క్రీడాభూమి

పేస్‌కు మొండిచెయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డేవిస్ కప్ పోటీలకు
వెటరన్ ఆటగాడు దూరం
గత 27 ఏళ్లల్లో
ఇదే మొదటిసారి

బెంగళూరు, ఏప్రిల్ 6: భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మొట్టమొదటిసారి డేవిస్ కప్ పోటీలకు దూరంకానున్నాడు. ఆసియా/ ఓషియానియా జోన్ గ్రూప్-1లో ఉజ్బెకిస్తాన్‌తో పోటీలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. పురుషుల డబుల్స్ విభాగంలో పేస్ పేరును చేర్చలేదు. కోచ్ జీషన్ అలీ పర్యవేక్షణలో, ఇక్కడ పలువురు యువ ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్న పేస్‌కు ఈ వార్త శరాఘాతమైంది. డేవిస్ కప్ మ్యాచ్‌ని ఆడేందుకు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నానని పేర్కొన్న 43 ఏళ్ల పేస్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఒకప్పటి అతని డబుల్స్ భాగస్వామి మహేష్ భూపతి ఇప్పుడు భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సమయాన్ని చూసి అతను పేస్‌ను దెబ్బకొట్టాడన్నది నిజం. గతంలో ఇద్దరు మిత్రులైనప్పటికీ, తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో వీరిద్దరూ ముఖాముఖాలు చూసుకోలేనంత స్థాయిలో ఘర్షణపడి, సవాళ్లు విసుకొని, విమర్శలు చేసుకొని బద్ధ శత్రువులుగా మారారు. ఈ పరిస్థితుల్లో 43 ఏళ్ల యవసున్న పేస్‌ను భూపతి ఎంత వరకు ప్రోత్సహిస్తాడన్నది అనుమానంగానే కనిపించింది. చాలా మంది ఊహించిన విధంగానే భూపతి ఎంపిక చేసిన డబుల్స్ జట్టులో పేస్ పేరు కనిపించలేదు. ఇలావుండగా, 27 సంవత్సరాల తర్వాత మొదటిసారి డేవిస్ కప్ పోటీలకు దూరంగా ఉంటున్న పేస్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. అయితే, ఇటీవలే అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిటైర్మెంట్ గురించి తాను ఆలోచించడం లేదని, ఈ విషయంలో తాను స్పష్టతతో ఉన్నానని తేల్చిచెప్పాడు. సోమ్‌దేవ్ దేవ్‌వర్మ టెన్నిస్ నుంచి రిటైరైనప్పుడు విలేఖరులు తన నిర్ణయం గురించి ఆడిగారని గుర్తుచేశాడు. ‘నేడు లేదా రేపు లేదా ఆరు నెలల తర్వాత.. ఎప్పుడో ఒకసారి రిటైర్ కావాల్సిందేకదా’ అని తాను అప్పుడే సమాధానం చెప్పానని, కాబట్టి ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించడం వల్ల లాభం ఉండదని వ్యాఖ్యానించాడు. నిజానికి రిటైర్మెంట్‌పై తాను ఏమీ ఆలోచించడం లేదని, ఆడలేనని అనుకున్నప్పుడే టెన్నిస్‌కు గుడ్‌బై చెప్తానని అన్నాడు. కాగా, తాజా పరిణామంతో అతను రిటైర్మెంట్ గురించి ఆలోచించక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. భూపతి కొట్టిన దెబ్బకు పేస్ ఏ విధంగా సమాధానం చెప్తాడన్నది ఆసక్తిని రేపుతున్నది. 1990లో జపాన్‌పై జైపూర్‌లో తొలిసారి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన పేస్ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఈ పోటీలకు దూరంకాలేదు. భూపతి నిర్ణయం కారణంగా అతను తొలిసారి డేవిస్ కప్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాడు.
ఉజ్బెకిస్తాన్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న డేవిస్ కప్ పురుషుల డబుల్స్‌లో రోహన్ బొపన్నతో కలిసి ఆడే అవకాశాన్ని శ్రీరాం బాలాజీకి ఇస్తున్నట్టు నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ భూపతి ప్రకటించాడు. వీరిద్దరూ ఫరూఖ్ దస్తోవ్, సంజార్ ఫైజీవ్ జోడీని ఢీ కొంటారు. రాంకుమార్ రామనాథన్ భారత సింగిల్స్ విభాగంలో కీలక పాత్ర పోషించనున్నాడు. యుకీ భంబ్రీ గాయం కారణంగా వైదొలగడంతో, అతని బాధ్యతను స్వీకరించనున్న రాంకుమార్ మొదటి సింగిల్స్ మ్యాచ్‌ని టెమూర్ ఇస్లాయిలొవ్‌తో ఆడతాడు. మరో మ్యాచ్‌లో సంజార్ ఫైజీవ్‌తో ప్రజ్నేశ్ గునే్నశ్వరన్ తలపడతాడు.

ఏకపక్ష నిర్ణయం!
బెంగళూరు: డేవిస్ కప్ డబుల్స్ విభాగం జట్టు నుంచి తనను తప్పించడం ఏకపక్ష నిర్ణయమని తన మాజీ భాగస్వామి మహేష్ భూపతిపై లియాండర్ పేస్ మండిపడ్డాడు. మెక్సికోలో జరిగిన టోర్నమెంట్‌లో టైటిల్ సాధించి, స్వదేశానికి వచ్చిన విషయాన్ని అతను గుర్తుచేస్తూ, తాను మంచి ఫామ్‌లో ఉన్నానని, డేవిస్ కప్‌లో పాల్గొనే సామర్థ్యం తనకు ఉందని గురువారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. కానీ, భూపతి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలావుంటే, పేస్‌ను డబుల్స్ జట్టు నుంచి తప్పించడం విచాకరమేగానీ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే, అది మంచి చర్యేనని భారత డేవిస్ కప్ మాజీ కెప్టెన్ జైదీప్ ముఖర్జీ వ్యాఖ్యానించాడు. మహేష్ భూపతి ఈ నిర్ణయాన్ని తీసుకునే సమయంలో ఎంతో బాధపడి ఉంటాడని అన్నాడు. అయతే, జట్టు ఎంపిక జరిగినప్పుడు తప్పనిసరిగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటారని, భూపతి కూడా అదే విధానాన్ని అమలు చేశాడని అన్నాడు. కెరీర్‌లో 42 డబుల్స్ టైటిళ్లను కైవసం చేసుకొని పేస్ రికార్డు సృష్టించిన విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, క్రికెట్‌ను ఉదాహరణగా తీసుకున్నాడు. బ్రెండన్ మెక్‌కలమ్ రికార్డును అధిగమించే అవకాశం ఉన్నప్పటికీ, రాస్ టేలర్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడని అన్నాడు.

చిత్రం... భారత డేవిస్ కప్ ఆటగాళ్లు (కుడి నుంచి ఎడమకు)
రోహన్ బొపన్న, శ్రీరాం బాలాజీ, ప్రజ్నేశ్ గునే్నశ్వరన్, రాంకుమార్ రాంనాథన్