తెలంగాణ

కల సాకారం అవుతున్నవేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 22: దాదాపు ఆరు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. అప్పటి నిజాం నవాబుల హయాంలోనే సర్వే పూర్తయనా ఈ రైల్వే లైన్ పనులు నత్తనడకన కొనసాగుతూ, ఎట్టకేలకు తుదిరూపును సంతరించుకున్నాయి. ఈ నెల 25న పెద్దపల్లి-నిజామాబాద్ మార్గంలో డెమో రైలు సర్వీసును కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు సికిందరాబాద్ స్టేషన్ నుండి రిమోట్ ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కార్యాలయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఇప్పటికే ఈ మార్గంలో నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ వరకు రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఆర్మూర్ నుండి నిజామాబాద్ వరకు పెండింగ్‌లో ఉన్న పనులను గత రెండు మాసాల నుండి యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో పాటు సేఫ్టీ విభాగం అధికారులు కూడా ఈ మార్గంలో ట్రాక్‌ను పరిశీలించారు. పివి.నర్సింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 1994లో పెద్దపల్లి వద్ద ఈ రైల్వేలైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 177 కిలోమీటర్ల నిడివి గల మార్గంలో రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేసి 2001 నాటికే రైళ్ల రాకపోకలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే ప్రతిఏటా బడ్జెట్‌లో అత్తెసరు నిధులతోనే సరిపెట్టడంతో పనులు ముందుకు సాగలేదు. నిజామాబాద్-ముంబైల మధ్య హైదరాబాద్ జోన్ పరిధిలో పెద్దఎత్తున రైళ్లు నడుస్తుండగా, పెద్దపల్లి-న్యూఢిల్లీ మధ్య సికింద్రాబాద్ జోన్ పరిధిలోనూ గణనీయంగానే రైళ్లు నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైల మధ్య లింక్ లైన్‌గా మిగిలిపోయి ఉన్న పెద్దపల్లి-నిజామాబాద్ మధ్య రైలు నిర్మాణం చేపడితే వాణిజ్య వ్యాపారం ఊపందుకుంటుందని భావించి, దాదాపు పాతికేళ్ల క్రితమే ఈ రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదటి దశగా కరీంనగర్ వరకు, అనంతరం జగిత్యాల వరకు పనులను పూర్తి చేసి కరీంనగర్-జగిత్యాల మధ్యన 2007వ సంవత్సరం నుండే డెమో రైలును నడిపిస్తున్నారు. కరీంనగర్-మోర్తాడ్‌ల మధ్య 65.9 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణాన్ని 2010కల్లా పూర్తి చేశారు. అక్కడి నుండి నిజామాబాద్ వరకు కూడా రైల్వే ట్రాక్ సిద్ధమైన నేపథ్యంలో ప్రస్తుతం పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ పనులు సంపూర్ణంగా పూర్తయినట్టు అయింది. దీంతో ఈ నెల 25న రైల్వే మంత్రి సురేష్‌ప్రభు చేత లాంఛనంగా ఈ కొత్త మార్గంలో రైలు సర్వీసును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.