలుగుతున్నది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడినప్పటికీ, ఆ పోరులో బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించడానికి ప్రయోగాలు చేసింది. అందుకే, ఆ మ్యాచ్‌ని చేజార్చుకున్నా ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. భారత్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి విండీస్ సిద్ధమైంది.