తెలంగాణ

వస్తోంది మహిళా ఫ్రంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: కుల, మతాలకు, రాజకీయాలకు అతీతంగా మహిళా ఫ్రంట్ రాబోతున్నది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ‘కారా’ సభ్యురాలు, మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల సారథ్యంలో ‘ఫ్రంట్’కు రూపకల్పన జరుగుతున్నది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఇటీవల పుష్పలీలను ‘కారా’ (చైల్డ్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ) సభ్యురాలిగా నియమించారు. ఈ సందర్భంగా కొండ్రు పుష్పలీల బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై, ముఖ్యంగా చిన్నారులను చిదిమేస్తున్న ఘటనలపై తీవ్రంగా ప్రతిస్పందించారు. మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చేంత వరకూ తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. మహిళలపై అత్యాచారాల నిరోధానికి ‘నిర్భయ’ చట్టం తెచ్చినా ఫలితం ఉండడం లేదని ఆమె ఆవేదన చెందారు. ఇటువంటి దురాగతాలను ఎదుర్కొవడానికి మహిళలను చైతన్యవంతం చేసేందుకు తాము త్వరలో కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు.
మహిళలు, పిల్లల సంరక్షణ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని పుష్పలీల అన్నారు. అయితే తల్లిదండ్రులు, మహిళలు, పిల్లలు బయటకు వెళ్లినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై వారిని చైతన్యపరిచేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. యాదగిరిగుట్టలో వ్యభిచార కూపం పట్ల ఆమె కలత చెందారు. పవిత్ర పుణ్యక్షేత్రం ప్రాంతంలో అటువంటి కార్యక్రమాలు జరగడం, చిన్నారులను దించడం బాధాకరమని అన్నారు.

మంగళహారతులు ఇవ్వడానికేనా!
రాజకీయ పార్టీలు మహిళలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు. అన్ని పార్టీలూ మహిళా విభాగాలను ఏర్పాటు చేసినప్పటికీ, దాదాపు అన్ని పార్టీలూ మహిళలకు ప్రాధాన్యతనివ్వడం లేదని, వారికి సరైన గుర్తింపునివ్వడం లేదని ఆమె తెలిపారు. కేవలం మంగళహారతులు ఇవ్వడానికేనా మహిళా విభాగాలు ఉన్నదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి లేరని, కేవలం ఎంపీ కవిత హడావుడి ఉంటున్నదని ఆమె విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి, బీసీలకు సరైన న్యాయం జరగడం లేదని ఆమె విమర్శించారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని పుష్పలీల విమర్శించారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని, మహిళలు సమిష్టిగా ఉంటూ ఎదుర్కొవడానికి వీలుగా కుల, మతాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. దీనికి ఇదివరకే వివిధ ప్రముఖులతో మంతనాలు జరిపానని, త్వరలో ఫ్రంట్ పేరును వెల్లడిస్తానని పుష్పలీల చెప్పారు.