తెలంగాణ

ఖమ్మం నుంచే కారం దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 25: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న నకిలీ కారం దందా ఖమ్మం జిల్లా నుంచే నడిచినట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఉన్న కోల్ట్ స్టోరేజ్‌లలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేయగా ఈ విషయం స్పష్టమైంది. గురువారంనాడు కృష్ణా జిల్లా గంపలగూడెం వద్ద రెండు లారీల నకిలీ కారాన్ని పట్టుకున్న అధికారులు అప్పుడు దొరికిన వ్యక్తుల వద్ద నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మధిర నుంచే ఈ కారం వెళ్తున్నట్లు తెలుసుకొని శుక్రవారం మధిరలో ఉన్న రెండు కోల్డ్‌స్టోరేజ్‌లపై దాడులు నిర్వహించారు. అయితే ఒక కోల్డ్ స్టోరేజ్‌లో రికార్డుల ప్రకారం ఉండాల్సిన 6,073 బస్తాల కారం మార్కెట్‌లోకి వెళ్ళిపోగా మరో కోల్డ్‌స్టోరేజ్‌లోని 3,927 బస్తాల కారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరానికి సమీపంలో ముదిగొండ మండల కేంద్రంలోని చైనాకు చెందిన చిన్‌చాంగ్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ కారం ఖమ్మంకు చెందిన చైతన్య, సాయి ట్రేడర్స్, సారధినగర్ ఖమ్మం పేరుతో ఈ కోల్డ్ స్టోరేజ్‌కి చేరింది. అక్కడ తయారైన కారం మధిరకు చేర్చి కోల్డ్ స్టోరేజ్‌ల్లో భద్రపర్చి అక్కడినుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పంపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన కారం లారీలనే గంపలగూడెంలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ముదిగొండలోని కర్మాగారం నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని మధిరకు కారం బస్తాలను చేర్చేందుకు ఎటువంటి వేబిల్లులు లేకపోవడం గమనార్హం. ఇదే క్రమంలో వైరానది సమీపంలో సుమారు 500 బస్తాల కారాన్ని పారబోశారు. దీనిని కూడా శుక్రవారం అధికారులు పరిశీలించారు. విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయనే నేపథ్యంలోనే ఇతర ప్రాంతాలకు తరలించడం, పారబోయడం లాంటివి చేశారని అధికారులు వెల్లడించారు. ఇక్కడ దొరికిన కారాన్ని ప్రయోగశాలకు పంపించి పరిశీలించనున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ కారాన్ని చిన్న చిన్న హోటళ్ళు, దుకాణాలు, గ్రామీణ ప్రాంతంలోని కిరాణా షాపులకు సరఫరా చేయనున్నట్లు సమాచారం. ఇక్కడ దొరికిన ఆధారాలతో రాష్ట్రంలోని అన్ని కోల్ట్ స్టోరేజ్‌లు, గోడౌన్‌లపై దాడులు చేసేందుకు విజిలెన్స్ అధికారులు సమాయత్తమవుతున్నారు.