తెలంగాణ

తెరాస సర్కారుపై ఇక యుద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: నాలుగేళ్లుగా ప్రజలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో ఇచ్చిన హామీలను తుంగలొ తొక్కి ఎలా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందో ప్రజలకు వివరించి, టీఆర్‌ఎస్ సర్కార్‌పై యుద్ధం ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు. శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో జనచైతన్యయాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయన శుక్రవారం నాడు పాత్రికేయులతో మాట్లాడుతూ జూన్ 23 నుండి జూలై 6 వరకూ ఈ యాత్ర తొలి దశ కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు అన్నీ మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్న పార్టీలేనని విమర్శించారు. కర్నాటక ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల అపవిత్ర కలయిక, అధికారం కోసం వాళ్లు పాకులాడుతున్న తీరు బట్టబయలైందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయని, కాళ్లు మాత్రం తంగేళ్లు దాటడం లేదని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అంటే కేసీఆర్ కుటుంబం అన్నట్టు రాష్ట్రంలో పరిస్థితి తయారైందని లక్ష్మణ్ ఆరోపించారు.
టీఆర్‌ఎస్- బీజేపీల మధ్య ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవని, అలాంటి ఒప్పందాలపై బీజేపీకి ఎలాంటి విశ్వాసం లేదని లక్ష్మణ్ అన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న మోదీ ప్రభ, బీజేపీ ప్రాబల్యాన్ని ఎదుర్కోలేక, ముఠాలు కట్టి బీజేపీని నిలువరించేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ ఓటమి పాలవుతామో అన్న భయంతో ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని, ఇటీవల రైతుబంధు ప్రకటించిన టీఆర్‌ఎస్ అందులో లోపాలు మాత్రం సవరించడం లేదని అన్నారు.

బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలను మభ్యపెట్టేలా , పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాల ప్రజలు రగిలిపోతున్నారని, టీఆర్‌ఎస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తమ హక్కుల కోసం ప్రయోజనాల కోసం ప్రశ్నించేవారిని ఈ సర్కార్ నిర్బంధాలతో అణచివేస్తోందని, టీఆర్‌ఎస్, కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సిఎం మాట్లాడటం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు.
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రధాని మోదీ తీవ్ర కృషి చేస్తున్నారని 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో ముందుకు పోతున్నారని చెప్పారు. బీజేపీ తలపెట్టిన యాత్రను విజయవంతం చేసేందుకు , బీజేపీకి మద్దతు తెలిపేందుకు అన్ని వర్గాల ప్రజలు తమతో కలిసి రావాలని డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు.