సబ్ ఫీచర్

సత్యం శివం సుందరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచన, మాట, చేత ఈ మూడింటి సమాహారమే త్రికరణాలు ఈ మూడింటిని భగవంతుడు మనిషికి అద్భుత వరాలుగా ఇచ్చాడు. త్రికరణాల్లో స్పష్టత, సత్యసంధత, శుద్ధత ఉన్నట్టయతే ఆ పనులేవైనా ‘త్రికరణ శుద్ధి’ తో చేసినట్టు అవుతుంది.
మనిషి మనసును ఆలోచనను పట్టించుకోకుండా నేను, నా మాట జరగాలనే వితండ భావనతో నేడు నడవడం జరుగుతోంది. ఎవరికి వారే సర్వస్వతంత్రులుగా అనుకోవడం. తన భావాలే సరియైనట్టుగా ఎదుటి వారికేమీ విలువ ఇవ్వకుండా మాట్లాడడం అనేది ఎంత వరకు సబబు?
ప్రతిమనిషి ఇదేవిధంగా ఆలోచిస్తూ ప్రవర్తిస్తూ పోతే మనుష్యులు ప్రవర్తించే తీరు తెన్నులు, నిర్వర్తించే కర్తవ్యాలు, ధరించే ధర్మాలు ఇవన్నీ ఏమై పోతాయి?
మనిషి ఎలా జీవించాలి. ఎలా నడుచుకోవాలి అనేది వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో ఋషులు వివరించే ఉన్నారు. భగవంతుడు విభవ రూపంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మసంరక్షణ భారం బాధ్యత అంశాలన్నీ ఎంతో చక్కగా నిర్వర్తించి తెలియచేశారు.
అన్నదమ్ముల మధ్య అసూయాద్వేషాలు ఎక్కడికి దారి తీస్తాయో పాండవులు కౌరవుల మధ్య కథను సాగిస్తూ మహాభారతం చెబుతుంది.
ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరేమి ఇడుములు, ఇక్కట్లు తెచ్చినా భగవంతుని నమ్ముకుని జీవిస్తే,. సత్యాన్ని ధరిస్తే ధర్మాన్ని సదా ఆచరిస్తే పాండవులకు కృష్ణుడు కూడా ఉన్నట్టే మనుష్యులకు కూడా భగవంతుడు ఎపుడూ తోడు నీడగా ఉంటాడు. మనిషి ఏవిధంగా బతకాలో కూడా దేవుడే దిగి వచ్చి మరీ చూపించాడు. అదే శ్రీరామావతారం. త్రేతాయుగంలో మహావిష్ణువు రామునిగా అవతరించి మనిషి బాధ్యతలు, ధర్మాలు ఎటువంటివో మనిషి మానవత్వంతో ఎలాప్రవర్తించాలో చేసి చూపించారు. రాముడు రాజై ఉండి కూడా వనాలల్లో నివసించాడు. తానే అందరినీ దండించే అధికారం కలిగి ఉండి కూడా చాకలి వాని మాటలకు విలువ ఇచ్చి తన్ను తాను శిక్షించుకున్నాడు.
అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉండాలో నేర్పించాడు. లక్ష్మణుడు రావణుని ఆయుధంతో గాయపడితే పెద్దపెట్టున రోధించాడు. ఏ భగవంతుడైనా నా తమ్ముడిని కాపాడండి అని వేడుకున్నాడు.
భరతుడు వచ్చి తనకు రాజ్యం అక్కర్లేదని తన తల్లి తెలియక కోరింది తిరిగి నీ రాజ్యాన్ని నీవు తీసుకో అని చెప్పినా తండ్రి మాట ఇచ్చాడు కనుక ఆ తండ్రి మాటను మనిద్దరం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నీవు రాజ్యంలో నీ బాధ్యతను నిర్వర్తించు. నేను వనవాస దీక్షను బూనుతాను అని గట్టిగా చెప్పి చెప్పిన దానినే ఆచరించాడు.
నేడు కలియుగం.
ఈ కలియుగంలో రాజ్యాలు, రాజరికాలు అంతరించి ప్రజా ప్రభుత్వాలు వచ్చాయి. కానీ మనిషిలోని రజోగుణాన్ని మాత్రం వదలలేకపోతున్నాడు. నేను నాది నావారు అన్న భ్రమలో జీవిస్తున్నాడు. ఉదయం నిద్ర లేచింది మొదలుకొని మనిషి ఒక కుటుంబాన్ని పోషిస్తూ కొన్ని పనులు, సమాజంలో ఉంటున్నందుకు మరికొన్ని పనులు దేశాభివృద్ధి కోసం తనవంతు సాయం ఇలా ఎన్నో పనులు నిర్వర్తిస్తుంటాడు.
కాని మనిషి ఎంత నిజాయితీగా వ్యవహరిస్తున్నాడన్న ఆలోచన మాత్రం చేయలేకపోతున్నాడు. నీతి నిజాయితీలు లేకుండా ఏ పని చేసినా అది అధర్మం వైపునే ఉంటుంది. అందుకే మనిషి ఎప్పుడూ మొట్ట మొదట ధర్మానికి పెద్ద పీట వేయాలి. ధర్మయుతంగా ఏ పని చేసినా అది కుటుంబ రక్షణే కాదు దేశ రక్షణకు కూడా ఉపయోగపడుతుంది.
మనిషి తాను ఎదుగుతున్నప్పుడు అంతా తన కృషి వలనే జరుగుతోందని, అంతా తన ప్రతాపమేనని అనుకొని ముందుకు వెళ్లుతుంటాడు. అదే మనిషి చేసిన పని ఫలితం వ్యతిరేకం అయితే వెంటనే భగవంతుడు దీనికి కారణం నేను కాదు అనేస్తాడు. నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. అంతా విధి విచిత్ర లీల అంటాడు.
అట్లాకాక తాను చేసే ఏ పనియైనా సరే అది భగవంతుడే తన చేత చేయిస్తున్నాడనుకొంటే మంచి ఫలితాలే వస్తాయి. మనిషి ఎప్పుడూ కర్మఫలితాలనే అనుభవిస్తాడని కొందరు అంటారు. ఎందుకిలా కర్మఫలం అనుభవించాల్సి వచ్చిందంటే ఆ కర్మ నేనే చేస్తున్నానన్న భావన తో చేస్తాడు కనుక కర్మఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది.
మనిషి నిద్ర లేచింది మొదలుకుని పడుకునేదాకా ఎన్ని పనులు చేసినా అవి అన్నీ నిమిత్తమాత్రంగా చేస్తున్నాను. దీనికంతా భగవంతుడే మూలకారణం అనుకున్నట్లయితే కర్మఫలాన్ని అనుభవించాల్సిన అవసరం రాదు.
భగవంతుడిచ్చిన వరం ఈ మానవ జన్మ అనుకొని ధర్మపరిపాలన చేస్తూ పుణ్యకర్మలు చేస్తూ ఉంటే జనన మరణం చక్రం లో ఇరుక్కోవవలసిన అవసరం రాదు.

- గంటి కృష్ణకుమారి