క్రీడాభూమి

‘సన్’ రైజింగ్ హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపుడు అందరి నోళ్లలోనూ సన్‌రైజర్స్ మాటే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుని, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైనా అసంతృప్తి చెందలేదు. పడిలేచిన కెరటంలా అప్రతిహతంగా దూసుకుపోతోంది. మొత్తం ఎనిమిది టీమ్‌లు ఉన్నా, వీటిలో కొన్ని బలమైన జట్లు ఉన్నా, వెరవకుండా ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో రాకెట్‌లా దూసుకుపోతోంది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ నేతృత్వం జట్టుకు ప్రధాన బలమైతే, సమర్థవంతమైన బౌలర్లుగా వినుతికెక్కిన రషీద్ ఖాన్, షాకీబ్ అల్ హసన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్‌తోపాటు బ్యాట్స్‌మెన్లు శిఖర్ ధావన్, యూసుఫ్ పఠాన్, మనీష్ పాండే వంటి వారు ప్రధాన బలగం
--------------------------------------

హైదరాబాద్, మే 8: సన్‌రైజర్స్ హైదరాబాద్..ఇప్పడు క్రికెట్ అభిమానుల అందరి నోళ్లలోనూ ఈ జట్టు పేరు మార్మోగుతోంది. ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లోని మొత్తం ఎనిమిది జట్ల కంటే అగ్రస్థానంలో కొనసాగుతూ ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. సీజన్ ప్రారంభానికి ముందు ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వార్నర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక మ్యాచ్‌లో బాల్‌ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా ఏడాదిపాటు అతనిపై ఆస్ట్రేలియా క్రికెట్ నిషేధం విధించింది. వాస్తవానికి సన్‌రైజర్స్‌తో ప్రాతినిధ్యం వహించిన గత సీజన్‌లలో డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించి ఫ్రాంచైజీతోపాటు సహచర క్రికెటర్లు, ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నాడు. బాల్‌ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో అతనిని ఐసీసీ తొలగించడంతో వెంటనే సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్‌సన్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. యాజమాన్యం తన భుజస్కంధాలపై ఉంచిన అతి బరువైన పాత్రను విలియమ్‌సన్ ఇంతవరకు సమర్థవంతంగా, అద్భుతంగా లాక్కుంటూ వస్తున్నాడు. ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో వరుస మూడు మ్యాచ్‌లలో ఘన విజయంతో హ్యాట్రిక్ (ఏప్రిల్ 4న జరిగిన తొలి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో రాజస్తాన్, ఏప్రిల్ 12న ముంబయిపై ఒక వికెట్ తేడాతో, ఏప్రిల్ 14న కోల్‌కతాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపు) సాధించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత జరిగిన వరుస రెండు మ్యాచ్‌లలో (ఏప్రిల్ 19న పంజాబ్‌పై 15 పరుగుల తేడాతో, ఏప్రిల్ 22న చెన్నైపై నాలుగు పరుగుల తేడాతో ఓటమి) పరాజయం పాలైంది. ఆ తర్వాత జరిగిన ఐదు మ్యాచ్‌లలో (ఏప్రిల్ 24న ముంబయిపై 31 పరుగుల తేడాతో, ఏప్రిల్ 26న పంజాబ్‌పై 13 పరుగుల తేడాతో, ఏప్రిల్ 29న రాజస్తాన్‌పై 11 పరుగుల తేడాతో, మే 5న ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో, మే 7న బెంగళూరుపై ఐదు పరుగుల తేడాతో గెలుపు) ఘనవిజయాలను నమోదు చేసుకుంది. సోమవారం సొంత మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఐదు పరుగులతో గెలుపొంది తన ఖాతాలో 10వ విజయాన్ని తన నమోదు చేసుకుంది. హైదరాబాద్ ఇంతవరకు ఆడిన 10 మ్యాచ్‌లలో ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. కేవలం రెండు మ్యాచ్‌లలోనే ఓటమిపాలైన ఈ టీమ్ +0.448 రన్‌రేట్‌తో 16 పాయింట్లతో మిగిలిన జట్ల కంటే అగ్రస్థానంలో నిలబడింది. అద్భుత ఆటతీరుతో ప్రతిఒక్క క్రికెట్ అభిమానినీ ఆకట్టుకుంటోంది. సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఇంతటి ఘనవిజయాలను నమోదు చేసుకోవడానికి జట్టు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ పాత్ర అమోఘం, అద్భుతం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెప్టెన్‌గా సమర్ధవంతమైన పాత్రను పోషిస్తున్న విలియమ్‌సన్‌కు ప్రతి మ్యాచ్‌లోనూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జట్టు ఎక్కువ స్కోరు చేసినా, తక్కువ స్కోరు చేసినా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్ల కంటే కెప్టెన్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. జట్టులోని సభ్యులందర్నీ సమష్టిగా తీసుకెళ్తూ 11వ సీజన్ ఐపీఎల్‌లో మిగిలిన బలమైన జట్లను కూడా ఊపిరిసలపకుండా చేయడంలో అందెవేసిన చేయిగా కెప్టెన్ నిలిచాడనంలో సందేహం లేదు. ఐపీఎల్‌లోని ఎనిమిది జట్లలోని కెప్టెన్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఒక్కడే విదేశీ ఆటగాడు. మిగిలిన కెప్టెన్‌లంతా స్వదేశీయులే. మిగిలిన జట్ల కెప్టెన్‌ల కంటే పరుగులు సాధించడంలో విలియమ్‌సన్ ఘనత సాధించాడు. ఇంతవరకు ఇతను ఆడిన 10 మ్యాచ్‌లలో 51.25 సరాసరిన 410 పరుగులు సాధించడం ద్వారా జట్టును విజయతీరాలకు చేర్చే బాధ్యతను తలకెత్తుకున్నాడు. విలియమ్‌సన్ ఖాతాలో ఇంతవరకు ఐదు అర్ధ సెంచరీలు ఉండడం గమనార్హం. చెన్నై కెప్టెన్ ఎం.ఎస్.్ధనీ వంటి దిగ్గజ క్రికెటర్లు కూడా విలియమ్‌సన్ ఆటతీరును ప్రస్తుతించడం గమనార్హం. ఒకసారి క్రీజులోకి దిగిన తర్వాత తన పాత్ర పరిధి మేరకు సమర్థవంతంగా, సరైన విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఒక్కటే అతనికి తెలిసిన ఆట. ప్రధాన కోచ్ టామ్ మూడీ, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వంటివారి సూచనలు, సలహాలతోపాటు వారి పర్యవేక్షణలో జట్టు అగ్రపథానికి చేర్చడానికి దోహపడుతున్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపునకు మరో ప్రధాన బలం బౌలింగ్. స్వదేశీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్, విదేశీ బౌలర్లు రషీద్ ఖాన్, షాకీబ్ అల్ హసన్ వంటివారు తమ అద్భుత ఆటతీరును ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను నిలువరించడంలో అగ్రగణ్యులుగా వినుతికెక్కారు. మొత్తం టీమ్‌లో కెప్టెన్ కేన్ విలియమమ్‌సన్ సగ భాగం గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకుంటే, మిగిలిన సగభాగాన్ని ఈ ముగ్గురు బౌలర్లు భర్తీ చేస్తున్నారడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బౌలర్లలో సిద్ధార్థ కౌల్ ఇంతవరకు ఆడిన మ్యాచ్‌లలో 13 వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్ సైతం 13 వికెట్లు పడగొట్టడం గమనార్హం. జట్టు కీలక సమయాల్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయడంలో శక్తివంచన లేకుండా పాటుపడుతున్నారు. గత నాలుగు మ్యాచ్‌లలో అతి తక్కువ స్కోరు చేసిన సన్‌రైజర్స్ (ముంబయిపై 118 పరుగులు, పంజాబ్‌పై 132 పరుగులు, రాజస్తాన్‌పై 151 పరుగులు, బెంగళూరుపై 146 పరుగులు) చేసినా ఆయా జట్లు పైచేయి సాధించలేక చతికిలపడిన విషయం తెలిసిందే. అంటే హైదరాబాద్ బౌలర్లు ఎంత కట్టడిగా బౌలింగ్‌ను చేశారో ఇట్టే అర్థమవుతుంది. ముంబయి ఇండియన్స్‌తో ఏప్రిల్ 24న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కేవలం 118 పరుగులు చేసినా, ఆ లక్ష్యాన్ని కూడా ఛేదించలేని ముంబయి కేవలం 87 పరుగులు చేయడంతో 31 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయబావుటాను ఎగురవేసిందంటే బౌలర్ల సామర్థ్యం లెక్కకట్టలేనిది. అదేవిధంగా ఏప్రిల్ 26న పంజాబ్‌తో తలపడిన సమయంలోనూ సన్‌రైజర్స్ 132 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 19.2 ఓవర్లలో 119 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈనెల 7న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 146 పరుగులు చేసింది. ప్రత్యర్థి టీమ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రెండు జట్లకూ ఎంతో ఉత్కంఠ కలిగించిన ఈ మ్యాచ్‌లో చివరకు విజయం సన్‌రైజర్స్‌నే వరించింది. ఈ మ్యాచ్‌లో సైతం బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లు పరుగుల వరద పారించకుండా నిలువరించారనడంలో సందేహం లేదు. బౌలర్లు తమ పరిధుల మేరకు బౌలింగ్‌లో సమర్థవంతంగా రాణిస్తున్నా బ్యాటింగ్‌లో కెప్టెన్ విలియమ్‌సన్‌పైనే అత్యధిక భారం పడుతోంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఏప్రిల్ 19న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 178 పరుగులు, ఆ తర్వాత ఏప్రిల్ 22న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సైతం 178 పరుగులు చేసింది. (ఈ రెండు మ్యాచ్‌లలోనూ సమానమైన పరుగులు చేసిన హైదరాబాద్ రెండింట్లోనూ ఓడిపోవడం గమనార్హం). ఏప్రిల్ 24న ముంబయితో జరిగిన తొలి మ్యాచ్‌లో 118 పరుగులు చేసింది. ఇదే ఈ జట్టు అత్యల్ప స్కోరు. సన్‌రైజర్స్ టీమ్ ఇంతవరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 200 పరుగుల మైలురాయిని అధిగమించకలేపోయింది. ఏప్రిల్ తొమ్మిదిన రాజస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 127 పరుగులు చేసింది. ఏప్రిల్ 12న ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 151, ఏప్రిల్ 14న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 139 పరుగులు చేసింది. (ఈ మూడు మ్యాచ్‌లలో హైదరాబాద్ గెలుపొందింది). ఏప్రిల్ 19న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 178 పరుగులు, ఏప్రిల్ 22న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 178 పరుగులు చేసింది. (ఈ రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ ఓడిపోయింది). ఏప్రిల్ 24న ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 118 పరుగులు, ఏప్రిల్ 26న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 132, ఏప్రిల్ 29న రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 151, మే 5న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 164, మే 7న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 141 పరుగులు చేసింది. (వరుసగా జరిగిన ఈ ఐదు మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ‘విన్’ అయింది). జట్టులోని స్టయిలిష్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఇంతవరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా 198 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 10 మ్యాచ్‌లలో 186 పరుగులు, మనీష్ పాండే 10 మ్యాచ్‌లలో 184 పరుగులు మాత్రమే చేయగలిగారు. సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరుకోవడం, ఇంకా మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున కెప్టెన్ విలియమ్‌సన్ నేతృత్వంలో అత్యధిక పరుగులు చేయడం ద్వారా జట్టును ఆదుకుంటారని ఫ్రాంచైజీ యోచిస్తోంది.