తెలంగాణ

పంచాయతీలకు ప్రత్యేక అధికారులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్ణీత గడువులోగా నిర్వహించేందుకు ఏ కారణంతోనైనా వీలుకాకపోతే సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులను (స్పెషల్ ఆఫీసర్లు) నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, సభ్యుల కాలపరిమితి 2018 జూలై 31 తో ముగుస్తుంది. ఈ లోగా ఎన్నికలు జరిగితే ఆగస్టులో కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టేందుకు వీలయ్యేది. హైకోర్టులో తాజాగా నమోదైన కేసులో కోర్టు ఆదేశాల మేరకు జూలై చివరిలోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దాంతో సర్పంచ్‌ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.
పంచాయతీల్లో రిజర్వేన్లకు సంబంధించి బీసీల జనాభా వివరాలు లేకుండా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2018 జూలై 31 తర్వాత పరిపాలనకు ఆటంకం ఏర్పడకుండా పంచాయతీ పాలక మండళ్ల పదవీ కాలాన్ని పొడగించడం ఒక మార్గమైతే, పాలక వర్గాలను రద్దు చేసి, సర్పంచ్‌ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించాలనేది మరొక ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ముందు ఉంది. ఈ విషయంలో న్యాయపరమైన అంశాలను పరిశీలించాలని, ఇందుకోసం న్యాయనిపుణులతో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బీసీల జనాభా విషయంలో హైకోర్టు చేసిన సూచనల తర్వాత బుధవారం కసరత్తు ప్రారంభమైంది. బీసీల జనాభా తేల్చాలని హైకోర్టు చెప్పడం, ఈ వివరాలు నాలుగు వారాల్లో ఇవ్వాలని కోర్టు సూచించడంతో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై చర్యలకు పూనుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతాధికారులతో సంప్రదిస్తూనే ఉన్నారు. జూపల్లి గద్వాల జిల్లా టూర్‌లో ఉన్నారు. అయినప్పటికీ గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి తాజా పరిణామాలతో ఆయన పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌తోనూ, కమిషనర్ నీతూప్రసాద్‌తోనూ ఫోన్‌లోనే బుధవారం మాట్లాడారు. న్యాయనిపుణులతో చర్చించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద బీసీల జనాభా లెక్కలు లేవు. ఈ లెక్కలు కావాలంటే బీసీ కమిషన్ ముందుకు రావలసి ఉంటుంది. బీసీ కమిషన్‌కు బీసీల జనాభా సేకరించే బాధ్యత అప్పచెబితే కనీసం ఆరునెలల గడువు అవసరం అవుతుందని కమిషన్ వర్గాలు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పాయి. బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీల జనాభా అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. బీసీ కమిషన్ గతంలో ముస్లింలలో కొన్ని వర్గాలను బీసీ-ఈ గ్రూప్‌లో చేర్చేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే బీసీల మొత్తం జనాభా ఎంత అన్న అంశంపై ఈ కమిషన్ గతంలో అధ్యయనం చేయలేదు. 2011లో కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభా వివరాలు సేకరించింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో 52 శాతం జనాభా బీసీలని తేలింది. అయితే ఈ లెక్కలు సరిగ్గా లేవని ఆరోపణలు రావడంతో, పూర్తిస్థాయి లెక్కలను కేంద్రం అధికారికంగా ప్రకటించలేకపోయింది. ఇప్పుడు బీసీల జనాభా కావాలంటే బీసీ కమిషన్ ద్వారానే సేకరించాల్సి ఉంటుంది. తాజా పరిస్థితిపై విపక్షాలతో చర్చించేందుకు ప్రభుత్వం అవసరమైతే అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వ ఆలోచనలతో ఒక నివేదిక రూపొందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (స్టేట్ ఎలక్షన్ కమిషన్-ఎస్‌ఈసీ) పంపించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఎస్‌ఈసీకి చేరే అవకాశం ఉంది.