క్రీడాభూమి

శ్రీశాంత్ పిటిషన్‌పై బీసీసీఐకి సుప్రీం నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: తనపై జీవితకాల సస్పెన్షన్‌ను విధించడాన్ని సవాలు చేస్తూ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కు నోటీసు జారీ చేసింది. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ శ్రీశాంత్ వేసిన కేసుపై నాలుగు వారాల్లోగా స్పందించాలని బీసీసీఐని ఆదేశించింది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తెరపైకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అప్పటి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాను ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయడంతో యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అప్పుడు మొదలైన ప్రకంపనలు ఇప్పటికీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్‌పై విచారణ మొదలుకొని లోధా కమిటీని నియమించి, ఆ కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రతిపాదనలను అమలు చేయాలని ఆదేశించడం వరకూ సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో వివిధ నిర్ణయాలు తీసుకోవడం భారత క్రికెట్ ప్రక్షాళనకు మార్గాన్ని సుగమమం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నో మలుపులకు శ్రీశాంత్, మరో ఇద్దరి స్పాట్ ఫిక్సింగ్ కేసు ప్రధాన కారణమైంది. నిజానికి స్పాట్ ఫిక్సింగ్ కేసు తెరపైకి వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకొని ఉంటే బీసీసీఐ పరిస్థితి మరోలా ఉండేది. కానీ, అప్పట్లో బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించిన శ్రీనివాసన్‌కు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఉండడం, దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా అతని అల్లుడు గురునాథ్ మెయప్పన్ అధికారం చెలాయించడం, పందాలు కాయడంతో అతని పేరు కూడా వినిపించడం వంటి కారణాలతో బీసీసీఐ నోరు మెదపలేకపోయింది. దాని ఫలితమే ఇప్పటికీ బీసీసీఐ అధికారులను వెంటాడుతున్నది. తన దుందుడుకు చేష్టలతో బీహార్ క్రికెట్ సంఘాన్ని రద్దు చేసిన బీసీసీఐ కొరివితో తలగోక్కుంది. ఆ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ కోర్టుకు ఎక్కడంతో, స్పాట్ ఫిక్సింగ్ అంశంతోపాటు, శ్రీనివాసన్ వంటి వారికి బిసిసిఐలో ఉన్న ద్వంద్వ ప్రయోజనాల అంశం కూడా బట్టబయలైంది. బోర్డు అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలతోనే సమస్యలు తలెత్తుతున్నాయన్న విషయాన్ని గమనించిన సుప్రీం కోర్టు దేశంలో క్రికెట్ ప్రక్షాళకు శ్రీకారం చుట్టింది. ముకుల్ ముద్గల్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు విడతల్లో ఇచ్చిన నివేదికల ఆధారంగా, ఐపీఎల్ దోషులను ఖరారు చేసింది. అయితే, వారికి శిక్షను ఖాయం చేయడంతోపాటు భారత్‌లో క్రికెట్‌ను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను లోధా కమిటీకి అప్పగించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి, అందులోని అంశాలను తు.చ తప్పకుండా అమలు చేయాలని బీసీసీఐని ఆదేశించింది. కానీ, సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసిన బీసీసీఐ అధికారులు తాము తీసుకున్న గోతిలో తామే పడ్డారు. ఇప్పటికీ ఒకదాని తర్వాత మరొకటిగా కోర్టు కేసులు ఎదుర్కొంటునే ఉంది. భారత క్రికెట్‌ను పారదర్శకంగా ఉంచేందుకు వీలుగా లోధా కమిటీ చేసిన పలు సూచనలను అమలు చేసే క్రమంలోనే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి పదవి నుంచి అజయ్ షిర్కే వైదొలగాల్సి వచ్చింది. తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులతోపాటు, బోర్డు వ్యవహారాల పర్యవేక్షణకు సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సీఓఏ) పర్యవేక్షణలో లోధా కమిటీ సిఫార్సుల అమలుపై కసరత్తు జరుగుతున్నది. సుప్రీం కోర్టు ఇంకా తుది తీర్పును వెల్లడించలేదు. ఇలావుంటే, ఐపీఎల్ మాజీ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ వేసిన కేసు ఇంకా సుప్రీం కోర్టులో కొనసాగుతున్నది. ఒక కేసును కొలిక్కితెచ్చేలోగా మరో కేసు తెరపైకి వస్తున్నది. ఇప్పుడు తాజాగా శ్రీశాంత్ వేసిన కేసు వచ్చిపడింది. మరోసారి స్పాట్ ఫిక్సింగ్ అంశం విచారణ సమయంలో చర్చకు రానుండగా, బీసీసీఐ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.