తెలంగాణ

గ్రూప్-2కు చిల్లర కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారుమారైన ఓఎంఆర్ షీట్లు
పనిచేయని బయోమెట్రిక్ సిస్టమ్
అభ్యర్ధులకు తప్పని చిల్లర ఇబ్బందులు
5.17 లక్షలమంది హాజరు
సాంకేతిక కమిటీ నియామకం

హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణలో గ్రూప్-2 కేటగిరి పోస్టుల ఎంపికకు తొలి రెండు పేపర్ల పరీక్షలు శుక్రవారం అభ్యర్ధుల ఇబ్బందుల మధ్య జరిగాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరుగుతున్న తొలి మెగా ఎంపిక పరీక్ష కావడంతో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసినా అభ్యర్ధులకు మాత్రం ఇబ్బందులు తప్పలేదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎటిఎంలు పనిచేయక అభ్యర్ధులు చిల్లర కష్టాలు ఎదుర్కొన్నారు. అభ్యర్ధులకు 40 నుండి 60 కిలోమీటర్ల దూరంలోని పరీక్ష కేంద్రాలను కేటాయించడం వల్ల సకాలంలో చేరుకోలేకపోయారు. కొంతమంది వద్ద చిల్లర లేక, 500 నోట్లు చెల్లకపోవడంతో సకాలంలో కేంద్రాలకు చేరలేక పరీక్ష రాయడం మానుకున్నారు. సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రిని భద్రంగా ఉంచుకునే సదుపాయం కూడా లేక ఇబ్బందులుపడ్డారు. పలు కేంద్రాల్లో ఒఎంఆర్ షీట్లను ఇన్విజిలేటర్లు తారుమారు చేయడంవల్ల కూడా అభ్యర్థులకు తిప్పలు తప్పలేదు. మరోపక్క చాలా కేంద్రాల్లో బయోమెట్రిక్ మిషన్లు పనిచేయలేదు.
పరీక్ష తొలి రెండు పేపర్లు తేలికగా వచ్చాయని అభ్యర్ధులు చెబుతున్నారు. తొలి పేపర్ శుక్రవారం ఉదయం జనరల్ స్టడీస్, జనరల్ అబిలిటీపై జరగ్గా, సాయంత్రం హిస్టరీ, పాలిటి, సొసైటీపై జరిగింది. వీటిలో కబాలి, ధోని చిత్రాలపైనా ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు చెప్పారు. ఇక మూడో పేపర్ ఎకానమీపై 13న ఉదయం, తెలంగాణ మూమెంట్, స్టేట్ ఫార్మేషన్‌పై నాలుగో పేపర్ 13 సాయంత్రం జరగనున్నాయి. నాలుగు పేపర్లు కలిపి 600 మార్కులకు జరుగుతుంది. ఇంటర్వ్యూలకు అభ్యర్ధులను మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేసి 75 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మొత్తం మీద మార్కులు ఎవరికి ఎక్కువ వచ్చాయో చూసి తుది ఎంపిక జాబితా కమిషన్ ప్రకటిస్తుంది.
దాదాపు 8 లక్షలమంది దరఖాస్తు చేయగా, అందులో కొంతమంది దరఖాస్తులను కమిషన్ తిరస్కరించింది. మిగిలిన 7.83 లక్షల మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేయగా, 6.5 లక్షల మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారిలో పరీక్షకు 5,17,819 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో మూడున్నర లక్షల మంది హైదరాబాద్ కేంద్రం కోరగా, అందులో లక్షన్నర మందికి మాత్రమే నగరంలో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. మిగిలిన లక్షన్నర మందికి శివారు ప్రాంతాలే పరీక్ష కేంద్రాలుగా కేటాయించడంతో అభ్యర్థులకు అగచాట్లు తప్పలేదు.
బార్‌కోడ్ ఆందోళన అక్కర్లేదు: కమిషన్ కార్యదర్శి
బార్‌కోడ్, ఓఎంఆర్ షీట్‌లు సరిపోలేదనే ఆందోళన అభ్యర్ధులకు అక్కర్లేదని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ పేర్కొన్నారు. కేవలం కమిషన్ అంతర్గత పరిశీలనకు మాత్రమే ఆ ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్ధులు హాల్‌టిక్కెట్ నెంబర్ సవ్యంగా ఒఎంఆర్ షీట్‌పై నమోదు చేసి, ప్రశ్నాపత్రం బూక్‌లెట్ కోడ్ నమోదు చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
సాంకేతిక కమిటీ నియామకం
బార్‌కోడ్, ఓఎంఆర్, టెస్టు బుక్‌లెట్ సరిపోలని అభ్యర్ధులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు సాంకేతిక కమిటీని నియమించినట్టు కమిషన్ కార్యదర్శి పేర్కొన్నారు. నెట్‌వర్కు సమస్యలు తలెత్తడంతో చాలాచోట్ల బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయలేదని, అయితే అలాంటి అభ్యర్ధుల బయోమెట్రిక్‌ను ఈనెల 13న పేపర్-3, పేపర్-4 పరీక్షల సందర్భంగా సేకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.
వివిధ జిల్లాల్లో హాజరు
ఆదిలాబాద్ 76, నిర్మల్ జిల్లాలో 67, మంచిర్యాలలో 40, కుమరంభీమ్ 9 శాతం, నిజామాబాద్‌లో 73, కామారెడ్డిలో 67, కరీంనగర్‌లో 73, పెద్దపల్లిలో 63, జగిత్యాలలో 63, రాజన్న జిల్లాలో 56, వరంగల్ అర్బన్‌లో 77, వరంగల్ రూరల్‌లో 67, జయశంకర్ జిల్లాలో 54, జనగామలో 68, మహబూబాబాద్‌లో 34, ఖమ్మంలో 71, భద్రాద్రిలో 64, నల్గొండలో 73, యాదాద్రిలో 62, సూర్యాపేటలో 41, సూర్యాపేటలో 41, మహబూబ్‌నగర్‌లో 75, జోగులాంబలో 58, నాగర్‌కర్నూలులో 76, వనపర్తిలో 71, సంగారెడ్డిలో 56, మెదక్‌లో 68, సిద్దిపేటలో 62, రంగారెడ్డిలో 60, మేడ్చెల్‌లో 56,వికారాబాద్‌లో 56, హైదరాబాద్‌లో 64 శాతం హాజరయ్యారు. మొత్తం మీద సగటున 65 శాతం మంది హాజరయ్యారు.

చిత్రం... పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్ధుల హడావుడి