క్రీడాభూమి

ఐపిఎల్‌లో బిగ్ ఫైట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నమొన్నటి వరకూ ఐపిఎల్ అంటే క్రిస్ గేల్ అనేవారు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఎవరంటే గేల్ పేరే చెప్పేవారు. కానీ, ఈసారి గేల్‌నేకాదు.. హార్డ్ హిట్టర్లుగా పేరు సంపాదించిన ఎబి డివిలియర్స్, బ్రెండన్ మెక్‌కలమ్, ఆరోన్ ఫించ్, డేవిడ్ మిల్లర్, డేవిడ్ వార్నర్ వంటి హేమాహేమీలను పక్కకు నెట్టిన కోహ్లీని సూపర్ హీరోగా ప్రస్తుతిస్తున్నారు. నాలుగు సెంచరీలు సాధించి, ఐపిఎల్ చరిత్రలోనే ఒక సీజన్‌లో ఈ ఫీట్‌ను ప్రదర్శించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. మరో 81 పరుగులు సాధిస్తే అతను ఒక సీజన్‌లో 1,000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా మరో రికార్డు సృష్టిస్తాడు. అంతేగాక, ఐపిఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా సురేష్ రైనా పేరిట ఉన్న రికార్డును కూడా కోహ్లీ అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ సీజన్‌లో 919 పరుగులు సాధించిన అతని సగటు 91.9 పరుగులు. స్ట్రయక్ రేట్ 152.4. అంతేకాదు, ఈ ఏడాది 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులను 17 పర్యాయాలు సాధించి, మిగతా అందరి కంటే ఉన్నత స్థానంలో నిలిచాడు. మంగళవారం గుజరాత్ లయన్స్‌తో జరిగే తొలి క్వాలిఫయర్ వ్యక్తిగతంగా కోహ్లీకి కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో అతను సెంచరీ చేసి ఐపిఎల్ రికార్డులను తిరగరాస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
***
బెంగళూరు, మే 23: ఐపిఎల్‌లో స్థానం కోసం గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య హోరాహోరీకి చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగే బిగ్ ఫైట్ అభిమానులకు కనువిందు చేయనుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళుతుంది. ఓడిన జట్టుకు రెండో క్వాలిఫయర్‌లో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఐపిఎల్ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలను ఆక్రమించిన జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సంపాదిస్తాయి. గుజరాత్ 18 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో నిలవగా, బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలా 16 పాయింట్లు సంపాదించి, రెండు నుంచి నాలుగు స్థానాల్లో నిలిచాయి. పాయింట్లు సమానమైనప్పటికీ నెట్న్‌ర్రేట్ ఆధారంగా రెండు నుంచి నాలుగు స్థానాలను ఖాయం చేశారు. చివరి నాలుగు స్థానాల్లో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మొదటి రెండు స్థానాలను సంపాదించిన గుజరాత్, బెంగళూరు జట్లకు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. మంగళవారం జరిగే మొదటి క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరితో ఓడిన జట్టు ఈనెల 27న జరిగే రెండో క్వాలిఫయర్‌లో పోటీపడి, తుది పోరుకు చేరుకునే అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. పాయింట్ల పట్టికలో మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ జట్ల మధ్య 25న ఎలిమినేటర్ జరుగుతుంది. అందులో ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. గెలిచిన జట్టు, 27వ తేదీ నాటి రెండో క్వాలిఫయర్‌లో ఆడాల్సి ఉంటుంది. మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుతో ఈ మ్యాచ్ ఉంటుంది.
ఇలావుంటే, గుజరాత్‌తో బెంగళూరులోనే జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (109), ఎబి డివిలియర్స్ (129 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కగా, ఐపిఎల్ చరిత్రలోనే భారీ విజయాన్ని బెంగళూరు నమోదు చేసింది. సురేష్ రైనా నాయకత్వం వహిస్తున్న గుజరాత్ 144 పరుగుల తేడాతో చిత్తయిన నేపథ్యంలో, చిన్నస్వామి స్టేడియంలోనే జరిగే మ్యాచ్‌లో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. రెండు జట్లలోనూ సమర్థులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ, గుజరాత్‌పై బెంగళూరుది పైచేయి కావచ్చని విశే్లషకుల అభిప్రాయం. ఇందుకు కారణం లేకపోలేదు. ఇప్పటి వరకూ ఐపిఎల్‌లో అన్ని జట్లూ తలా 14 మ్యాచ్‌లు ఆడాయి. అత్యధిక పరుగులు సాధించిన ‘టాప్-5’ బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇద్దరు బెంగళూరు క్రికెటర్లే కావడం విశేషం. వారిలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 919 పరుగులతో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తే, ఎబి డివిలియర్స్ 603 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 658 పరుగులతో రెండు, రోహిత్ శర్మ (ముంబయి ఇండియన్స్) 489 పరుగులతో నాలుగు, ఆజింక్య రహానే (రైజింగ్ పుణె వారియర్స్) 480 పరుగులతో ఐదు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలోనూ ‘టాప్-5’ జాబితాలో ఇద్దరు బెంగళూరు బౌలర్లే. యజువేంద్ర చాహల్ 19 వికెట్లతో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే, షేన్ వాట్సన్ 16 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 18, మిచెల్ మెక్‌క్లీనగన్ (ముంబయి ఇండియన్స్) 17, ముస్త్ఫాజుర్ రహ్మాన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) 16 వికెట్లతో రెండు నుంచి నాలుగు స్థానాలను ఆక్రమించారు. ఈ రెండు విభాగాల్లోనూ గుజరాత్ ఆటగాళ్లు ఎవరూ లేరు. ఈ తేడానే గుజరాత్ కంటే బెంగళూరు బలంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. కోహ్లీ, డివిలియర్స్ అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తుంటే, వైఫల్యాలతో అభిమానులను నిరాశ పరచిన క్రిస్ గేల్ మళ్లీ ఫామ్‌లోకి రావడం బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ బలాన్ని పెంచుతోంది. షేన్ వాట్సన్, లోకేష్ రాహుల్ తదితరులతో బెంగళూరు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో చాహల్, క్రిస్ జోర్డాన్, వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్నీ, హర్షల్ పటేల్ వంటి సమర్థులున్నారు. గుజరాత్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేకపోయినా, బెంగళూరు బలంగా ఉందనే విషయాన్ని అంగీకరించక తప్పదు.
మొదటి సారి ఐపిఎల్‌లో అడుగుపెట్టినప్పటికీ గుజరాత్‌లో పలువురు అనుభవజ్ఞులైన స్టార్లు ఉన్నారు. ఐపిఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్న సురేష్ రైనా నాయకత్వం గుజరాత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఐపిఎల్‌లో రైనా ఇప్పటి వరకూ 4,096 పరుగులు చేయగా, కోహ్లీ 4,056 పరుగులతో అతనికి గట్టిపోటీనిస్తున్నాడు. కాగా, గుజరాత్‌లో డ్వెయిన్ స్మిత్ (10 మ్యాచ్‌ల్లో 250 పరుగులు), బ్రెండన్ మెక్‌కలమ్ (14 మ్యాచ్‌ల్లో 321 పరుగులు), ఆరోన్ ఫించ్ (11 మ్యాచ్‌ల్లో 339 పరుగులు) వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. దినేష్ కార్తీక్ కూడా భారీ స్కోర్లు చేయగల సమర్థుడే. రవీంద్ర జడేజా, డ్వెయిన్ బ్రేవో ఆల్‌రౌండర్ల రూపంలో సేవలు అందిస్తున్నారు. బౌలింగ్‌లో జేమ్స్ ఫాల్క్‌నెర్, ధవళ్ కులకర్ణి, ‘చైనామన్’ బౌలింగ్ స్పెషలిస్టు శివిల్ కౌశిక్, ప్రవీణ్ తంబే తదితరులు కీలక భూమిక పోషిస్తున్నారు. అయితే, బౌలింగ్ కంటే బ్యాటింగ్ బలాన్ని నమ్ముకొని గుజరాత్ ఈ టోర్నీలో నెట్టుకొస్తున్నది. నిలకడగా ఆడడం గుజరాత్ బలంకాగా, బెంగళూరు ఎప్పుడు ఏ విధంగా చెలరేగుతుందో, ఎప్పుడు దారుణంగా విఫలమవుతుందో చెప్పలేని పరిస్థితి. టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితిలో నిలిచినప్పటికీ, ఒత్తిడిని అధిగమించి వరుస విజయాలతో ప్లే ఆఫ్ దశకు చేరుకోవడం బెంగళూరుకే సాధ్యమైంది. దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లోనూ సమర్థంగా ఆడడం వల్లే గుజరాత్‌కు పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానం దక్కింది. మొత్తం మీద ఈసారి ఐపిఎల్‌లో విశేష ప్రతిభ కనబరుస్తున్న రెండు జట్ల మధ్య జరిగే పోరు అభిమానులను ఆకట్టుకోనుంది. మరో అవకాశం కోసం ఎదురుచూడకుండా, మంగళవారం నాటి మ్యాచ్‌తోనే ఫైనల్ చేరాలన్న పట్టుదలతో ఇరు జట్లు బరిలోకి దిగుతాయి కాబట్టి హోరాహోరీ తప్పదు.
మ్యాచ్ మంగళవారం రాత్రి 8 గంటలకు మొదలు.