తెలంగాణ

సిద్దిపేట మున్సిపల్ చైర్మన్‌గా రాజనర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 15 : మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సుగా టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ ప్రకటించగా మంత్రి హరీష్‌రావు సమక్షంలో ఆ పార్టీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మంత్రి హరీష్‌రావు నూతనంగా ఎన్నికైన టిఆర్‌ఎస్ కౌన్సిలర్లతో శుక్రవారం ఇక్కడి బాలాజీ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు తమను తాము పరిచయం చేసుకోవడంతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్‌గా ఎన్నిక కోసం అభిప్రాయాన్ని వెల్లడించాలని మంత్రి కోరారు. పలువురు కౌన్సిలర్లు కడవేర్గు రాజనర్సు పేరును సూచించారు. కొందరు కౌన్సిలర్లు మాత్రం చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ఎవరిని ఎన్నిక చేసిన తమకు ఆమోదమేనన్న అభిప్రాయం వెలిబుచ్చారు. చైర్మన్ కోసం పోటీ పడిన మచ్చ వేణుగోపాల్‌రెడ్డి చివరకు రాజనర్సు పేరును ప్రతిపాదించి, వైస్ చైర్మన్‌గా తనకు అవకాశం ఇవ్వాలన్నారు. హ్యాట్రిక్ కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ తనకు వైస్ చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని కోరారు. జంగిటీ కనకరాజు కౌన్సిల్‌లో మహిళలు 17 మంది ఉన్నారని, మహిళలకు అవకాశం ఇవ్వాలన్నారు. ఆనంతరం కడవేర్గు రాజనర్సుకు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ముగ్గురు రైతుల ఆత్మహత్య
విద్యుదాఘాతంతో మరో రైతు మృతి
కట్టంగూర్/్ధన్వాడ/కురవి, ఏప్రిల్ 15: పంటలు కరవు పరిస్థితుల కారణంగా ఎండి పోవడంతో అప్పులు ఎలా తీర్చాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలో దిక్కుతోచని స్థితిలో మనస్తాపం చెంది నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటి పాముల గ్రామా నికి చెందిన రైతు లోడంగి రామచంద్రు(53) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహ బూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలంలోని వెంకటపురం గ్రామానికి చెందిన కుర్వ దశరత్ (31) అనే రైతు గురువారం సాయంత్రం తన పొలం వద్ద క్రిమిసంహరక మందును సేవించాడు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున ఆసుపత్రిలోనే మృతి చెందాడు. వరంగల్ జిల్లా కురవి మండలంలోని నేరడ గ్రామానికి చెందిన నీలం వెంకన్న (45) శ్రీరామనవమి పండుగ పూట ఊరి శివారు మామిడితోటలో ఉరిపోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్ల గొండ జిల్లా నిడమనూరు మండల పరిది రాజన్నగూడెం గ్రామంలో వెంకన్న (30) అనే రైతు వ్యవసాయ బావి వద్ద చేనుకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటార్‌ను స్టార్ట్ చేయగా విద్యుదాఘతానికి గురై మృతి చెందాడు.
వడదెబ్బతో 14 మంది మృతి

నల్లగొండ/మెదక్/మహబూబ్‌నగర్/కరీంనగర్/ఆదిలాబాద్, ఏప్రిల్ 15: ఎండల వేడిమి తాళలేక రాష్ట్రంలో పలు జిల్లాల్లో 14 మంది మృతి చెందారు. ఎండల వేడి ధాటికి వడదెబ్బ మరణాలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో గరిష్టంగా 43.4 డిగ్రీలు, కనిష్టంగా 27.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పాత గ్రామానికి చెందిన గుగులోతు సోమ్లా (26) అనే యువకుడు, దామరచర్ల మండల కేంద్రానికి చెందిన కూరపాటి అబ్రహం (55), ఇదే మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన కొర్ర మోతి (58), అర్వపల్లి మండల పరిధిలోని జాజిరెడ్డిగూడెం ఆవాస గ్రామం చాకలిగూడెంనకు చెందిన గుగ్గిళ్ల సోమయ్య (75) అనే వృద్ధుడు, అనుముల మండలంలోని పాశెంవారిగూడెంకు చెందిన పాశెం వెంకట్‌రెడ్డి (50), చిట్యాల మండల మండలం ఏపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పిశాటిగూడెంకు చెందిన పిశాటి శంకర్‌రెడ్డి (70), చిట్యాల పట్టణానికి చెందిన రావుల యాదిరెడ్డి (55), మెదక్ జిల్లా మెదక్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బి.నాగభూషణం (62), శివ్వంపేట మండలంలోని గోమారం గ్రామానికి చెంది చాకలి కిష్టయ్య (65), పెద్దశంకరంపేట పట్టణానికి చెందిన మలుగొండ సాయిలు (46), మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని అమరచింత పట్టణంలోని పద్మశాలినగర్‌కు చెందిన యశోద (70) అనే వృద్ధురాలు, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పెరకపల్లి పంచాయతీ సర్వాయిపేట గ్రామానికి చెందిన బోగం పాపయ్య (50) అనే వ్యక్తి, ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్‌దగడ్ గ్రామానికి చెందిన చౌదరి పరదేశి (50), బెజ్జూరు మండలం రుద్రాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప మల్లక్క (55) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందారు.

ఎట్టకేలకు కార్మికుడి మృతదేహం వెలికితీత

శిథిలాల కిందే మరో ఇద్దరి మృతదేహాలు
బోరుమన్న శాంతిఖని బొగ్గు గని

బెల్లంపల్లి, ఏప్రిల్ 15: పట్టణంలోని శాంతిఖని బొగ్గు గనిలో బుధవారం జరిగిన గని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. శిథిలాల కిందే దాదాపు 50గంటల పాటు సింగరేణి రెస్క్యూటీమ్, సంస్థ డైరెక్టర్ మనోహర్ రావు పర్యవేక్షణలో మృతిచెందిన ముగ్గురు కార్మికుల్లోంచి పొలసాని హన్మంతరావు (59) మృతదేహాన్ని ఉత్కంఠభరిత ఉద్రిక్త పరిస్థితుల నుంచి సంఘటనా స్థలం నుంచి ఎట్టకేలకు వెలికితీశారు. మరో ఇద్దరు కార్మికులైన గాలిపెల్లి పోశం, కిష్టయ్య మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయి. బుధవారం ఉదయం 9గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిన కార్మికులు శాంతిఖని బొగ్గు గనిలో విధులకు హాజరై విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే గనిలోనే మృత్యువాత పడ్డారు. సింగరేణి సంస్థను కుదిపివేసిన బొగ్గుగని ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో సంస్థలో పనిచేసే ప్రధాన కార్మికులు సిపిఐ, బీజేపీ, ఎంసిపిఐయు, టీఆర్‌ఎస్, టిడిపి, కాంగ్రెస్ పార్టీల శ్రేణులు ఈ ఘటనను తెలుసుకొని బెల్లంపల్లిలోనే మకాం వేసి శాంతిఖని బొగ్గు గనివద్ద మృతదేహాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూశారు. గనిలోని సంఘటనా స్థలం నుంచి కార్మికుడు పొలసాని హన్మంతరావు మృతదేహాన్ని తెస్తున్న క్రమంలో శాంతిఖని గని కార్మికులు ఒక్కసారి బోరుమన్నారు. కార్మికులు, మృతుల కుటుంబీకుల రోధనలు దిగ్బ్రాంతికి గురిచేసింది. అంతే కాకుండా మృతదేహాన్ని 50గంటల అనంతరం తెచ్చినతీరు బాగున్నప్పటికీ దేశ పారిశ్రామికాభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్న గని కార్మికులు ప్రమాదంలో చనిపోతే వారి దేహాన్ని గని ఆవరణలోనే ఉంచి శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించాల్సిన సింగరేణి అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు ఇలాంటివి చేయకుండా మృతదేహాన్ని బెల్లంపల్లి సింగరేణి ఏరియాస్పత్రికి తరలించడం సంస్థ కార్మిక వర్గాన్ని ఆవేదనకు గురిచేసింది. బొగ్గు గని ప్రమాదం ఘటనలో మృతిచెందిన ముగ్గురు కార్మికుల్లో ఒక కార్మికుని మృతదేహం మాత్రమే బయటికి తీసుకురాగా, మరో ఇద్దరు కార్మికుల మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయి. మృతదేహాన్ని వెలికితీసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించడంలో తాత్సారంగా వ్యవహరించి మృతదేహాల వెలికి తీతలో నిర్లక్ష్యం చేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్

మేళ్లచెర్వు, ఏప్రిల్ 15: 200 ఏళ్లనాటి అతి ప్రాచీనమైన పంచలోహ విగ్రహాలను దొంగిలించి వేరేచోటుకు తరలిస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కోదాడ రూరల్ సిఐ మధుసూదన్‌రెడ్డి విలేఖరుల సమావేశం నిర్వహించి సంఘటన వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని మల్లారెడ్డిగూడెం గ్రామంలోని శ్రీఉమామహేశ్వర ఆలయంలో గల శ్రీఉమామహేశ్వరస్వామి, కామేశ్వరమ్మ అమ్మవారు, గంగాదేవి పంచలోహ విగ్రహాలను కొందరు దుండగులు బుధవారం రాత్రి దొంగిలించారని, వాటిని గురువారం తరలిస్తుండగా పట్టుకున్నామని సిఐ తెలిపారు. ఈ చోరీ కేసులో ఆలయ పూజారి బొర్ర అనంతనరసింహ్మాచార్యులు ప్రధాన సూత్రధారి అని ఆయన తెలిపారు. సుమారు 200 సంవత్సరాల క్రితంగా చెప్పుకునే అతి ప్రాచీనమైన ఈ విగ్రహాలు దాదాపు రూ.20 లక్షల వరకు విలువ కలిగి ఉంటాయని సిఐ తెలిపారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం పాలపాడు గ్రామానికి చెందిన వెక్కంటి వెంకట్‌రెడ్డి, హైదరాబాద్ ఉప్పల ప్రాంతానికి చెందిన బరిగెల నరేష్, దేవరకొండకు చెందిన వనం మహేష్, కటకం రంజిత్ మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మోర్తాల నరసింహ్మారెడ్డి, అతుకుల వెంకటేశ్వర్లు ముఠాగా ఏర్పడి ఆలయ పూజారి బొర్ర అనంత నరసింహ్మాచార్యులు కూడా దొంగతనంలో భాగస్వాములుగా చేర్చారు. బుధవారం రాత్రి పూజారి దేవాలయం గేటు తెరిచి మూడు పంచలోహ విగ్రహాలను ముఠా సభ్యులకు అప్పగించాడన్నారు. వీరంతా విగ్రహాలను తరలిస్తుండగా పక్కా సమాచారం అందుకుని వలపన్ని నిందితులను పట్టుకున్నామన్నారు. వీరంతా గత కొద్దినెలలుగా ఈ చోరీకి పథక రచన చేస్తున్నారని తెలిపారు. విగ్రహాలను స్వాధీన పర్చుకుని మేళ్లచెర్వులోని శ్రీ స్వయంభుశంభులింగేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చామని తెలిపారు.

ఓజిన్ పరిశ్రమలో పేలిన రియాక్టర్
ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం?
పటన్‌చెరు, ఏప్రిల్ 15: మెదక్ జిల్లా పటన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని పరిశ్రమలో శుక్రవారం ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓజిన్ సిస్టమ్స్ లిమిటెడ్ పరిశ్రమలో యధావిధిగా శుక్రవారం ఉదయం ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. అసోం రాష్ట్రానికి చెందిన బిష్ప పార్సిల్ (25), కాళేశ్వర్ (30), ప్రదీప్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రమాదం సంభవించింది. ఉత్పత్తులకు సంబంధించి రసాయన రియాక్షన్ నిర్వహించే రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. విధులు నిర్వహిస్తున్న బిష్ప, కాళేశ్వర్, ప్రదీప్‌లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో వారు కాలిన శరీరాలతో తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిలో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సిఐ కిషోర్‌కృష్ణ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయంలోకి
దళితులు నిషిద్ధం

రాముని కల్యాణానికి దూరమైన మాధవగూడెం ప్రజలు
అంబేద్కర్ జయంతి రోజునే ఆలయ కమిటీ నిర్ణయం

చిలుకూరు, ఏప్రిల్ 15: కొనే్నళ్లుగా కలిసిమెలిసి మెలిగిన బిసి, దళిత సామాజిక వర్గాల మధ్య నేడు దేవాలయ ప్రవేశం అడ్డుగోడగా మారింది. నల్లగొండ జిల్లా చిలుకూరు మండలం కొండాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాధవగూడెం గ్రామంలో శుక్రవారం జరిగిన సీతారామ కల్యాణ మహోత్సవానికి దళితులకు అవమానం జరిగింది. దళితులు పెండ్లిపీటలపై కూర్చోవాలని నిర్ణయించుకోగా అందుకు దేవాలయ కమిటీ (బిసి సామాజిక వర్గం) వారు నిరాకరించడంతో వారు మనోవేదనకు గురయ్యారు. దళితులు దేవాలయం బయట నిలబడి కొబ్బరికాయలు కొట్టి అక్కడి నుండే దేవునికి దండం పెట్టుకోవాలని, లోనికి ప్రవేశించరాదని పెద్దలు నిర్ణయించడంతో సీతారామ కళ్యాణానికి వారు దూరమయ్యారు. దళితుల దేవాలయ ప్రవేశం నిషేధాన్ని బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి రోజున దేవాలయ కమిటీ నిర్ణయించడం మరింత విచారకరమైన విషయం. దేశం యావత్తు బాబా సాహెబ్ జయంతిని ఘనంగా జరుపుకుంటుంటే మాధవగూడెంలో మాత్రం వివక్ష చూపుతూ సీతారామ కళ్యాణానికి దళితులను ఆలయంలోకి ప్రవేశించరాదని నిర్ణయించడం సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా చేస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై జిల్లా అధికారులు విచారించి దళితుల ఆలయం ప్రవేశం చేయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల శాఖ, డివిజన్ కులవివక్ష పోరాట సమితి నాయకులు అధికారులను కోరుతున్నారు.