తెలంగాణ

అట్టహాసంగా అంత్య పుష్కరాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31 : గోదావరి అంత్యపుష్కరాల్లో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పుష్కరాలకు పెద్దగా ప్రచారం ఇవ్వలేదు. గోదావరి ఆదిపుష్కరాల సమయంలో భారీ ప్రచారం కల్పించినప్పటికీ, వర్షాలు సరిగ్గా లేక నదిలో నీరు లేక భక్తులకు అనేక ఇక్కట్లు ఏర్పడ్డాయి. ఆదిపుష్కరాలకు విరుద్ధంగా, అంత్యపుష్కరాల సమయంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు మొదలుకుని గోదావరి జిల్లాల వరకు గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉండటంతో ప్రజలు స్వయంగా కదలి వస్తున్నారు. ఆదివారం ఉదయమే గోదావరి తీరంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి మాతకు పూజలు నిర్వహించి, అఖండ హారతులిచ్చారు. అన్ని ప్రాంతాల్లోనూ భక్తులు పితృదేవతలకు పిండప్రదానం చేశారు. అంత్యపుష్కరాలకు ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో భక్తులు అనేక ఇక్కట్లకు గురయ్యారు. తాగునీరు లేకపోవడంతో సహా వౌలిక వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇక్కట్లు ఎదురయ్యాయి. చాలా చోట్ల ఏడాది క్రితం ఆదిపుష్కరాలకు ఏర్పాటు చేసిన వౌలిక సదుపాయాలనే వాటి నిర్వహణ సరిగ్గా లేకపోయినా వినియోగించుకోవాల్సి వచ్చింది. పోలీసు సిబ్బంది మాత్రం తమ విధినిర్వహణలో నిమగ్నమయ్యారు.
కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధపుణ్యక్షేత్రమైన ధర్మపురిలో భగవాన్ విశ్వయోగి విశ్వంజీ గోదావరి అంత్యపుష్కరాలను ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభించారు. తొలుత ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు చేసి, ఆ తర్వాత గోదావరిలో పుష్కర స్నానం చేసి, గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. విశ్వంజీతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధర్మపరి వద్ద దాదాపు 25 వేల మంది పుణ్యస్నానం చేశారు. అలాగే కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలోని మరోప్రసిద్దమైన పుణ్యక్షేత్రం కాళేశ్వరం వద్ద జనం కిటకిటలాడారు. ఇక్కడ దాదాపు 30 వేల మందికి పైగా గోదావరి అంత్యపుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గోదావరి స్నానం చేసిన భక్తులు కాళేశ్వర-ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా పవిత్ర క్షేత్రమైన బాసరలో అంత్యపుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు వేల సంఖ్యలో కదిలి వచ్చారు. తెలంగాణ దేవాదాయ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అంత్యపుష్కరాను లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. బాసర సరస్వతీ ఆలయం అర్చకులు ఈ సందర్భంగా గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలంలోని సోన్ పుష్కర ఘాట్‌వద్ద ఉత్తరాధిమఠం వేదపండితులు అంత్యపుష్కరాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా వారు మహాసంకల్పం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లాలోని త్రివేణి సంగమం (గోదావరి, మంజీరా, హరిద్ర కలయిక) అయిన కందకుర్తి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (పోచంపాడ్), సావెల్, తడ్‌పాకల్, బట్టాపూర్, ఉమ్మెడ పుష్కర ఘాట్లకు జనం బాగానే తరలి వచ్చారు.
వరంగల్ జిల్లా మంగపేట ఫెర్రీపాయింట్ వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లో ప్రజలు ఉదయమే అంత్యపుష్కరాల్లో పాల్గొన్నారు. తదితర ప్రాంతాల్లో కూడా భక్తులు పుష్యస్నానాలు ఆచరించారు.
భద్రాచలంలో..
భద్రాచలం వద్ద గోదావరి నది అంత్యపుష్కరాల ప్రారంభంరోజైన ఆదివారం జనంతో కిటకిటలాడింది. గోదావరి మాతకు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం వద్ద గోదావరి తీరం ‘రామ’ నామ స్మరణతో మార్మోగింది. పుణ్యస్నానాలు చేసే భక్తులకు ఎలాంటి ప్రమాదం లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. గోదావరిలో పుణ్యస్నానాల తర్వాత భక్తులంతా సీతారామచంద్రస్వామిని దర్శించారు.

బాసరలో పుణ్యస్నానం ఆచరిస్తున్న మంత్రి అల్లోల దంపతులు, సుందిల్ల శివారులో భక్తుల పుణ్యస్నానాలు, నిజామాబాద్ జిల్లా సావెల్ పుష్కరఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు, భద్రాచలంలో అంత్యపుష్కరాలను ప్రారంభిస్తున్న అధికారులు

గోదావరి మాతకు హారతి ఇస్తున్న విశ్వయోగి విశ్వంజీ