క్రీడాభూమి

మరో సిరీస్‌పై ధోనీసేన గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూన్ 21: జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరుగనున్న నిర్ణాయక చివరి మ్యాచ్‌లో తలపడేందుకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వే జట్టును మట్టికరిపించి పూర్తి ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్న భారత జట్టు చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఎదురుచూస్తోంది. అంతకుముందు మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 3-0 కైవసం చేసుకుని జింబాబ్వేకి ‘వైట్‌వాష్’ వేసిన భారత జట్టుకు టి-20 సిరీస్ తొలి మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఓటమి ఎదురైన విషయం విదితమే. అయితే సోమవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో సమష్ఠిగా రాణించి జింబాబ్వేపై ఘనవిజయం సాధించిన టీమిండియా బుధవారం మరోసారి ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన యువ సీమర్ బరీందర్ సరన్ (4/10)తో పాటు మరో యువ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (3/11) ప్రత్యర్థులపై నిప్పులు చెరిగి ఉత్తమ గణాంకాలను నమోదు చేయడం, మరోవైపు ఓపెనర్లు లోకేష్ రాహుల్ (47-నాటౌట్), మన్‌దీప్ సింగ్ (52-నాటౌట్) జింబాబ్వే బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించి 10 వికెట్ల తేడాతో జట్టుకు సునాయాసంగా ఘనవిజయాన్ని అందించడం టీమిండియాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. దీంతో భారత జట్టు స్వదేశానికి తిరిగి వచ్చే ముందు బుధవారం వరుసగా మరో విజయాన్ని అందుకుని సిరీస్‌ను కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అయినప్పటికీ ప్రపంచంలోనే ఎంతో అనుభవజ్ఞుడైన సారథిగా పేరు తెచ్చుకున్న ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇంతకుముందు మ్యాచ్‌లో భారీ తేడాతో విజయాన్ని అందుకున్నప్పటికీ బుధవారం ప్రత్యర్థుల పట్ల ఏమాత్రం ఉదాసీనంగా వ్యవహరించరాదని ధోనీ ఇప్పటికే తన యువ సహచరులకు స్పష్టం చేశాడు. ‘పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో వేగవంతంగా పరుగులు సాధించడం ఎప్పుడూ ముఖ్యమే. కనుక మేము ఫీల్డర్లను పక్కకు నెట్టి అయినా వేగవంతంగా పరుగులు సాధించాల్సిన అవసరం ఉంది’ అని ధోనీ సోమవారం మ్యాచ్ ముగిసిన అనంతరం ఉద్ఘాటించాడు.
కాగా, బుధవారం చివరి టి-20 మ్యాచ్‌లో విజయం సాధించి ఇంతకుముందు వనే్డ సిరీస్‌లో ఎదురైన ఓటమికి భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని జింబాబ్వే జట్టు ఆశిస్తోంది. అయితే జింబాబ్వే బ్యాట్స్‌మన్లు స్థిమితంగా రాణించలేకపోతుండటం, త్వరత్వరగా వికెట్లు చేజారిపోతుండటం ఆతిథ్య జట్టును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ‘ఆరంభంలో మా బ్యాట్స్‌మన్లు బాగానే ఆడుతున్నారు. కానీ త్వరత్వరగా వికెట్లు చేజారిపోతుండటం నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. పిచ్ స్వభావం మారిపోయి మాకు సహకరించలేదేమో అనిపిస్తోంది. అయినప్పటికీ మా జట్టు కేవలం 99 పరుగులకే ఆలౌటవడం తీవ్రంగా చింతించాల్సిన విషయం’ అని జింబాబ్వే జట్టు కెప్టెన్ గ్రేమ్ క్రెమర్ సోమవారం మ్యాచ్ ముగిసిన అనంతరం వాపోయాడు. జింబాబ్వే జట్టులో చాము చిబాబా, హామిల్టన్ మసకద్జా, సికందర్ రజా, ఎల్టన్ చిగుంబురా, మాల్కమ్ వాలర్ తదితర బ్యాట్స్‌మన్లు రాణించడంతో పాటు బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిస్తేనే భారత్‌కు గట్టిపోటీ ఇవ్వడం సాధ్యమవుతుంది.

చిత్రం అమీతుమీకి సిద్ధమైన మహేంద్ర సింగ్ ధోనీ-గ్రేమ్ క్రెమర్