క్రీడాభూమి

పుణె ఖాతాలో రెండో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు ఎట్టకేలకు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఉప్పల్ (హైదరాబాద్)లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం ఆ జట్టు 34 తేడాతో ఆతిథ్య సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. వర్షం వలన ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు రాబట్టగా, సూపర్ జెయింట్స్ జట్టు 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు రాబట్టిన తర్వాత వర్షం వలన మరోసారి మ్యాచ్ ఆగిపోయింది. దీంతో డక్‌వర్త్/లూరుూస్ పద్ధతి ప్రకారం సూపర్ జెయింట్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన సూపర్ జెయింట్స్‌కు ఇది రెండో విజయం కాగా, సన్‌రైజర్స్‌కు ఇది మూడో ఓటమి.
అంతకుముందు టాస్ గెలిచిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పరుగుల వేటలో ఘోరంగా తడబడింది. సూపర్ జెయింట్స్ బౌలర్ల ధాటికి విలవిల్లాడిన సన్‌రైజర్స్ పరుగుల ఖాతా ఆరంభించకుండానే కెప్టెన్ డేవిడ్ వార్నర్ (0) వికెట్‌ను కోల్పోగా, ఆ తర్వాత ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఆదిత్య తరే (8)తో పాటు ఇయాన్ మోర్గాన్ (0), దీపేంద్ర హుడా (1), మోజెస్ హెన్రిక్స్ (1) త్వరత్వరగా పెవిలియన్‌కు క్యూకట్టారు. దీంతో ఆ జట్టు 32 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ బాధ్యతాయుతంగా ఆడి సన్‌రైజర్స్‌ను ఆదుకున్నాడు. క్రీజ్‌లో నిలదొక్కుకుని స్థిమితంగా ఆడిన అతను వికెట్ కీపర్ నమన్ ఓజాతో కలసి ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. ఓజా (21 బంతుల్లో 18 పరుగులు) నిష్క్రమణ అనంతరం బిపుల్ శర్మ (5) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరినప్పటికీ అతని స్థానంలో వచ్చిన భువనేశ్వర్ కుమార్ కొద్దిసేపు దూకుడుగా ఆడి 8 బంతుల్లో 21 పరుగులు రాబట్టగా, శిఖర్ ధావన్ (53 బంతుల్లో 56 పరుగులు), ఆశిష్ నెహ్రా (0) అజేయంగా నిలిచారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు సాధించగలిగింది. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ బౌలర్లలో అశోక్ దిండా 3 వికెట్లు కైవసం చేసుకోగా, మిచెల్ మార్ష్ రెండు వికెట్లు, థిస్సార పెరీరా, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ చొప్పున రాబట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన సూపర్ జెయింట్స్ జట్టుకూడా పరుగుల ఖాతా ఆరంభించకుండానే ఓపెనర్ అజింక్యా రహానే (0) వికెట్‌ను చేజార్చుకుంది. అయితే నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ ఫఫ్ డుప్లెసిస్, స్టీవ్ స్మిత్ (46-నాటౌట్) స్థిమితంగా ఆడి 80 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 10వ ఓవర్‌లో మోజెస్ హెన్రిక్స్ వేసిన తొలి బంతిని ఎదుర్కొనే ప్రయత్నంలో డుప్లెసిస్ (30) వికెట్ల వెనుక నమన్ ఓజాకు దొరికిపోగా, అతని స్థానంలో వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 5 పరుగులు సాధించి ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో ఆదిత్య తరే చేతికి చిక్కాడు. దీంతో సూపర్ జెయింట్స్ జట్టు 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు సాధించింది. ఈ తరుణంలో మరోసారి వర్షం వలన ఆట ఆగిపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూరుూస్ పద్ధతిని అనుసరించి 34 పరుగుల తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు విజయం సాధించినట్లు ప్రకటించారు.

సంక్షిప్తంగా స్కోర్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 118/8 (శిఖర్ ధావన్ 56-నాటౌట్, నమన్ ఓజా 18, భువనేశ్వర్ కుమార్ 21). వికెట్ల పతనం: 1-0, 2-26, 3-27, 4-29, 5-32, 6-79, 7-92, 8-115). బౌలింగ్: అశోక్ దిండా 4-1-23-3, మిచెల్ మార్ష్ 4-0-14-2, థిస్సార పెరీరా 4-0-32-1, రవిచంద్రన్ అశ్విన్ 4-0-14-1, రజత్ భాటియా 3-0-24-0, మురుగన్ అశ్విన్ 1-0-6-0.
రైజింగ్ పుణె సూపర్ జెయంట్స్ ఇన్నింగ్స్:
11 ఓవర్లలో 94/3 (ఫఫ్ డుప్లెసిస్ 30, స్టీవ్ స్మిత్ 46-నాటౌట్, మహేంద్ర సింగ్ ధోనీ 5)
వికెట్ల పతనం: 1-0, 2-80, 3-94. బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 3-1-17-1, ఆశిష్ నెహ్రా 3-0-21-1, మోజెస్ హెన్రిక్స్ 2-0-16-1, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2-0-21-0, బిపుల్ శర్మ 1-0-17-0.