తెలంగాణ

సర్కారుకు మెట్రో చిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్పు అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ముందు కుదుర్చుకున్న ఒప్పందం మేరకే అలైన్‌మెంట్ ఉంటుందితప్ప, ఎలాంటి మార్పూ ఉండబోదని మెట్రోరైలు నిర్మాణ కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టి, మెట్రోరైలు ఎండి విబి గాడ్గిల్ తాజాగా చేసిన ప్రకటన ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. సుల్తాన్ బజార్, అసెంబ్లీ ముందునుంచి వెళ్లనున్న మెట్రోరైలు మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చి తీరుతామని సిఎం కె చంద్రశేఖర్‌రావు గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీకి విరుద్ధంగా ఇప్పుడు ఎల్ అండ్ టి చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ సుల్తాన్‌బజార్, బడిచౌడి వ్యాపారులు శుక్రవారం బంద్ నిర్వహించి నిరసన తెలిపారు. మెట్రోరైలు అలైన్‌మెంట్ మార్చాలని కోరుతూ సుల్తాన్‌బజార్‌లో వ్యాపారులు, అదే బజారుపై ఆధారపడి జీవనోపాది కొనసాగిస్తున్న చిరు వ్యాపారులు ఇప్పటికే అనేకసార్లు ఆందోళనలు నిర్వహించారు. వీరికి దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. తెరాస అధికారంలోకి రాకముందు సుల్తాన్‌బజార్‌లో వ్యాపారులు నిర్వహించిన బహిరంగ సభకు ప్రస్తుత సిఎం కెసిఆర్ స్వయంగా హాజరై, అలైన్‌మెంట్ మార్చకుండా పనులు కొనసాగిస్తే ఏస్థాయికి వెళ్లయినా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. వ్యాపారులకు తన పూర్తి మద్దతు ఉంటుందని కెసిఆర్ హామీ ఇచ్చారు. తర్వాత తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం మెట్రోరైలు నిర్మాణ సంస్థ ఉన్నతాధికారులను పిలిపించి అలైన్‌మెంట్ మార్చాల్సిందిగా ఆదేశించారు. దీంతో సుల్తాన్‌బజార్, అసెంబ్లీముందు నుంచి వెళ్లే అలైన్‌మెంట్ పనులను ఏడాదికాలంగా ఎల్ అండ్ టి నిలిపివేసి, ఇటీవల మళ్లీ మొదలెట్టింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ, సిఎం నుంచి కానీ ఈ అంశంపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో తమకు ప్రభుత్వం అండగా ఉంటుందని సుల్తాన్‌బజార్ వాసులు, వ్యాపారులు ధీమాగా ఉన్నారు. అయితే తాజాగా నాగోల్‌లో మెట్రోరైలు వాణిజ్య సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా మెట్రోరైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి మేనేజింగ్ డైరెక్టర్ విబి గాడ్గిల్ అలైన్‌మెంట్‌లో ఎలాంటి మార్పూ ఉండబోదని, పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ప్రకటించారు. దీంతో భగ్గుమన్న సుల్తాన్‌బజార్ వ్యాపారులు శుక్రవారం బంద్ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మరో రెండు నెలలో జిహెచ్‌ఎంసి ఎన్నికల జరుగబోతున్న తరుణంలో నగరంలో మెట్రోరైలు వివాదాన్ని ప్రతిపక్షాలు తమకు సానుకూలంగా మలుచుకొని అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని గ్రేటర్ హైదరాబాద్ తెరాస నేతలు ఆందోళన చెందుతున్నారు.
సిఎంవో ఆగ్రహం
మెట్రోరైలు అలైన్‌మెంట్‌పై నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గాడ్గిల్ చేసిన ప్రకటన పట్ల సిఎం కార్యాలయ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలోనూ రాష్ట్ర విభజన జరిగితే మెట్రోరైలు కాంట్రాక్టు తమకు గిట్టుబాటుకాదని, నిర్మాణ పనిని అర్ధాంతరంగా వదలుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అప్పటి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి గాడ్గిల్ రాసిన లేఖ బయటపడటంతో వివాదాస్పదమైంది. ఈ అంశంపై సిఎం కెసిఆర్‌ను కలిసి వివరణ ఇవ్వడానికి వచ్చిన గాడ్గిల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అలైన్‌మెంట్‌పై గాడ్గిల్ చేసిన ప్రకటన ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో సిఎంఓ అధికారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలాఉండగా ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఎల్ అండ్ టిని అదుపులో పెట్టలేకపోతున్నారని మెట్రోరైలు చైర్మన్ ఎన్‌విఎస్ రెడ్డిపైనా సిఎంఓ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసి, చీవాట్లు పెట్టినట్టు అధికార వర్గాల సమాచారం.

చిత్రం... బంద్ కారణంగా సుల్తాన్ బజార్‌లో మూతపడిన దుకాణాలు