క్రీడాభూమి

మరిన్ని పతకాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: వచ్చే ఆసియన్, ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు సాధించాలని వెయిట్‌లిఫ్టర్ ఆర్వీ రాహుల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోర్టులో ఇటీవల జరిగిన 21వ కామన్‌వెల్త్ క్రీడా పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకాన్ని రాహుల్ సాధించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి బుధవారం తెల్లవారుజామున ఇక్కడి గన్నవరం విమానాశ్రయానికి రాహుల్ చేరుకున్నాడు. పతకాన్ని సాధించి నగరానికి వచ్చిన తెలుగుతేజం రాహుల్‌కు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ సతీష్, శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి, ఎండీ బంగార్రాజు, రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎస్ సూర్యనారాయణ, శాప్ ఓఎస్డీ పీ రామకృష్ణ, రాహుల్ కోచ్, తండ్రి మాణిక్యాలరావు, గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం. గురునాథం, క్రీడాభిమానులు, బంధువులు ఉన్నారు. అనంతరం ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని రాహుల్ కలిశారు. కామన్‌వెల్త్ క్రీడా పోటీలలో బంగారు పతకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. శాలువతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర మంత్రి లోకేష్ కూడా అభినందించి మరిన్ని పతకాలు సాధించేందుకు ప్రభుత్వం తన వంతు సాయం చేస్తుందని హామీ ఇచ్చాడు.
చిన్నప్పటి మెలకువలు ఉపయోగపడ్డాయి
తాను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మెలకువలు కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించేందుకు ఉపయోగపడ్డాయని రాహుల్ తెలిపాడు. విమానాశ్రయంలో ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళుతున్నప్పుడు బంగారు పతకం సాధిస్తానన్న పూర్తి విశ్వాసంతోనే ఉన్నానని తెలిపాడు. 8 సంవత్సరాల వయస్సు నుండే తన స్వస్థలమైన స్టువర్టుపురంలో వెయిట్ లిఫ్టింగ్‌ను ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. తన తొలి గురువు తన తండ్రేనని తెలిపాడు. చీరాలలోని సర్వమిత్ర వ్యాయామశాల చీఫ్ కోచ్ శ్రీనివాస ప్రసాద్ వద్ద శిక్షణ పొందానని చెప్పాడు. రాష్టస్థ్రాయిలో బంగారు పతకం సాధించిన తరువాత తాను ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఏపీ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికయ్యానన్నాడు. తనలోని ప్రతిభను కోచ్ పి. మాణిక్యాలరావు గుర్తించి ప్రోత్సహించాడని తెలిపారు. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 35 పతకాలను, అంతర్జాతీయ స్థాయిలో 85 పతకాలను సాధించానన్నాడు. తనకు రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా రైల్వే శాఖ ఉద్యోగాన్నిచ్చిందని, రైల్వే తరఫున అనేక టోర్నమెంట్లలో పాల్గొన్నానని రాహుల్ వివరించాడు.

చిత్రం: గోల్డ్ కోస్ట్ కామన్‌వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన రాహుల్‌ను సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు