సబ్ ఫీచర్

కర్తవ్యనిర్వహణ బాధ్యతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజానికి, దేవుడి విషయంలో ‘నీషే’సగమే చెప్పాడు. అయినా అది పూర్తిగా చెప్పినట్లే కనిపిస్తుంది. కానీ, పైకి కనిపించేవన్నీ అన్ని సందర్భాలలో నిజాలు కావు. అందుకే మిగిలిన సగాన్ని పూర్తిచేసేందుకు ఎవరూ ప్రయత్నించలేదు.
ఈ ప్రపంచంలో దేవుడు లేని మతాలున్నాయన్న సంగతి నీషేకు తెలియదు. అలాగే మతాలన్నింటిలోకి గొప్ప మతాలైన బౌద్ధం, జైనం, తావో మతాలున్నట్లు కూడా నీషేకు తెలియదు. పైగా, అవన్నీ దేవుడు లేని మతాలే. తమాషా ఏమిటంటే, ఆ దేవుడు లేని మతాలలో కూడా మనిషికి స్వేచ్ఛలేదు. అందుకే లావోట్జూ, మహావీరుడు, బుద్ధుడు దేవుడు లేడన్నారు. ఎందుకంటే, దేవుడు ఉన్నంతవరకు మనిషి ఆయన చేతిలో కీలుబొమ్మే అని వారు గ్రహించారు.
అప్పుడు జ్ఞానోదయంకోసం చేసే ప్రయత్నాలన్నీ అర్థంలేనివే అవుతాయి. ఎందుకంటే, మీకు స్వేచ్ఛ లేదు. అప్పుడు మీకు జ్ఞానోదయం ఎలా కలుగుతుంది? దేన్నైనా నాశనం చెయ్యగల సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు జ్ఞానం లేకుండా చెయ్యగలడు కదా!
మనిషి స్వేచ్ఛకు దేవుడు పెద్ద అడ్డంకి అని తెలుసుకున్నవారు వేల సంవత్సరాల క్రితమే ఉన్నారు. అందుకే వారు దేవుణ్ణి తొలగించారు. అయినా ఇంతవరకు మనిషికి పూర్తిస్వేచ్ఛ దక్కలేదు.
కాబట్టి, మనిషికి పూర్తి స్వేచ్ఛ దక్కాలంటే కేవలం దేవుడు మరణించేలా చేసినంత మాత్రాన సరిపోదు. దేవుడితోపాటు మతాలు కూడా మరణించేలా చెయ్యాలని నేనంటాను. అంతేకాదు, దేవుడు లేని, మతం లేని, మనకంటే సర్వశక్తిమంతుడైనవాడు ‘‘పైన’’ ఎవడూ లేని నూతన ధార్మికతను కూడా మనమే సృష్టించాలి. నా ప్రయత్నమంతా ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలనే.
అలా దేవుడితోపాటు, దేవుడు లేని మతాలతోపాటు, అందమైన పంజరాలను సృష్టించే క్రైస్తవం, బౌద్ధం, హైందవం, మహమ్మదీయం లాంటి వ్యవస్థీకృత మతాలన్నీ మరణిస్తే పౌరోహిత్యం దానంతటదే అంతరిస్తుంది. ఆయన ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వ్యవస్థీకృత మతాలలోని పోపులు, అయతుల్లాలు, శంకరాచార్యులు వంటి మతాచార్యులు, ధార్మిక నాయకుల అవసరం ఎవరికీ ఉండదు. అందువల్ల అలాంటి వారందరూ అదృశ్యమవుతారు. బుద్ధుడు, మహావీరుడు, లావోట్జూలు కూడా దేవుణ్ణి త్యజించినవారే. నీషే లాగే వారికి కూడా దేవుడు లేని మతాలు ఉన్నాయని, మతాచార్యుడే మనిషిని బానిసగాచేసి ఎలాగోలా వాటిని నిర్వహిస్తాడని తెలియదు. అలా మతాచార్యుడే మనిషిని బానిసత్వంలో ముంచేశాడు.
నీషే పరిజ్ఞానం దేవుణ్ణి పూర్తిగా చంపలేకపోయింది. కాబట్టి, దేవుడు పూర్తిగా మరణించాలంటే మతాలన్నీ పూర్తిగా మరణించాలి. అయినా, దేవుడే లేనప్పుడు వ్యవస్థీకృత మతాలు ఎందుకున్నట్లు. ఎవరికోసమున్నట్లు? చర్చిలు, దేవాలయాలు, మసీదులు, సినగాగులు పూర్తిగా అంతరించిపోవాలి. అప్పుడు రబ్బీలు, బిషప్పులు, మతాచార్యులు వంటి ఎందుకూ పనికిరాని ధార్మిక నాయకుల అవసరం ఎవరికీ ఉండదు. అలాంటి విప్లవం వస్తుంది. అప్పుడే మనిషికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది.
అలాంటి స్వేచ్ఛ గురించి నేను వివరించే ముందు ‘‘ఒకవేళ నీషే పరిజ్ఞానం దేవుణ్ణి పూర్తిగా చంపగలిగితే అప్పుడు మానవాళికి ఎలాంటి స్వేచ్ఛ లభించేది? అలాంటి స్వేచ్ఛ దేనికోసం? అది కేవలం జంతువులకున్న స్వేచ్ఛ లాంటిదా?’’అనే విషయాలను మీరు స్పష్టంగా తెలుసుకోవాలి.
జంతువుల్లా విచ్చలవిడిగా జీవించడం ‘‘స్వేచ్ఛ’’కాదు. ఎందుకంటే, అలాంటి స్వేచ్ఛకు బాధ్యతాయుతమైన చైతన్యముండదు. మనిషి బానిసత్వం నుంచి స్వయంగా బయటపడి అంతకంటే ఉన్నతంగా ఎదిగేందుకు అలాంటి స్వేచ్ఛ ఏమాత్రం సహాయపడదు. కాబట్టి, అలాంటి స్వేచ్ఛ అర్థరహితం. పైగా, అలాంటి స్వేచ్ఛవల్ల మీరు బానిసత్వంకన్నా మరింత పతనమవుతారు. ఎందుకంటే, బానిసత్వానికి కూడా ఒక రకమైన నీతి, క్రమశిక్షణ, సిద్ధాంతాలున్నాయి. మిమ్మల్ని బాధ్యతగా చూసుకునేందుకు, ‘‘స్వర్గ సుఖాలు’’ వివరిస్తూ మిమ్మల్ని వలలో వేసుకునేందుకు, ‘‘నరక బాధలు’’ వివరిస్తూ మిమ్మల్ని అదుపులో పెట్టేందుకు బానిసత్వానికి కూడా ఒక రకమైన ‘‘వ్యవస్థీకృత మతం’’ ఉంది. ఒకవేళ ఎవడైనా స్వేచ్ఛగా ఉన్నప్పటికీ, వాడు అడవి జంతువుకన్నా కాస్త మెరుగ్గా ఉంటాడే కానీ, మీరు మెచ్చుకునేటంత ఉన్నతంగా ఉండదు.
కేవలం దేవుడి మరణంతో లభించే స్వేచ్ఛ ఇచ్చినంత మాత్రాన సరిపోదని, అది మనిషిని జంతువులా మార్చేటంత ప్రమాదకరమని, అలాంటి స్వేచ్ఛవల్ల మనిషి ఉన్నతంగా ఎదగడని నీషేకు తెలియదు. అందుకే నీషే చెప్పినట్లు దేవుడి మరణంతోపాటు, మతాలన్నీ నశించాలని నేనంటాను. అప్పుడే మనిషికి అసలైన పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. దానితో తొలిసారిగా ఎలాంటి అడ్డంకులు లేకుండా తన అంతర్గత ఉనికిలోకి దూకి దాని లోతులను అనే్వషించడంతోపాటు, ఉన్నతంగా ఎదిగి తన చైతన్యపు ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించాలో తెలుసుకునే స్వేచ్ఛ మనిషికి లభిస్తుంది. కేవలం దేవుడు, వాడి పేరుతో వెలిసిన మతాలు, వాటి పేరుచెప్పి దేవుడి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ పౌరోహిత్యం చేసుకునే ధార్మిక నాయకులందరూ నశించడంద్వారా మాత్రమే అలాంటి స్వేచ్ఛను పొందడం సాధ్యమవుతుంది.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.