క్రీడాభూమి

ఛేజింగ్‌లో తడబ్యాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింహామ్, జూన్ 30: లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ, ఇంగ్లాండ్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 306 పరుగులు చేసి, 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో రోహిత్ శర్మ చేసిన సూపర్ సెంచరీ వృథా అయింది. అంతకు ముందు ఇంగ్లాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 337 పరుగులు చేయగా, మహమ్మద్ షమీ (69 పరుగులకు 5 వికెట్లు) మినహా మిగతా భారత బౌలర్లు రాణించలేదు. ఫలితంగా ఇంగ్లాండ్‌కు భారీ స్కోరు సాధ్యమైంది. ఆతర్వాత భారత్ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిల పడింది. అయితే, పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను దెబ్బతీయడానికి టీమిండియా ఉద్దేశపూర్వకంగానే ఓడిందనే వాదన వినిపిస్తున్నది.
పిచ్ తీరు ద్వితీయార్ధంలో గణనీయంగా మారుతుందనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచిన వెంటనే, మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం సరైనదేనని ఆ జట్టు చేసిన స్కోరు స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసిన జానీ బెయిర్‌స్టో, జాసన్ రాయ్ మొదటి వికెట్‌కు 160 పరుగులు జోడించారు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టిన జాసన్ రాయ్ లాంగ్ ఆన్‌లో కాపుకాసిన సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ రవీంద్ర జడేజా అసాధారణ డైవ్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరాడు. అతను 59 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు సాధించాడు. కాగా, మొదటి వికెట్ కూలిన తర్వాత కూడా జానీ బెయిర్‌స్టో పరుగుల వేటను కొనసాగించాడు. ఇంగ్లాండ్ జట్టు 29.4 ఓవర్లలో 200 పరుగుల మైలురాయిని చేరింది. అయితే, తర్వాత కొద్ది సేపటికే జానీ బెయిర్‌స్టో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో హార్దిక్ పాండ్య వేసిన చివరి బంతిని స్క్వేర్ లెగ్ దిశగా తరలించిన జానీ బెయిర్‌స్టో కెరీర్‌లో ఎనిమిదో వనే్డ ఇంటర్నేషనల్ సెంచరీ సాధించిన అతను, తప్పక గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి, ఒత్తిడిలోనూ చక్కటి ఆటతో ఆకట్టుకున్నాడు. అతను అదే దూకుడును కొనసాగిస్తాడని అభిమానులు ఆశించారు. అయితే, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ నుంచి దూరంగా వెళుతున్న బంతిని కవర్స్ దిశగా భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి, రిషభ్ పంత్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. 109 బంతులు ఎదుర్కొన్న అతను 10 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. షమీకి అది మెయిడిన్ ఓవర్ కావడం విశేషం. 205 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోగా, మరో రెండు పరుగుల తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా వెనుదిరిగాడు. కేవలం ఒక పరుగు చేసిన అతనిని కేదార్ జాదవ్ క్యాచ్ పట్టగా మహమ్మద్ షమీ ఔట్ చేశాడు.
స్టోక్స్ బాధ్యతాయుత ఇన్నింగ్స్
నాలుగో వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో కలిసి 70 పరుగులు జోడించిన జో రూట్ వికెట్ కూడా మహమ్మద్ షమీకే దక్కింది. 54 బంతులు ఎదుర్కొని, 44 పరుగులు చేసిన అతను ఫైన్ లెగ్ మీదుగా షాట్ కొట్టబోయి హార్దిక్ పాండ్య క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. థర్డ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన జొస్ బట్లర్ వచ్చీ రావడంతోనే రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ కొట్టి, పరుగుల ఖాతా తెరిచాడు. మరోవైపు రన్‌రేట్‌ను పెంచే ప్రయత్నంలో పడిన బెన్ స్టోక్స్ 38 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్‌లో 47వ ఓవర్‌లో మొదటి బంతిని ఫోర్ కొట్టిన అతను రెండో బంతిలో రెండు, మూడో బంతిలో సింగిల్ తీసి, ఇంగ్లాండ్ స్కోరును 300 పరుగులకు చేర్చాడు. తర్వాతి రెండు బంతుల్లో జొస్ బట్లర్ వరుసగా ఫోర్, సిక్స్ సాధించాడు. అయితే, చివరి బంతిలో షాట్ కొట్టేందుకు ప్రయత్నించి, షమీ రిటర్న్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. బట్లర్ 8 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ఏడు పరుగులు చేసి, మహమ్మద్ షమీ బౌలింగ్‌లోనే రోహిత్ శర్మకు దొరికిపోయాడు. బాధ్యతాయుతంగా ఆడుతూ, 54 బంతుల్లోనే, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 79 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ వికెట్ జస్‌ప్రీత్ బుమ్రాకు దక్కింది. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రవీంద్ర జడేజా మరో చక్కటి క్యాచ్ పట్టాడు. అప్పటికి మరో రెండు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 337 పరుగులు చేయగా, లియామ్ ప్లంకెట్ (1), జొఫ్రా ఆర్చర్ (0) నాటౌట్‌గా ఉన్నారు.
రాహుల్ డకౌట్
ఇంగ్లాండ్‌ను ఓడించడానికి 338 పరుగులు సాధించాల్సిన నేపథ్యంలో, ఎంతో జాగ్రత్తగా ఆడాల్సిన ఓపెనర్ లోకేష్ రాహుల్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తొమ్మిది బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన అతను క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఎనిమిది పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలడంతో, ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. వికెట్లు పడకుండా ఉండేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కోహ్లీ ఈ ప్రపంచ కప్‌లో వరుసగా ఐదోసారి 50 ప్లస్ పరుగులను సాధిస్తే, అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి రోహిత్ తన అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో, భారత్ ఇన్నింగ్స్ కోలుకుంది. అయితే, చేయాల్సిన రన్‌రేట్ ఎనిమిదికిపైగానే ఉండడంతో, పరుగుల వేగం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడిన కోహ్లీ 66 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు జేమ్స్ విన్స్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. సెకండ్ డౌన్‌లో పంత్ బ్యాటింగ్‌కు దిగితే, రోహిత్ అతని సహకారంతో సెంచరీ సాధించాడు. 106 బంతుల్లో ఈ మైలురాయిని చేరిన అతని స్కోరులో 15 ఫోర్లు ఉన్నాయి. కెరీర్‌లో అతనికి ఇది 25వ వనే్డ శతకం. మరో రెండు పరుగుల తర్వాత, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో, జొస్ బట్లర్ క్యాచ్ అందుకోగా రోహిత్ పెవిలియన్ చేరాడు. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్‌కు ఇది మూడో సెంచరీ. అతను దక్షిణాఫ్రికాపై 100 (నాటౌట్), పాకిస్తాన్‌పై 140 పరుగులు సాధించాడు. కాగా, ఛేదించాల్సిన రన్‌రేట్ గణనీయంగా పెరగడంతో తీవ్రమైన ఒత్తిడికి గురైన పంత్ 29 ఓవర్లలో 32 పరుగులు చేసి, లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్య, మహేంద్ర సింగ్ ధోనీ కూడా రన్‌రేట్‌ను శరవేగంతో పెంచలేకపోయారు. దీనితో వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ, భారత్ తన లక్ష్యానికి దూరమవుతూ వచ్చింది. పాండ్య 45 పరుగులు చేసిన తర్వాత, లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జేమ్స్ విన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. చివరిలో కేదార్ జాదవ్ (12 నాటౌట్), మహేంద్ర సింగ్ ధోనీ (42 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారుగానీ, భారత్ పరాజయాన్ని అడ్డుకోలేకపోయారు. 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 306 పరుగులు చేసిన టీమిండియా 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

స్కోరుబోర్డు
ఇంగ్లాండ్: జాసన్ రాయ్ సీ (సబ్‌స్టిట్యూట్) రవీంద్ర జడేజా బీ కుల్దీప్ యాదవ్ 66, జానీ బెయిర్‌స్టో సీ రిషభ్ పంత్ బీ మహమ్మద్ షమీ 111, జో రూట్ సీ హార్దిక్ పాండ్య బీ మహమ్మద్ షమీ 44, ఇయాన్ మోర్గాన్ సీ కేదర్ జాదవ్ బీ మహమ్మద్ షమీ 1, బెన్ స్టోక్స్ సీ (సబ్‌స్టిట్యూట్) రవీంద్ర జడేజా బీ జస్‌ప్రీత్ బుమ్రా 79, జొస్ బట్లర్ సీ అండ్ బీ మహమ్మద్ షమీ 20, క్రిస్ వోక్స్ సీ రోహిత్ శర్మ బీ మహమ్మద్ షమీ 7, లియామ్ ప్లంకెట్ నాటౌట్ 1, జొఫ్రా ఆర్చర్ నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 337.
వికెట్ల పతనం: 1-160, 2-205, 3-207, 4-277, 5-310, 6-319, 7-336.
బౌలింగ్: మహమ్మద్ షమీ 10-1-69-5, జస్‌ప్రీత్ బుమ్రా 10-1-44-1, యుజువేంద్ర చాహల్ 10-0-88-0, హార్దిక్ పాండ్య 10-0-60-0, కుల్దీప్ యాదవ్ 10-0-72-1.
భారత్: లోకేష్ రాహుల్ సీ అండ్ బీ క్రిస్ వోక్స్ 0, రోహిత్ శర్మ సీ జొస్ బట్లర్ బీ క్రిస్ వోక్స్ 102, విరాట్ కోహ్లీ సీ (సబ్‌స్టిట్యూట్) జేమ్స్ విన్స్ బీ లియామ్ ప్లంకెట్ 66, రిషభ్ పంత్ సీ క్రిస్ వోక్స్ బీ లియామ్ ప్లంకెట్ 32, హార్దిక్ పాండ్య సీ (సబ్‌స్టిట్యూట్) జేమ్స్ విన్స్ బీ లియామ్ ప్లంకెట్ 45, మహేంద్ర సింగ్ ధోనీ నాటౌట్ 42, కేదార్ జాదవ్ నాటౌట్ 12, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 306.
వికెట్ల పతనం: 1-8, 2-146, 3-198, 4-226, 5-267.
బౌలింగ్: క్రిస్ వోక్స్ 10-3-58-2, జొఫ్రా ఆర్చర్ 10-0-45-0, లియామ్ ప్లంకెట్ 10-0-55-3, మార్క్ ఉడ్ 10-0-73-0, అదిల్ రషీద్ 6-0-40-0, బెన్ స్టోక్స్ 4-0-34-0.
చిత్రం... భారత ఓపెనర్ రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపిన ఆనందంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు..