సబ్ ఫీచర్

స్వేచ్ఛకు మూడు పార్శ్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వేచ్ఛకు మూడు పార్శ్వాలున్నాయి.
మొదటిది భౌతిక పార్శ్వము. ఈ పార్శ్వంలో మిమ్మల్ని భౌతికపరమైన బానిసగా మార్చవచ్చు. నిజానికి, అనేక వేల సంవత్సరాలుగా మనిషిని కూడా అన్ని వస్తువుల మాదిరిగా బజారులో ఒక వస్తువుగా అమ్ముతూనే ఉన్నారు. మానవ హక్కులు ఏ మాత్రం లేని, కనీసం మనుషులుగానైనా పరిగణించబడని, అతి నీచ మానవులుగా భావించబడే బానిసలు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ఉన్నారు. అదే పరిస్థితి నేటికీ ఇంకా కొనసాగుతూనే వుంది.
భారతదేశంలో శూద్రులను నేటికీ అంటరానిగావారుగానే చూస్తున్నారు. అయిదువేల సంవత్సరాల నాటి సంప్రదాయమైన అంటరానితనం నేటికీ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కొనసాగుతున్న కారణంగా ప్రజలు చదువులేనివారై ఇతర వృత్తులు చేపట్టలేక ఇంకా బానిసత్వంలో మగ్గుతూనే ఉన్నారు. అంటరానివారిని తాకినా, చివరికి వారి నీడ సోకినా మీరు మైలపడినట్లే. వెంటనే మీరు స్నానం చెయ్యక తప్పదు.
ప్రపంచవ్యాప్తంగా స్ర్తి శరీరం పురుషుని శరీరంతో సమానంగా ఎక్కడా పరిగణించబడట్లేదు. అందుకే ఈ ప్రపంచంలో పురుషునికి ఉన్నంత స్వేచ్ఛ స్ర్తికి ఎక్కడా లేదు. ముఖ్యంగా చైనాలో భార్యపై భర్త ఆధిపత్య ధోరణి అనేక శతాబ్దాలుగా కొనసాగుతోంది. చివరికి భర్త తన భార్యను చంపినా అక్కడి చట్టాలు అతనిని శిక్షించవు. ఎందుకంటే, అక్కడి చట్టాల దృష్టిలో భార్య కేవలం ఒక కుర్చీలా, ఒక మంచంలా, కర్మాగారంలోని ఒక యంత్రంలా పిల్లలను ఉత్పత్తి చేసే ఆత్మ లేని ఒక వస్తువులాంటిది మాత్రమే. అందుకే ఆమెను చంపినా అక్కడి చట్టాల దృష్టిలో అది తప్పుకాదు. ఎందుకంటే, భర్త అధీనంలో కేవలం ఒక బానిసలా బతికే అతని భార్య అక్కడ కేవలం ఒక వస్తువులాంటిది మాత్రమే. అందుకే అతను ఆమెను ఏమైనా చెయ్యొచ్చు.
నిజానికి, ఎలాంటి సంకెళ్ళు లేని శరీరంతోనే అందరూ జన్మించారు. అందుకే శరీరానికి సంబంధించినంతవరకు అందరూ సమానమే. ఎవరూ ఎవరికంటే తక్కువ కాదు. అసలు అలాంటి వర్గీకరణలే లేవు. కానీ ఈనాటికీ అలాంటి సమానత్వంతో కూడిన స్వేచ్ఛ అన్నిచోట్లా లేదు. బానిసత్వం కొద్దికొద్దిగా తగ్గుతున్నప్పటికీ అది పూర్తిగా అంతరించలేదు. అందుకే భౌతికపరమైన స్వేచ్ఛ, బానిసత్వాలు నేటికీ మనుగడ సాగిస్తున్నాయి. శారీరక పరమైన స్వేచ్ఛ అంటే స్ర్తి పురుషుల మధ్య తేడాలు కానీ వారి శారీరక రంగుల మధ్య వ్యత్యాసాలు కానీ లేకపోవడమే. నిజానికి, శరీరాలన్నీ ఒకే రకమైనవి. అందుకే శరీరానికి సంబంధించినంతవరకు పవిత్రులు, అపవిత్రులు అనేవారు ఎవరూ లేరు. ఇదే అసలైన స్వేచ్ఛకు మూలం.
ఇక స్వేచ్ఛ యొక్క రెండవ పార్శ్వం మానసికపరమైనది. అదే ‘మానసిక స్వేచ్ఛ’. ఈ ప్రపంచంలో ‘మానసిక స్వేచ్ఛ’ కలిగిన వ్యక్తులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. నిజానికి, మీరు ఒక హిందువైనా, క్రైస్తవుడైనా, మహమ్మదీయుడైనా మీకు ‘మానసిక స్వేచ్ఛ’ లేనట్లే. ఎందుకంటే, మనం మన పిల్లలను పెంచేందుకు అనుసరిస్తున్న విధానమంతా వారిని రాజకీయ, సామాజిక, మత పరమైన సిద్ధాంతాలకు కట్టుబానిసలుగా తీర్చిదిద్దే తీరులో ఉంది. సొంతంగా ఆలోచించేందుకు, అనే్వషించేందుకు కనీసం ఒక్క అవకాశాన్ని కూడా మనం మన పిల్లలకివ్వం. అంతేకాదు, ఏ మాత్రం అనుభవంలేని మనం వారి మనసులను బలవంతంగా ఒక మూసలోకి నెట్టేసి మనకే తెలియని, ఎందుకూ పనికిరాని బూజు భావాలతో వారి మనసులను నింపేస్తాం. దేవుడున్నాడని, స్వర్గం, నరకం ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధిస్తారు. కానీ, వాటి గురించి వారికి ఏమీ తెలియదు. మీ గురించి ఏ మాత్రం తెలియని మీరు మీ పిల్లలకు అనేక విషయాలు బోధిస్తూ వారి మనసులను నిబద్ధీకరిస్తున్నారు. ఎందుకంటే, మీ మనసులు మీ తల్లిదండ్రుల నిబద్ధీకరణకు గురయ్యాయి. ఆ రకంగా మీకున్న ఆ రోగాన్ని మీరు మీ ముందు తరాలకు అంటిస్తున్నారు. తరతరాలుగా ఇదే కొనసాగుతోంది.
అధిక చైతన్యంతో ఎక్కువ తెలివితేటలు సంతరించుకుంటూ చాలా అప్రమత్తంగా ఎదిగేందుకు మనం మన పిల్లలకు అవకాశమిచ్చి సహకరించినప్పుడే వారికి ‘మానసిక స్వేచ్ఛ’ లభిస్తుంది. ఎలాంటి నమ్మకాలు, విశ్వాసాలు వారికి బోధించకుండా సత్యాన్ని తెలుసుకునేందుకు వారికి మన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తూ ‘‘మీ సత్యాన్ని మీరే అనే్వషించి తెలుసుకోవాలి తప్ప వేరే దారి లేదు. అపుడే మీకు పూర్తిస్వేచ్ఛ లభిస్తుంది’’ అని పిల్లలకు చిన్నప్పటినుంచి ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉండాలి.
సత్యాన్ని ఎరువు తెచ్చుకోలేము. పుస్తకాలు చదివి దానిని తెలుసుకోలేము. దాని గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు. మీ తెలివితేటలకు మీరే పదునుపెట్టుకోవాలి. అపుడే మీరు అస్తిత్వంలోకి దృష్టి సారించి సత్యాన్ని దర్శించగలరు.
ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి స్వేచ్ఛతో తనకు తాను చాలా అప్రమత్తంగా అనే్వషిస్తూ సత్యాన్ని తెలుసుకునేందుకు పసివాడికి మీరు ప్రోత్సాహమిచ్చినపుడే వాడికి మానసిక స్వేచ్ఛతోపాటు దాని నీడలా వెంటాడే బాధ్యత మరింత పెరుగుతుంది. కాబట్టి, మీరు ప్రత్యేకంగా బాధ్యత గురించి వాడికి బోధించవలసిన పనిలేదు. (ఇంకావుంది)

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.
. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.

పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,

నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్