సబ్ ఫీచర్

దయతోనే పవిత్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గలగల పారుతున్న నీటిలో ఒకవైపు సూర్య నమస్కారాలు, పశువులను కడగటం, బట్టలు ఉతకటం, కర్మకాండలు చెయ్యటం, పూజలకు వాడినటువంటి పూలు, ఆకులు, దీక్షాపరులు (దీక్షలు తీసుకున్నవారు) భుజించిన విస్తర్లు లాంటివి అన్నీ ఆ నీటిలోనే వేస్తుంటాము. ఇన్ని పనుల్లో మైల ఉంది. మంచి ఉంది, మడి ఉంది. ఇవన్నీ ఏక కాలంలోనే జరుగుతున్నాయి.
ఒకవేళ పశువులను కడగటం, బట్టలు ఉతకటం, కర్మకాండలు నిర్వహించటం, స్నానాదులు చెయ్యటంవలన ఆ ఏరు మలినమయినట్లయితే మిగిలిన సూర్య నమస్కారాలు చెయ్యటం, పూలు, ఆకులువేయటం వ్యర్ధమయినట్లేనా? గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి అనే ఈ పంచభూతాలు ఎల్లప్పుడూ పవిత్రతను కోల్పోవు. కావున వాటిని శుద్ధిచేయలేము. అంతశక్తికూడా ఎవరికీ లేదని చెప్పవచ్చు. పంచభూతాల్లో ఏ ఒక్కటి ఉగ్రరూపం దాల్చినాకూడా సృష్టి అంతం అయిపోతుంది. సృష్టిలో అత్యంత శక్తిగలవి పంచభూతాలు మాత్రమే.
ఏ మంత్రంతోనూ, శక్తులతోనూ పంచభూతాలను సంప్రోక్షణ చేయలేం. ఏరులో జరుగుతున్న పనులన్నీ దైవకార్యాలుగానే భావించవచ్చు. శుభ్రంగా బట్టలు ఉతుక్కొని స్నానం చేయడం ద్వారా శరీరాన్ని శుద్ధిచేసుకోవటంవల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. సూర్య నమస్కారాలు చెయ్యటం దైవచింతనకు సంబంధించిన విషయమే. పశువులను శుభ్రంగా కడగడంమూలాన వాటి పొదుగు శుభ్రమయ్యి, వాటి లేగదూడలు పాలు త్రాగిన తర్వాత, మిగతా పాలను పితికి దైవకార్యాలకు ఉపయోగిస్తాము.
కర్మకాండలు చేయడంవల్ల చనిపోయిన వారి ఆత్మలు శాంతించి, వారు ఏ లోకంలో ఉన్నప్పటికీ సంతృప్తిగా ఉంటారు. ఇక పూజలు చేసినపుడు వాడిన పూలు, పండ్లు, ఆకులు, దీక్ష తీసుకున్న భక్తులు భోంచేసినటువంటి విస్తర్లు ఆ ఏరులో కలిపినట్లయితే అంటు, ముట్టు అంటవని అలాచేస్తాం. కానీ ఏరులో పారుతున్న నీటిలో ఇన్నివిధాల కర్మలు జరుగుతున్నాయి.
వాటితోపాటు చనిపోయిన జంతువు, పక్షుల కళేబరాలు అందులోనే కలిసిపోతాయి. ఎంత మైల ఉన్నా, అంటరాని వస్తువులు ఉన్నప్పటికీ నీటిని శుద్ధిచేయలేం. ఆ నీటితోనే దేవునికి సమర్పించే పూలు, ఆకులు, పండ్లు, టెంకాయలు, నైవేద్యానికి ఉపయోగించే వస్తువులు, హోమంలో వాడే వస్తువులు వేటినయినా మంత్రాలతో సంప్రోక్షించి శుభ్రంచేయవచ్చు. దేవుడి పూజకు వాడే పూలు తోటనుండి తెంపేటప్పుడు స్ర్తిలు తెంపుతారు (బహిష్ఠు సమయం కూడా కావొచ్చు), మగవారు తెంపుతారు (మైల ఉండొచ్చు, స్నానం చేయకుండా తెంపవచ్చు), ఆ పూలను రవాణా చేసేటప్పుడు, మాలలు అల్లేటప్పుడు.. ఇవన్నీ చేసేవారు మడికట్టుకొని చేయరు కదా. ఎందుకంటే పూలు అమ్ముకునేవారంతా మధ్యతరగతివారు కష్టపడి పనిచేసుకునేవారు. కాబట్టివారు మడి, తడి అనుకుని కూర్చుంటే బ్రతుకు బండి సాగదు. మరి ఆ పూలు ఎలా శుద్ధిచేయబడతాయి?
పవిత్రతను పొందుతాయి? దీనికి సమాధానం ఎవరు తెంపినా, ఎవరు మాలలు కట్టినా, క్రిందపడి కాళ్ళక్రింద నల్గిపోయినప్పటికీ పూజా సమయంలో కాసిన్ని నీటితో అర్చకులు సంప్రోక్షణ చేయడంవల్ల వాటికి శుద్ధి జరుగుతుంది. అలాగే కొబ్బరికాయలు తోటలో తెంపేటప్పుడు నడుస్తున్న అడుగుల్లో పడతాయి. కానీ సంప్రోక్షణ చేసినంతనే వాటికి పవిత్రత చేకూరుతుంది.
అదే విధంగా నైవేద్యంలో ఉపయోగించే ప్రతీ వస్తువుకూడా అలా సంప్రోక్షణ జరిగేదే. హోమాల్లో వాడేటటువంటి దర్బలు వగైరా అడవుల్లోనుంచి సేకరించినవే. అవి తీసుకురావటానికి అవి తెచ్చేవారు ఏమయినా మడి కట్టుకుని వెళ్ళరు కదా! ఇలా దేవుడికి చేసే పూజల్లో ఉపయోగించే వస్తువులను, పదార్థాలను సంప్రోక్షణ చేస్తాము. మరి మనిషి మనసును ఆలోచనలను ఎలా సంప్రోక్షణ చేయగల్గుతాము.
మనుషుల మనసును మార్చటానికి, ఇతరులపై దయ, జాలి, ప్రేమ, కరుణ కలుగజేయటానికి ఎలాంటి మంత్రాలు, సంప్రోక్షణలు ఉండవు. అవి కేవలం ఎదుటివారిపై ప్రేమ, కరుణ, వారికి సాయంచేయాలనే గుణంతోనే సాధ్యమవుతాయి. దేవుడికి ఎన్ని రకాల పూలు, పండ్లతో పూజలు చేస్తామో, హోమాలు చేస్తామో సహాయం కోరి వచ్చినవారికి చేతనయిన సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అన్నార్తులకు ఆశ్రయమివ్వడం ఇవన్నీకూడా అంతకన్నా ఎక్కువ ఫలితాలనిస్తాయి. కాబట్టి మనసును మంచి ఆలోచనలతోనే, దానగుణంతోనే సంప్రోక్షణ చెయ్యాలి, దైవిక వస్తువులకు మంత్ర జలంతో సంప్రోక్షణ చేస్తే, మనిషి ఆలోచనలను దయార్ద గుణంతో సంప్రోక్షణ చెయ్యవచ్చు. దయాగుణంతో మనసులోని చెడు ఆలోచనలు అనే మలినాన్ని తీసివేయాలి.
మనిషికి మానవత్వం ఉంటే ఆ మానవత్వంతో తోటి మనిషికి సాయం చేస్తే మాధవునికి సేవ చేసినట్టే అవుతుంది. పరుల్లో పరమాత్మను చూడమన్నా, మానవ సేవనే మాధవ సేవ అన్నా అందులోని పరమార్థం మాత్రం ఒకటే. దేవుడికి రూపంలేదు. రూపం ఉన్న ప్రాణికి చేసే సాయమే పరమాత్మునికి చేసినట్టు అవుతుంది. అందుకే మనుషులందరూ మానవత్వంతో మెలగాలి. మనుషులుగా మసలాలి. అపుడే ఇలనే స్వర్గం అవుతంది. నరులే నారాయణులు అవుతారు.

- శ్రీనివాస్ పర్వతాల