తెలంగాణ

ఈ ఏడాది నుంచే గురుకుల పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 20: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం 250 గురుకుల పాఠశాలలు మంజూరు చేయడం జరిగిందని, రాబోయే మూడు సంవత్సరాల్లో 5వేల కోట్లతో శాశ్వత భవనాలు, వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి గ్రామంలో 4.32 కోట్లతో నిర్మించిన మోడల్ స్కూల్ భవన సముదాయాన్ని, బాలికల వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా లక్ష 60వేల మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి కల్పించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఇప్పటికే నిర్వహించబడుతున్న 194 మోడల్ స్కూళ్లలో లక్ష 50వేల మంది విద్యార్థులకు ప్రతియేటా 200 కోట్ల రూపాయలు విద్యా వసతికి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాలు, ప్రహారిగోడల నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా సిసి కెమెరాల ఏర్పాటు, బయోమెట్రిక్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థినీ, విద్యార్థుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బాధ్యత తీసుకోవాలన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్రం సిద్ధించిన రెండు సంవత్సరాల్లో కెసిఆర్ నాయకత్వంలో చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను చూసి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతున్నారన్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఎమ్మెల్యే ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

ఫీజుల మోతను నిరసిస్తూ
మంత్రుల ఇళ్లు ముట్టడి
పలువురు ఆందోళనకారుల ఆరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 20: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎబివిపి ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ మంత్రుల వసతి గృహాలను ముట్టడిచారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ, పాఠశాలల్లో ఖాళీల భర్తీ, హాస్టళ్లలో కనీస సౌకర్యాల కల్పన వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రుల క్వార్టర్స్ ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రధాన రహదారులను బారికేడ్లతో మూసివేశారు. క్వార్టర్స్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎబివిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు అక్కడే రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలని, విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎబివిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటించారు. తరువాత ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్, బేగంపేట పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి ఎల్ అయ్యప్ప మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించేంత వరకు తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు.
22న అమృతా విద్యాలయం తల్లిదండ్రుల దీక్ష
అమృతా విద్యాలయం టిసిలు ఇచ్చిన విద్యార్థులను తిరిగి చేర్చుకోవాలని కోరుతూ ఈ నెల 22న పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేయనున్నట్టు విద్యార్థి జెఎసి ప్రధాన కార్యదర్శి నాగటి నారాయణ తెలిపారు. తమ దీక్షకు విద్యార్థి జెఎసి, యువజన, మహిళా సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. సోమావరం విలేకరుల సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు జెఎసి ప్రధాన కార్యదర్శి నాగటి నారాయణ, చైర్‌పర్సన్ అరవింద జౌటా, సిఐటియు నగర అధ్యక్షుడు కె రవి, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి రామకృష్ణ, డివైఎఫ్‌ఐ కార్యదర్శి మహేంద్ర, ఐద్వా కార్యదర్శి శారద పాల్గొన్నారు.
నేటి నుంచి కృష్ణా బ్రిడ్జిపై
రాకపోకలు బంద్
మాగనూర్, జూన్ 20: తెలంగాణ, కర్నాటక సరిహద్దులో కృష్ణానదిపై నిర్మించిన వంతెనకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో 40 రోజుల పాటు తెలంగాణ, కర్నాటకలకు ఈ రహదారి గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వచ్చేనెల జూలై 30 వరకు వంతెన పనులు కొనసాగనున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు లిఖిత పూర్వకంగా నోటిఫికేషన్ అందజేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుండి కర్ణాటక వైపు, కర్ణాటక నుండి హైదరాబాద్‌పై వెళ్ళే వాహనాలన్నీ మరికల్, ఆత్మకూర్, గద్వాల మీదుగా రాయిచూర్‌కు, లేదా హైదరాబాద్ నుండి మహబూబ్‌నగర్ గద్వాల మీదుగా రాయిచూర్‌కు వెళ్లే విధంగా దారి మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని వాహనాలు రాయిచూర్, గద్వాల మీదుగా జడ్చర్ల హైదరాబాద్‌కు వెళ్లేవిధంగా సూచించామన్నారు. అలాగే రాయిచూర్ నుండి యాద్గీర్ వైపు వెళ్లే వాహనాలు కల్మాల మీదుగా దేవదుర్గ హట్టిగూడూరుపై యాద్గీర్ వెళ్లేవిధంగాగా సూచించినట్లు తెలిపారు.
కల్తీ మసాలా కేంద్రాలపై
ఎస్‌ఓటి దాడులు
రూ.20 లక్షల సరుకు సీజ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 20: సైబరాబాద్ శివారు ప్రాంతాల్లోని కల్తీ మసాలా తయారీ కేంద్రాలపై సోమవారం ఎస్‌ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు రూ. 20 లక్షల నకిలీ మసాలాలను సీజ్ చేశారు. రాజేంద్రనగర్, జల్‌పల్లి, మహేశ్వరం పరిసర ప్రాంతాల్లో నకిలీ మసాలాలు తయారు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు దాడులు నిర్వహించారు. నాలుగు గోదాముల్లో ఎస్‌ఓటి అధికారులు సోదా చేయగా రెండు వందల బస్తాల నకిలీ మసాలాలను గుర్తించి సీజ్ చేశారు. నిర్వాహకులు పరారీలో ఉండగా గోదాములను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. పహాడిషరీఫ్‌లోని ఇంద్ర హౌసింగ్ సొసైటీకి చెందిన ఓ గోదాంలో అధిక మొత్తంలో మసాలా, పప్పు దినుసులు సీజ్ చేసి కేసును పహాడిషరీఫ్ పోలీసులకు అప్పగించినట్టు ఎస్‌ఓటి పోలీసులు వివరించారు.
2019 నాటికి
స్వచ్ఛ తెలంగాణ
జిల్లా కలెక్టర్లతో నేడు వర్క్‌షాప్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 20:స్వచ్ఛ్భారత్‌పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ను మంగళవారం నిర్వహిస్తారు. కేంద్ర గ్రామీణ తాగునీటి, పారిశుద్ధ్య శాఖ జాయింట్ సెక్రటరీ అరుణ్ బరోకా హాజరవుతారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరయ్యే ఈ వర్క్‌షాప్‌లో 2019 నాటికి తెలంగాణను బహిరంగ మల మూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. దీని కోసం మూడు దశల్లో అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్‌పై కలెక్టర్లు, జాయింట్ సెక్రటరీలతో చర్చిస్తారు. సిద్దిపేట, సిరిసిల్ల, వేముల వాడ నియోజక వర్గాలు ఇప్పటికే వంద శాతం బహిరంగ మల మూత్ర విరర్జన రహిత నియోజక వర్గాలుగా ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, పెద్దపల్లి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట నియోజక వర్గాలను త్వరలోనే ఈ జాబితాలో చేరుస్తారు. కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట, బోయిన్‌పల్లి మండలాలను కూడా చేర్చే లక్ష్యంతో పని చేస్తున్నారు.

.