తెలంగాణ

కల నెరవేరిన వేళ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఈ నిజామాబాద్ వాసులు ఇక భారతీయులే
నిజామాబాద్, జూన్ 19: పాకిస్తాన్ జాతీయత కలిగి ఉన్న ముగ్గురు యువకులకు భారత ప్రభుత్వం మన దేశ పౌరసత్వం కల్పించింది. దీంతో గత అనేక సంవత్సరాల నుండి తాము భారతీయులం అనిపించుకోవాలనే యువకుల కోరిక ఎట్టకేలకు నెరవేరినట్లయ్యింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా జారీ అయిన సిటిజన్‌షిప్ ఉత్తర్వులను మంగళవారం జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఆర్‌డీఓ వినోద్‌కుమార్ యువకులకు అందజేశారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో నివసిస్తున్న ఎండీ.సనన్ (29), ఎండీ.రుమాన్ (27), ఎండీ.సైఫ్ (25)లు పాకిస్తాన్‌లో పుట్టినప్పటికీ, భారతీయ పౌరసత్వం పొందారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్, నటరాజ్ థియేటర్ సమీపంలో నివాసం ఉండే హఫీజ్ అబ్దుల్ రహ్మాన్, సందానిబేగం దంపతులు తమ కుమార్తె ఫైజున్నీసాబేగం (55)ను 1988లో పాకిస్తాన్‌లోని బహావల్‌పూర్ పట్టణానికి చెందిన నదీమ్‌జావీద్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. బంధువులు పాకిస్తాన్‌లోనూ ఉండడంతో వారి ద్వారా ఈ పెళ్లి సంబంధం కుదిరింది. వివాహం జరిగిన మీదట ఫైజున్నీసాబేగం భర్త వెంట పాకిస్తాన్‌కు వెళ్లిపోయింది. అప్పుడప్పుడూ నిజామాబాద్‌లోని తన పుట్టింటికి వచ్చి కొన్నాళ్లు ఉండి తిరిగి వెళ్లిపోయేది. ఈ దంపతులకు మహ్మద్ సనన్, మహ్మద్ రుమాన్, మహ్మద్ సైఫ్‌లు పాకిస్తాన్‌లోనే జన్మించారు. సుమారు పదేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తరువాత భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి తరుచూ ఘర్షణలు చోటుచేసుకునేవని తెలిసింది. దీంతో విసిగిపోయిన ఫైజున్నీసాబేగం భర్తతో తెగదెంపులు చేసుకుని 2004లో విడాకులు తీసుకుంది. ముగ్గురు కుమారులను వెంటబెట్టుకుని నిజామాబాద్‌లోని పుట్టింటికి చేరుకుంది. ఫైజున్నీసా ఇక్కడే పుట్టి పెరగడం, పెళ్లి చేసుకున్న తరువాత కూడా తన పౌరసత్వాన్ని రద్దు చేసుకోకపోవడంతో ఆమె స్థానికంగా ఉండేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే, ముగ్గురు కుమారులు మాత్రం పాకిస్తాన్ జాతీయత కలిగి ఉండడంతో వారు తనతో పాటే ఇండియాలో నివసించేందుకు వీలుగా దీర్ఘకాలిక వీసా (లాంగ్‌టర్మ్ వీసా) పొందింది. గడువు ముగిసేలోపు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించిన మీదట ముగ్గురు వీసాలు పొడిగించబడేవి. అయితే వరుసగా ఏడు సంవత్సరాలు పైబడి స్థానికంగా ఉన్నట్లయితే శాశ్వతంగా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలుసుకున్న ఫైజున్నీసా తన ముగ్గురు కుమారులతో గత ఏడాది దరఖాస్తులు చేయించింది. తన పరిస్థితిని సైతం వివరిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ అందించింది. వీరి దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం, వారికి భారత పౌరసత్వం కల్పిస్తూ గత ఏప్రిల్ 24వ తేదీన అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకుని ఈ ఉత్తర్వులు నిజామాబాద్ జిల్లా యంత్రాంగానికి చేరగా, కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం స్థానిక ఆర్డీఓ వినోద్‌కుమార్ సదరు యువకులను కార్యాలయానికి పిలిపించుకుని కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా సదరు యువకులతో పాటు వారి తల్లి ఫైజున్నీసాబేగం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానిక అధికారులు, పోలీసు వర్గాల వారు కూడా తమకు ఎంతగానో సహకరించారని, అందరి తోడ్పాటుతో తన కుమారులకు భారతీయులుగా హోదా దక్కిందని, వీసాల పొడిగింపు కోసం పదేపదే దరఖాస్తులు చేసుకోవాల్సిన ఇబ్బందులు దూరమయ్యాయని ఫైజున్నీసాబేగం ఆనందం వెలిబుచ్చారు.