క్రీడాభూమి

ఎదురుదాడికి సన్‌రైజర్స్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేన్ విలియమ్‌సన్ కెప్టెన్సీలో వరుసగా మూడు విజయాలను సాధించిన తర్వాత, తొలిసారి మొహాలీలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. అయితే, తిరిగి హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌ను ఆడుతున్న నేపథ్యంలో, ఎదురుదాడికి దిగి, మళ్లీ విజయాల బాట పట్టడానికి సన్నద్ధమైంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను మరో 25 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో చిత్తుచేసిన సన్‌రైజర్స్ ఆతర్వాత ముంబయితో హోరాహోరీగా పోరాడి, చివరి బంతికి, ఒక వికెట్ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మరో ఓవర్ మిగిలి ఉండగానే, ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది, విజయాల హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది. కానీ, ఆ వెంటనే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ని 15 పరుగుల తేడాతో చేజార్చుకుంది. ఆ మ్యాచ్‌లో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ, ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో గట్టిపోటీనివ్వాలన్న పట్టుదలతో ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కూడా బలమైన జట్టు కావడంతో, విజయం ఎవరిని వరించినా, హోరాహోరీ పోరాటం ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయం. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ ముంబయిని ఒక వికెట్ తేడాతో ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆతర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఐదు వికెట్ల ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసింది. మూడో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ఢీకొని, అనూహ్యంగా లక్ష్యాన్ని ఛేదించలేక, నాలుగు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఆ వెంటనే కోలుకొని, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయింది. 64 పరుగుల భారీ ఆధిక్యంతో గెలుపొంది, సత్తా నిరూపించుకుంది. కెప్టెన్ ధోనీతోపాటు, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, డ్వెయిన్ బ్రేవో, శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన షేన్ వాట్సన్, అంబటి రాయుడు, దీపక్ చాహర్ వంటి మేటి ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బలాన్ని పెంచుతున్నారు. వీరిలో ఒకరిద్దరు తమ స్థాయికి తగినట్టు ఆడినా, సన్‌రైజర్స్‌కు కష్టాలు తప్పవు. అయితే, కేన్ విలియమ్‌సన్ సేనను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే, శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా, షకీబ్ అల్ హసన్, యూసుఫ్ పఠాన్, కార్లొస్ బ్రాత్‌వెయిట్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. స్టార్ ఆటగాళ్లతో కూడిన సన్‌రైజర్స్‌ను తక్కువ అంచనా వేస్తే చెన్నై సూపర్‌కింగ్స్ ఓటమి ప్రమాదంలో పడడం ఖాయం. మొత్తం మీద ఇరు జట్లు అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నందున ఆదివారం నాటి పోరు ఉత్కంఠ రేపుతున్నది. కాగా, మరో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఢీ కొంటాయి.