తెలంగాణ

10మంది మావోల హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 8: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్‌జీఏ వారోత్సవాల ముగింపు రోజైన మంగళవారం సుక్మా జిల్లా పోలీసులకు 26 మంది మావోయిస్టులు లొంగిపోయిన కొద్ది గంటల్లోనే ఇదే జిల్లాలోని కిష్టారం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు హతులయ్యారు. ఎదురుకాల్పుల్లో 5గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు ఆకస్మికంగా కాల్పులకు పాల్పడ్డారని, పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో పది మంది నక్సల్స్ హతులయ్యారని బస్తర్ ఐజీ కల్లూరి పేర్కొంటున్నారు.
మెరుపుదాడి తప్పించుకుని...
పీఎల్‌జీఏ వారోత్సవాలను పురస్కరించుకుని మావోయిస్టుల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు బస్తర్ ఐజీ కల్లూరి నేతృత్వంలో ఎస్టీఎఫ్, డీఆర్‌జీ చెందిన 250 మంది పోలీసులు సుక్మా జిల్లా పరిధిలోని కిష్టారం సమీప గ్రామాలు కాసారం, పుట్టికపల్లి, అంబపేట, పాలచెలం, పాలోడు, టెట్టమడుగుల్లో విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో వీరంతా టెట్టమడుగు అటవీ ప్రాంతంలో సుమారు 16 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తుండగా 150 మంది సాయుధ నక్సల్స్, 300 మంది మిలీషియా సభ్యులు మారణాయుధాలతో మాటువేసి దాడికి తెగబడ్డారు. ఈ ఆకస్మిక పరిణామానికి విస్తుపోయిన పోలీసులు వెంటనే తేరుకుని ఎదురుదాడికి దిగారు. ఈ ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మరణించారు. ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడటంతో పోలీసులు ఆత్మరక్షణలో పడటంతో మిగిలిన నక్సల్స్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ జవాన్లను అనూప్‌కుమార్, సోయం రమేశ్, డీఆర్‌జీకి చెందిన ఇందల్‌కుమార్, నురుంకాదేవ్, కట్టం సీతారాంలుగా గుర్తించారు. వీరిని 16 కి.మీలు తోటి జవాన్లు మోసుకొచ్చి ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా కిష్టారం నుంచి రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు. అక్కడ వీరు చికిత్స పొందుతున్నారు.
కిష్టారానికి అదనపు బలగాలు
తప్పించుకున్న మావోయిస్టుల కోసం బస్తర్ ఐజీ ఆధ్వర్యంలో అదనపు బలగాలు కిష్టారానికి బయలుదేరాయి. వీరంతా కిష్టారం ప్రాంతాన్ని జల్లెడ పట్టనున్నారు. జవాన్ల లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలను అదనంగా ఉన్నతాధికారులు కిష్టారం పంపుతున్నారు. ఈ ఘటనతో సుక్మా దండకారణ్యానికి సరిహద్దున ఉన్న ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తప్పించుకున్న మావోయిస్టులు ఇక్కడి అడవుల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు.
మరోచోట 26మంది లొంగుబాటు

చిత్రం.. సుక్మా జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయన 26 మంది మావోయిస్టులు

చిత్రం... ఎదురు కాల్పుల్లో గాయపడిన జవాన్లకు వైద్య సాయం అందిస్తున్న దృశ్యం