క్రీడాభూమి

జగజ్జేతలు వీరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ అభిమానులకు ప్రపంచకప్ అంటేనే ఓ పండుగ.. ఇప్పటివరకు జరిగిన 11 మెగా టోర్నీల్లో ఏ జట్టు కప్ సాధించింది.. ఫైనల్‌లో ఎవరెవరూ తలపడ్డారో.. ఒకసారి వెనక్కు వెళ్తే..

1975: లండన్ వేదికగా జరిగిన మొట్టమొదటి వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీని వెస్టిండీస్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్, అప్పట్లో అమల్లో ఉన్న 60 ఓవర్ల ఫార్మాట్‌లో, నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 58.4 ఓవర్లు ఆడి, 274 పరుగులకు ఆలౌటైంది. విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ తొలి ట్రోఫీని స్వీకరించాడు.
1979: రెండో వరల్డ్ కప్ టోర్నీకి కూడా ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. వెస్టిండీస్ మరోసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను 92 పరుగుల తేడాతో చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 60 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు సాధించింది. విండీస్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఇంగ్లాండ్ 51 ఓవర్లు ఆడి, 194 పరుగులకే కుప్పకూలింది.
1983: భారత క్రికెట్‌ను గొప్ప మలుపు తిప్పిన వరల్డ్ కప్ టోర్నీ అది. ఇంగ్లాండ్‌లోనే జరిగిన మూడో ప్రపంచ కప్‌లో అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన భారత్ ఎవరూ ఊహించిన విధంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అందరూ ముందుగానే జోస్యం చెప్పినట్టుగానే, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ కూడా ఫైనల్ చేరింది. లో స్కోరు ఫైనల్‌లో, కపిల్ దేవ్ నాయకత్వం వహించిన భారత్ ఏడు పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయభేరి మోగించి, విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 60 ఓవర్ల కోటాను కూడా పూర్తిగా ఆడలేకపోయింది. 54.4 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. హేమాహేమీలు ఉన్న విండీస్‌కు భారత్ నిర్దేశించిన లక్ష్యం ఏమాత్రం పెద్దది కాదని, ఆ జట్టు ఆడుతూపాడుతూ గెలిచేస్తుందని క్రీడా పండితులు సైతం జోస్యం చెప్పారు. కానీ, భారత బౌలర్ల ముందు విండీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 52 ఓవర్లలో 140 పరుగులకే విండీస్ ఆలౌటైంది. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగితే ఫలితం ఏ విధంగా ఉంటుందనేది ఆ మ్యాచ్ యావత్ క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది.
1987: మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ నుంచి బయటకు వచ్చిన వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఈ నాలుగో వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా సెమీ ఫైనల్ వరకూ వచ్చింది. కానీ, ఇంగ్లాండ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, ఫైనల్ చేరుకోలేకపోయింది. స్వర్ణ యుగం ముగిసిన వెస్టిండీస్ కనీసం ప్లే ఆఫ్ దశకు కూడా చేరుకోలేదు.
కాగా, ఫైనల్లో ఇంగ్లాండ్‌తో హోరాహోరీ పోరాటాన్ని సాగించిన ఆస్ట్రేలియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి విశ్వవిజేత హోదాను దక్కించుకుంది. అప్పటికే వనే్డ ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌ను 60 నుంచి 50 ఓవర్లకు కుదించడంతో, వరల్డ్ కప్ టోర్నీ కూడా కొత్త విధానంలోనే జరిగింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. అనంతరం ఇంగ్లాండ్ 50 ఓవర్లు ఆడినప్పటికీ, అవసరమైన రన్‌రేట్‌ను కొనసాగించలేక, ఎనిమిది కోల్పోయి 246 పరుగులు చేయగలిగింది.
1992: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన ఐదో వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఫైనల్ చేరుకోలేకపోయింది. మెల్బోర్న్‌లో జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 249 పరుగులు చేసింది. ఆతర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ 22 పరుగుల తేడాతో గెలుపొంది, తొలిసారి వరల్డ్ కప్‌ను తన ఖాతాలో వేసుకుంది.
1996: పాకిస్తాన్, భారత్, శ్రీలంక కలిసి నిర్వహించిన ఆరో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ లాహోర్‌లో జరిగింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ శ్రీలంక ఫైనల్‌కు దూసుకెళ్లగా, మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా కూడా ఫైనల్లో స్థానం దక్కించుకుంది. టైటిల్ పోరాటంలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని శ్రీలంక 46.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి, మొదటిసారి వరల్డ్ కప్‌ను గెల్చుకుంది.
1999: చాలాకాలం తర్వాత మళ్లీ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీకి వేదికైంది. వేల్స్‌తో కలిసి ఇంగ్లాండ్ నిర్వహించిన ఏడో ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. ఫైనల్లో 39 ఓవర్లు మాత్రమే ఆడగలిగిన పాక్ 132 పరుగులకే కుప్పకూలింది. అత్యంత సాదాసీదా లక్ష్యాన్ని ఆసీస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛేదించింది. 20.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లకు 133 పరుగులు చేసి, ఎనిమిది వికెట్ల తేడాతో వరల్డ్ కప్‌ను సాధించింది.
2003: దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఎనిమిదో వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టైటిల్ నిలబెట్టుకుంది. అసాధారణ పోరాట పటిమను కనబరచి, ఫైనల్ వరకూ చేరిన భారత్ విజేతగా నిలవడంలో విఫలమైంది. ఆస్ట్రేలియా 50 ఓవర్లలో రెండు వికెట్లకు 359 పరుగుల భారీ స్కోరును సాధించగా, అందుకు సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 39.2 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, వరుసగా రెండవ, మొత్తం మీద మూడవ వరల్డ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
2007: ఆస్ట్రేలియా ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించింది. వెస్టిండీస్‌లో జరిగిన తొమ్మిదో వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకతో ఆసీస్ ఢీకొంది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగ్గా, డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని అనుసరించారు. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి ఆస్ట్రేలియా 38 ఓవర్లలో నాలుగు వికెట్లు చేజార్చుకొని, 281 పరుగులు సాధించింది. డక్‌వర్త్ లూయిస్ విధానంలో లంక లక్ష్యాన్ని 36 ఓవర్లలో 269 పరుగులగా నిర్ధారించారు. అయితే, లంక ఓవర్ల కోటా పూర్తయ్యే సమయానికి ఎనిమిది వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగలిగింది. 53 పరుగుల ఆధిక్యంతో గెలిచిన ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌లో టైటిళ్ల హ్యాట్రిక్‌ను సమర్థంగా పూర్తి చేసింది.
2011: మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియాకు కలిసొచ్చిన పదో వరల్డ్ కప్ టోర్నీకి భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చాయి. ముంబయిలో జరిగిన ఫైనల్లో ఆసియా దేశాలైన భారత్, శ్రీలంక జట్లు ఢీకొన్నాయి. శ్రీలంక మొదట బ్యాటింగ్‌కు దిగి, 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. భారత్ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 277 పరుగులు సాధించి, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 28 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు మరోసారి వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ లభించింది.
2015: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా వరుసగా రెండోసారి, మొత్తం మీద మూడోసారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంటుందని అభిమానలు ఆశించారు. కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 11వ వరల్డ్ కప్‌లో భారత్ పోరు సెమీ ఫైనల్‌తో ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించగా, భారత్ 233 పరుగులకే కుప్పకూలింది. కాగా, టీమిండియాను ఓడించి, ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా అదే దూకుడును కొనసాగించింది. న్యూజిలాండ్‌ను 45 ఓవర్లలో 183 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించి, ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.