క్రీడాభూమి

ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో రెండో రౌండ్‌కు మనోజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాకు (అజర్‌బైజాన్), జూన్ 17: అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) ఆధ్వర్యాన అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ మనోజ్ కుమార్ శుభారంభాన్ని సాధించాడు. కామనె్వల్త్ క్రీడల్లో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న మనోజ్ కుమార్ లైట్ వెల్టర్ వెయిట్ (64 కిలోల) ఓపెనింగ్ బౌట్‌లో 2-1 తేడాతో ప్యూర్టారికోకు చెందిన డానియెలిటో జొరిలా డీ లా రోసాను మట్టికరిపించి సత్తా చాటుకున్నాడు. ఆదివారం జరుగనున్న రెండో రౌండ్ బౌట్‌లో మనోజ్ ఈజిప్టుకు చెందిన రెండో సీడ్ బాక్సర్ మహమ్మద్ ఎస్లామ్ అహ్మద్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇదిలావుంటే, భారత్‌కు చెందిన మరో ఇద్దరు బాక్సర్లు గౌరవ్ బిధూరీ, మన్‌దీప్ జాంగ్రా తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడం అభిమానులను నిరాశపర్చింది. కామనె్వల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన మన్‌దీప్ జాంగ్రా 69 కిలోల తొలి రౌండ్ బౌట్‌లో 1-2 తేడాతో స్పెయిన్‌కు చెందిన యుబా సిస్సొఖో దియాయే చేతిలో ఓటమిపాలవగా, 52 కిలోల విభాగం తొలి రౌండ్ బౌట్‌లో బిధూరీ 0-3 తేడాతో అమెరికా బాక్సర్ అంటానియో వార్గస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ బిధూరీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు అవకాశాలు మూసుకుపోలేదు. వచ్చే నెల వెనెజులాలో ప్రొఫెషనల్ బాక్సర్లకు నిర్వహించనున్న ఫైనల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో బిధూరీ సత్తా చాటుకోగలిగితే అతనికి ఒలింపిక్ బెర్తు లభిస్తుంది.
ఈ టోర్నమెంట్‌లో సీడింగ్‌లు పొందిన భారత బాక్సర్లు ఇద్దరే. వీరిలో ఆసియా క్రీడల పసిడి పతక విజేత వికాస్ కృష్ణన్ (75 కిలోలు)కు రెండో సీడ్ లభించగా, కామనె్వల్త్ క్రీడల రజత పతక విజేత ఎల్.దేవేంద్రో సింగ్ (49 కిలోలు)కు నాలుగో సీడ్ దక్కింది. తొలి రౌండ్‌లో బైలు పొందిన వీరిద్దరూ ఈ నెల 20వ తేదీ నుంచి తమ విభాగాల్లో పోరాటాన్ని ప్రారంభించనున్నారు. అయితే వీరి ప్రత్యర్థులు ఎవరన్నదీ ఇంకా తేలలేదు.
ఈ టోర్నీలో మొత్తం 39 ఒలింపిక్ బెర్తులు (52, 56, 60, 64, 69, 75, 81 కిలోల విభాగాల్లో ఐదేసి స్లాట్లు, 49 కిలోల విభాగంలో రెండు స్లాట్లు, 91, 91+ కిలోల విభాగాల్లో ఒక్కో స్లాట్) ఉన్నాయి. వీటి కోసం వందకు పైగా దేశాలకు చెందిన 400 మందికి పైగా బాక్సర్లు పోటీ పడుతున్నారు. అయితే 56 కిలోల విభాగంలో శివ థాపా ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో ఆ కేటగిరీకి భారత్ ఎంట్రీని పంపలేదు.

మనోజ్ కుమార్

మరో ‘వైట్‌వాష్’పై
టీమిండియా గురి
జింబాబ్వేతో నేటి నుంచి టి-20 సిరీస్
హరారే, జూన్ 17: భారత్, జింబాబ్వే జట్ల మధ్య శనివారం నుంచి హరారేలో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 నుంచి ఈ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. బుధవారం ముగిసిన మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 3-0 తేడాతో సునాయాసంగా కైవసం చేసుకుని ఆతిథ్య జింబాబ్వే జట్టుకు ‘వైట్‌వాష్’ వేసిన ధోనీ సేన ఇప్పుడు ట్వంటీ-20 సిరీస్‌లో మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది జింబాబ్వే పర్యటనలో అజింక్యా రహానే సారథ్యంలోని భారత జట్టు చివరి మ్యాచ్‌లో ఓటమిపాలవడంతో రెండు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఆ జట్టులో సభ్యులుగా ఉన్న కేదార్ జాదవ్, మనీష్ పాండే లాంటి ఆటగాళ్లు ఇప్పుడు మరోసారి జింబాబ్వే పర్యటనలో పాలుపంచుకుంటున్నారు. టి-20 ఫార్మాట్‌లో ప్రపంచంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్‌గా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టుకు సారథ్యం వహిస్తుండటం, జట్టులోని మొత్తం 15 మంది సభ్యుల్లో ఫరుూజ్ ఫజల్ మినహా మిగిలిన వారంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 టోర్నమెంట్‌లో కాంట్రాక్టులు పొందిన వారు కావడం టీమిండియాకు కలిసొచ్చే విషయం. దీంతో శనివారం నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌లో కూడా భారత జట్టే హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

లియాండర్ పేస్‌కు సచిన్ శుభాకాంక్షలు
ముంబయి, జూన్ 17: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ 43వ జన్మదినోత్సవం సందర్భంగా క్రికెట్ లెజెండ్, ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ శుక్రవారం అతనికి శుభాకాంక్షలు తెలియజేశాడు. బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడల్లో పేస్ మరింత మెరుగైన ప్రదర్శనతో రాణించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాలని సచిన్ ఆకాంక్షించాడు. పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఇప్పటివరకూ 18 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన లియాండర్ పేస్ కొద్ది రోజుల క్రితం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్-2016 గ్రాండ్ శ్లామ్ టోర్నీలో తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలసి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం విదితమే. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్న లియాండర్ పేస్ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బొపన్నతో కలసి బరిలోకి దిగనున్నాడు.