సబ్ ఫీచర్

కలౌస్మరణాన్ముక్తిః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్య జీవితంలో మనిషి ఎన్నో వస్తువులను వినియోగించుకుంటున్నాడు. వంటకు ఉపయోగించే పాత్రలతో సహా వాటినన్నింటిని ‘్భండ శుద్ధిలేని పాకమేల’నంటూ ఏరోజుకారోజు బాగుగా శుభ్రపరచుకుని రేపటికోసం వాటిని సిద్ధపరుస్తున్నాడు. మరి నిత్యం వాడుకలో వున్న దేహం సంగతేంటి? దేహమనే ఈ పాత్రను కూడా శౌచ స్నానాదులతో దుమ్ము, ధూళి, ఇతరత్రా మలినాలను తొలగించి శుభ్రపరచడం నిత్యకృత్యంగా ఎంచుకున్నాడు. అది మాత్రమే కాదు వేళకు సరిగా పరిశుభ్రమైన అన్నపానాదులను, నిద్రను, వస్త్రాలను అందించటం లాంటి ఎన్నో జాగ్రత్తలతో దేహ సేవ నిర్వహిస్తున్నాడు కూడా. అయినప్పటికీ ఏదో అలజడి, అశాంతి, వెలితి, వేదన, అనారోగ్యమనే శారీరక, మానసిక రుగ్మతలు మనిషిని పట్టి పీడిస్తూ ఉండటం మనం చూస్తున్నాం. చూడటమే కాదు ఎందరికో అనుభవైకవేద్యం కూడా. మనిషి దేహం పట్ల ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎందుకిలా జరుగుతోంది? అంటే అందుకు కారణం లేకపోలేదు- దేహం విషయంలో మనిషి ఎంతసేపూ కేవలం బాహ్య శౌచానికి పరిమితం కావడం, అంతఃశౌచాన్ని విస్మరించడమే అసలు సంగతి. అంటే దేహమనే ఈ పాత్రను బయటా, లోపలా ఇరువైపులా శుభ్రం చేయాలి. వెలుపల దుమ్ము, ధూళి లాంటి మలినాలున్నట్లే దేహంలోపల మనసు కేంద్రంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులనే మలినాలున్నాయి. ఈ ‘మలమే’ నేను - నాదనే భయంకర క్రిమి పుట్టుకకు కారణమవుతోంది. అది స్వార్థమనే హానికరమైన రోగాన్ని మనిషికి అంటగడుతోంది. ఈర్ష్యా, ద్వేషం, పగ, ప్రతీకారాలనే వికారాలతో సర్వపాప కర్మాచరణములకు ఇది ప్రేరకమవుతోంది. దీంతో తన స్థితినుండి మనిషి పతనవౌతున్నాడు. కట్టెలో పుట్టి ఆఖరికి దానే్న కాల్చుకుతినే నిప్పులాంటిదది. కనుకనే కామ, క్రోధ, లోభాలను గూర్చి ‘త్రివిధం నరకసేద్యం ద్వారం’- అంటే నరకద్వారములు అంటారు గీతలో పరమాత్మ. మానవ సమాజానికిది ఎంతమాత్రం క్షేమకరం కాదు. ఈ విధమైన ‘మలాన్ని’ మనిషి తగిలించుకుని తంటాలు పడటం కంటే వదిలించుకుని ఒడ్డుకు చేరడం ఎంతో మంచిది. ఇలాంటి పరిస్థితిలో దేహానికి బాహ్య శౌచమనేది కేవలం మోతాదదు చాలని మందుబిళ్లే అవుతుంది. కనుక మనిషి తనలోని ‘మలాన్ని’ శుభ్రం చేసుకోవడానికి అంతఃశౌచమనే పక్రియను చేపట్టితీరాలి. వెలుపలైతే నీటితో శుభ్రం చేయగలం, దేహం లోపల శుద్ధి చేయడమెలా?
‘‘దేహశుద్ధి కరాయచ, జనార్ధనా నమోస్తుతే’- కనుక కేవలం భక్తి అనే దివ్యౌషధం మాత్రమే ఈ పనిని పూర్తిచేయగలదు. ఇందుకు యజ్ఞ యాగాది క్రతువులు, ధ్యానాదులు, ఏళ్ళకు ఏళ్ళు తపస్సులు నిర్వహించవలసిన అవసరం లేదిప్పుడు. కలియుగంలో కేవలం భగవన్నామాన్ని స్మరించడం, కీర్తించడం, జపించడం లాంటివి నిత్య జీవితంలో మనిషి శ్రద్ధాసక్తులతో చేపడితే చాలని ఒకానొక సందర్భంలో భగవత్ స్వరూపులు వ్యాసులవారే సెలవిచ్చారు. స్మరించగానే స్పందించే స్మర్తగామి భగవంతుడు. ‘మరా’ అనే పదస్మరణ లోంచి ఏకంగా ఓ మహర్షే పుట్టుకొచ్చాడు. అద్గదీ నామస్మరణంటే! ఇలా భగవత్సింతనతో మానస స్నానం చేయాలి. దీనితో కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాదులనే అరిషడ్వర్గ మలం మనసనే జాగానుండి నెమ్మదిగా ఖాళీ చేస్తుంది. అలా ఏర్పడ్డ ఖాళీస్థలాన్ని ప్రేమ, దయ, జాలి, కరుణలు ఆక్రమిస్తూ వెళతాయి. తోటి ప్రాణులపట్ల దయగల్గి ఉండటమే ధర్మమంటే. మనిషి అప్పుడే ‘కలవాడు’ అవుతాడు. కలవాడంటే మానవీయ విలువల్ని నింపుకున్న మనసు కలవాడవుతాడు. భౌతికంగా కులం, మతం, భాష, ప్రాంతం, రాష్ట్రం ఇలా ఎన్నో గుర్తింపులున్నా ‘మనసున్న మనిషినే’గుర్తింపునకివేవీ సాటిరావు. కనుక మనసు ఖజానాలో మనిషి దాచుకోదగ్గ అసలు సంపద ప్రేమ, దయ, జాలి, కరుణలే. పరిచర్యల కంటే ముందు భగవంతున్ని ప్రసన్నం చేసేవి ఇవే. ఈ దైవీ సంపత్తి ద్వారా మనిషి ప్రవహించడం చూస్తాం. అంటే మనిషి మానవీయ ప్రవాహమవుతాడు. మనసు మంచి ఆలోచనలకు స్థావరమవుతుంది. ఆ మంచి ఆలోచనే మాటవుతుంది. అదే మనసా వాచా కర్మణా మనిషి చేసే పనవుతుంది. సాటిమనిషికి సేవలందిస్తూ వారి కళ్లలో ఒలికే ఆనందంతో మనిషి సంతృప్తి వెల్లువై సాగుతాడు. ఇలా ఆత్మచింతన ద్వారా ఆత్మోన్నతి చేసుకోవాలి. అప్పుడే ‘శుచిర్థక్షః ..యో మద్భక్త స్స మే ప్రియః’ - శరీరేంద్రియ మనస్సులందు శుచికలవాడై మనిషి భగవంతుడికి ప్రియమవుతాడు. అలాంటి భక్తుడిలో భగవానుడు ‘మనశ్చాస్మి’ (మనసే నేను) అయి సర్వ దుఃఖాలు హరిస్తాడు.
సర్వ దుఃఖ హరాయ నారాయణా నమోస్తుతే!

-పి.వెంకట శివారెడ్డి