తెలంగాణ

జగదభిరాముని జలవిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 20: వైకుంఠ రాముడు జగదభిరాముని జలవిహారం ఆదివారం రాత్రి పవిత్ర గోదావరి నదిలో వైభవంగా జరిగింది. భక్తుల జయజయధ్వానాలు, ఆనందోత్సాహాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణలు, కూచిపూడి నృత్యాలు, కోలాటాలు, దిక్కులు పిక్కటిల్లేలా ‘జైశ్రీరాం’ అనే నినాదాలు, కళ్లు మిరుగుట్లు గొలిపేలా ఆకాశంలో బాణసంచా వెలుగుల మధ్య సీతా సమేతుడై శ్రీరామచంద్రుడు పావన గోదావరి నదిలో విహరించారు. ఒళ్లంతా కళ్లు చేసుకుని భక్తులు ఆ సుందర దృశ్యాన్ని వీక్షించి తన్మయులయ్యారు. భద్రాచలం గోదావరి తీరం ఆదివారం సాయంసంధ్య వేళ ఇందుకు వేదికైంది. మధ్యాహ్నం 3గంటల సమయంలో శ్రీ సీతారామచంద్రస్వామికి ప్రభుత్వోత్సవం, దర్బారు సేవ నిర్వహించారు. శ్రీరామ భక్తులు వెంటరాగా వేదపండితులు, కోలాటాలు ఆడుకుంటూ మహిళలు నీరాజనాలు పలుకుతూ, రామనామ సంకీర్తనల నడుమ సీతా సమేతుడైన స్వామి గోదావరి తీరానికి బయలుదేరారు. ఈసందర్భంగా చప్టా దిగువన భక్తులంతా స్వామికి హారతులిచ్చి స్వాగతం పలికారు. గోదావరి తీరానికి చేరుకోగానే ముందుగా అర్చకులు విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన హంస వాహనానికి ప్రోక్షణ చేశారు. లాంచీని నడిపే వ్యక్తిని గుహుడుగా భావించి అతనికి స్వామివారి శేషమాలిక, శేషవస్త్రాలు బహూకరించారు. అనంతరం స్వామిని హంస వాహనంపైకి తీసుకొచ్చారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేశారు.
ఈసందర్భంగా చిన్నారులు కూచిపూడి నృత్యంతో స్వామికి కళాభిషేకం చేశారు. వేదపండితుల చతుర్వేద విన్నపాల అనంతరం ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. స్వామి ఆశీర్వచనం తీసుకున్నారు. ప్రసాద వినియోగం జరిగింది. అనంతరం భక్తులు జయజయధ్వానాలు పలుకుతుండగా స్వామివారు గోదావరిలో విహరించారు. ఈసందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి దివ్యదర్శనం చేసుకున్నారు. ఇసుక తినె్నల్లో రంగురంగుల బాణసంచాలు కాల్చుతుండగా ఆకాశం దివ్యకాంతులతో మైమరిపించింది. 5సార్లు స్వామి గోదావరిలో విహరించారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నారు.
తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం
అంతకుముందు ఉదయం రామాలయంలో మూలవరులకు అభిషేకం, సేవాకాలం జరిగింది. అనంతరం తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం భక్తిప్రవత్తులతో నిర్వహించారు. 12మంది ఆళ్వార్లలో తిరుమంగై ఆళ్వార్ ఒకరు. ఏదైనా క్షేత్రాన్ని దివ్యక్షేత్రంగా పిలవాలంటే ఎవరైనా ఒక ఆళ్వార్ ఆ ఆలయాన్ని సందర్శించాలి. శ్రీరంగం ఆలయోద్ధారకునిగా పిలిచే తిరుమంగై ఆళ్వార్ భద్రాచల క్షేత్రాన్ని సందర్శించినట్లు గురుపరంపర ప్రభావం అనే గ్రంథం చెబుతోంది. ఈ ఘనత భద్రాచలం క్షేత్రానికే దక్కింది. అందుకే తిరుమంగై ఆళ్వార్ స్వామిలో ఐక్యమైన ఈరోజును పరమపదోత్సవంగా అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా చేశారు. ముందుగా గర్భగుడిలో తిరుమంగై ఆళ్వార్ పేరిట స్వామికి అర్చనలు చేశారు. అనంతరం బేలమండపానికి తీసుకొచ్చి వేదపారాయణలు పూర్తయ్యాక ఆళ్వార్‌ను స్వామి పాదాల వద్ద ఉంచి స్వామిలో ఐక్యం అయినట్లుగా పూజలు చేశారు. దేశ శ్రేయస్సు కోసం తిరుమంగై ఆళ్వార్‌ను బతికించమని వేదపండితులు స్వామిని వేడుకోగా ఆయన పునర్జీవులు అవుతారు. అపుడు తిరుమంగై ఆళ్వార్‌కు స్వామివారి శేషమాలికలు, శేషవస్త్రాలు ఇచ్చి ఉత్సవాన్ని ముగించారు. ఎంతో వేడుకగా తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవాన్ని నిర్వహించారు. తర్వాత స్వామికి రాజభోగం నివేదించి నాళాయర దివ్యప్రబంధంలోని పాశురాన్ని అనుసంధానం చేస్తూ శాత్తుమురై, పూర్ణశరణాగతి సేవ చేశారు. దీంతో అధ్యయనోత్సవాల్లో స్వామికి పగల్‌పత్ ఉత్సవాలు ముగిసినట్లు వేదపండితులు ప్రకటించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం, ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ హన్మంతు, జిల్లా జడ్జి వినయ్‌మోహన్, భద్రాచలం జడ్జి బుల్లికృష్ణ, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, తదితరులు తెప్పోత్సవాన్ని వీక్షించారు.

చిత్రం.. భద్రాచలంలో సీతారాముల ఊరేగింపు దృశ్యం. గోదావరిలో హంస వాహనంపై విహరిస్తున్న స్వామి