సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐనను కఠిన పరీక్షలకు దాళనిదే శిష్యులనాతడు స్వీకరించు వాడు కాడు. తన శిష్యులు లోకాదర్శపురుషులై వెలయుటమే శ్రీరామకృష్ణుని ప్రధానాశయము. శిష్యుల శారీర లక్షణములను ప్రవర్తనమును బరీక్షించుటలో నాతడఖండ నిపుణుడు. అజాగరూకులైయున్న తఱి వారల జీవిత చర్యలను అతిజాగరూకతతో బరిశీలించును; ప్రశ్నలు వైచి వారిమనోభావములను గమనించును; తన బోధలచే, వర్తనముచే, ఆదర్శములచే, వారియందు గలుగు మార్పులెట్టివో గుర్తించును.
మఱియు నావశ్యక మైనపుడెల్ల దనయోగశక్తియగు దివ్యతేజమును వారల హృదయాంతరాళమున బఱపి యథార్థవిషయములను గ్రహించును. ఒక్కొక్కప్పుడొక విధమైన సమాధి స్థితిని గలిగించి వారిచే తమ హృదయాంతర్గత రహస్యములను బ్రకాశింపజేయును. శ్రీరామకృష్ణ భాస్కరునకు శిష్యహృదయములు కమలములై యొప్పెను!
ఆకసముకంటె నున్నతమును సముద్రముకంటె నగాధము నగు తన యనంత ప్రేమచే శిష్యులనాతడు స్వవశముగావించుకొనెను. తన యఖండ ప్రేమచే తన్నాతడు దాసునిగా నొనర్చి వైచెనని శ్రీ వివేకానందస్వామియే పలికియున్నాడు.
తమ తల్లిదండ్రులైనను ఆతనివలె తమ్ము ప్రేమించి యెఱుగరని యితర శిష్యులు వక్కాణించి యున్నారు.
తన బోధలను శిష్యులాచరించు విషయమున నాతడఖండశ్రద్ధ వహించువాడు. అతని బోధన విధాన మత్యద్భుతము. శిష్యులతో నాతడెన్నడును తర్కించువాడు కాడు. ఒక్క మాటచే, స్పర్శచే, కటాక్షముచే, నాతకు బోధించును. ‘‘ఆత్మసాక్షాత్కారమే మానవుని పరమావధి. ఆత్మానంద ప్రపూర్ణమగు హృదయమున వాదోపవాదములకు తావులేదు.
జ్ఞానోదయమైనంతనే సంశయాంధకారము పటాపంచలగును’’- ఇదియే యాతని బోధన. ఆటలతో పాటలతో, వింతలతో, వినోదములతో నాతడు మహోన్నతాధ్యాత్మిక తత్త్వములను శిష్యులకు బోధించెను.
దైనందిన జీవిత చర్యలను బరిశీలించి క్రమవిరహితమగు నెట్టిస్వల్పవిషయమును గూర్చియైనను నుదపదేశములొనర్చెను. వర్తకులు నాణెములను బరీక్షించు చందమున తన మాటలను చేతలను పరిపూర్ణముగా బరీక్షించిననే కాని నమ్మనక్కఱలేదనెను. అట్టి సద్గురు చరణ సాన్నిధ్యము లభించిన యాశిష్యు లెంతటి ధన్యులోకదా!
ఆతని ప్రతిభాతిశయ మపూర్వము. ఆత్మవికాసమున ఏ దశలోనున్న వారినైనను అవలీలగా నాతడాకర్షింపగలుగువాడు- సాధకుల యధికారాంతరము ననుసరించి బోధించుచు తన బోధనలను వారికి విస్పష్ట మొనర్చువాడు. శశధరతర్క చూడామణి, ఈశ్వర చంద్ర విద్యాసాగరుడు మున్నగు పండిత వరేణ్యులను తన విజ్ఞానముచే నొకవైపున ముగ్ధులను జేయుచు, మఱియొకవైపున తమ సంసార తాపత్రయమును దెలుపుకొని శాంతినొందవచ్చిన పల్లెటూరి స్ర్తిలకు- వెఱ్ళిమొఱ్ఱి సంశయములను దీర్చుకొనవచ్చిన యమాయక వ్యక్తులకు- మనశ్శాంతి గలుగునట్లాతడు సంభాషించువాడు. ఆచార వ్యవహారములలో- మనోభావములలో సనాతనులకెల్ల సనాతనుడయ్యు.
పరమతస్థులయెడ, నవీన సంస్కర్తలయెడ, ప్రకృతిశాస్త్ర పండితుల యెడ- విశేష ప్రేమసానుభూతులను జూపువాడు.
అట్టిచో నరేంద్రనాథుడు, నాగమహాశయుడు, మహేంద్రలాల్ సర్కార్, గిరీశ చంద్రఘోషు- ఇట్టి విలక్షణ స్వభావులగు వ్యక్తులాతని సన్నిధానమున గూడి సోదర ప్రేమతో మెలగుటబ్బురము కానేరదు.
ఇంకా ఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి