క్రీడాభూమి

బౌలర్ల కష్టానికి బ్యాట్స్‌మెన్ గండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి: ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను కట్టడి చేయడానికి టీమిండియా బౌలర్లు పడిన కష్టానికి బ్యాట్స్‌మెన్ గండి కొట్టారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 90 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ట్రెంట్ బౌల్ట్ 12 పరుగులకే మూడు వికెట్లు కూల్చి, భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీశాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకు ఆలౌట్‌కాగా, ఆతర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ మొదటి రోజు ఆటముసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 63 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఉదయం ఆటను కొనసాగించినప్పుడు కివీస్ భారీ స్కోరు సాధిస్తుందని అంతా ఊహించారు. కానీ, భారత బౌలర్లు అద్భుత ప్రతిభతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ దూకుడుగా ముందుకు వెళ్లకుండా నిరోధించారు. ఓవర్ నైట్ స్కోరుకు మరో మూడు పరుగులు జత కలిసి తర్వాత టామ్ బ్లండెల్ (30)ను ఉమేష్ యాదవ్ ఎల్‌బీగా పెవిలియన్‌కు పంపాడు. మరో మూడు పరుగులు జత కలిసిన తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ వికెట్ కూడా కూలింది. మూడు పరుగులు చేసిన అతనిని రిషభ్ పంత్ క్యాచ్ అందుకోగా, జస్‌ప్రీత్ బుమ్రా వెనక్కు పంపాడు. సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ఎక్కువ సేపుక్రీజ్‌లో నిలువలేక, 15 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్‌కు చిక్కాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, 122 బంతుల్లో 52 పరుగులు సాధించిన ఓపెనర్ టామ్ లాథమ్‌ను మహమ్మద్ షమీ ఎల్‌బీగా ఔట్ చేశాడు. హెన్రీ నికోల్స్ (14), బీజే వాల్టింగ్ (0), టిమ్ సౌథీ (0) ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 153 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ రెండు వందల పరుగుల మైలురాయిని చేరడం కూడా కష్టసాధ్యంగానే కనిపించింది. అయితే, కేల్ జమీసన్ బాధ్యతాయుతమైన ఆట కివీస్‌ను ఆదుకుంది. కొలిన్ డి గ్రాండ్‌హోమ్బంతుల్లో 26 పరుగులు చేయగా, నీల్ వాగ్నర్ 21 పరుగులు సాధించాడు. జమీసన్ 63 బంతులు ఎదర్కొని, ఏడు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేసి, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌కు 73.1 ఓవర్లలో 235 పరుగుల వద్ద తెరపడింది. అప్పటికి ట్రెంట్ బౌల్ట్ ఒక పరుగుతో నాటౌట్‌గా ఉన్నాడు. మహమ్మద్ షమీ 81 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టగా, జస్‌ప్రీత్ బుమ్రా 62 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. రవీంద్ర జడేజా 22 పరుగులకు రెండు వికెట్లు సాధించాడు. ఉమేష్ యాదవ్‌కు ఒక వికెట్ లభించింది.
బౌలర్లు రాణించడంతో, న్యూజిలాండ్‌ను కట్టడి చేసి, ఏడు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. మాయాంక్ అగర్వాల్‌తో మొదలైన వికెట్ల పతనం నిరాటంకంగా కొనసాగింది. మూడు పరుగులు చేసిన మాయాంక్‌ను ట్రెంట్ బౌల్ట్ ఎల్‌బీగా పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 14 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద టిమ్ సౌథీ బౌలింగ్‌లో టామ్ లాథమ్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అభిమానులను నిరాశపరచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. 30 బంతులు ఎదుర్కొని, 14 పరుగులు చేసిన అతను కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా దొరికిపోయాడు. అజింక్య రహానే 9 పరుగులు చేసి, నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌కాగా, టెస్టు స్పెషలిస్టు చటేశ్వర్ పుజారా 88 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 24 పరుగులు చేసి, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ఉమేష్ యాదవ్ (1)ను ట్రెంట్ బౌల్ట్ బౌల్డ్ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 36 ఓవర్లలో 6 వికెట్లకు 90 పరుగులు చేసింది. అప్పటికి హనుమ విహారీ (5), రిషభ్ పంత్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్ 9 ఓవర్లు బౌల్ చేసి, కేవలం 12 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. టిమ్ సౌథీ, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, నీల్ వాగ్నర్ తలా ఒక్కో వికెట్ కూల్చారు.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 242 (ఆలౌట్)
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్ నైట్ స్కోరు 63 నోలాస్): టామ్ లాథమ్ బీ మహమ్మద్ షమీ 52, టామ్ బ్లండెల్ ఎల్‌బీ ఉమేష్ యాదవ్ 30, కేన్ విలియమ్‌సన్ సీ రిషభ్ పంత్ బీ జస్‌ప్రీత్ బుమ్రా 3, రాస్ టేలర్ సీ ఉమేష్ యాదవ్ బీ రవీంద్ర జడేజా 15, హెన్రీ నికోల్స్ సీ విరాట్ కోహ్లీ బీ మహమ్మద్ షమీ 14, బీజే వాల్టింగ్ సీ రవీంద్ర జడేజా బీ జస్‌ప్రీత్ బుమ్రా 0, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బీ రవీంద్ర జడేజా 26, టిమ్ సౌథీ సీ రిషభ్ పంత్ బీ జస్‌ప్రీత్ బుమ్రా 0, కేల్ జమీసన్ సీ రిషభ్ పంత్ బీ మహమ్మద్ షమీ 49, నీల్ వాగ్నర్ సీ రవీంద్ర జడేజా బీ మహమ్మద్ షమీ 21, ట్రెంట్ బౌల్ట్ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 24, మొత్తం (73.1 ఓవర్లలో ఆలౌట్) 235.
వికెట్ల పతనం: 1-66, 2-69, 3-109, 4-130, 5-133, 6-153, 7-153, 8-177, 9-228, 10-235.
బౌలింగ్: జస్‌ప్రీత్ బుమ్రా 22-5-62-3, ఉమేష్ యాదవ్ 18-2-46-1, మహమ్మద్ షమీ 23.1-3-81-4, రవీంద్ర జడేజా 10-2-22-2.
భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా సీ టామ్ లాథమ్ బీ టిమ్ సౌథీ 14, మాయాంక్ అగర్వాల్ ఎల్‌బీ ట్రెంట్ బౌల్ట్ 3, చటేశ్వర్ పుజారా బీ ట్రెంట్ బౌల్ట్ 24, విరాట్ కోహ్లీ ఎల్‌బీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 14, అజింక్య రహానే బీ నీల్ వాగ్నర్ 9, ఉమేష్ యాదవ్ బీ ట్రెంట్ బౌల్ట్ 1, హనుమ విహారీ 5 నాటౌట్, రిషభ్ పంత్ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 19, మొత్తం (36 ఓవర్లలో 6 వికెట్లకు) 90.
వికెట్ల పతనం: 1-8, 2-26, 3-51, 4-72, 5-84, 6-89.
బౌలింగ్: టిమ్ సౌథీ 6-2-20-1, ట్రెంట్ బౌల్ట్ 9-3-12-3, కేల్ జమీసన్ 8-4-18-0, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 5-3-3-1, నీల్ వాగ్నర్ 8-1-18-1.

*చిత్రాలు.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎల్‌బీగా ఔట్ చేసిన కివీస్ బౌలర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్
*చటేశ్వర్ పుజారా వికెట్‌ను సాధించిన ట్రెంట్ బౌల్ట్ ఆనందం