సబ్ ఫీచర్

నాదయోగికి స్వర నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు త్యాగరాజస్వామి వర్థంతి సందర్భంగా....

‘‘వీణావాదన తత్త్వజ్ఞో శ్రుతి జాతి విశారదః
తాల జ్ఞశ్చా ప్రయాసేన మోక్షమార్గం నియచ్ఛతి -యాజ్ఞవల్క్య స్మృతి
దైవభక్తి, సత్యము, భూతదయ, సత్ప్రవర్తన, సంపూర్ణ శరణాగతి అద్వైతస్థితి ముఖ్యాంశములుగా, కావ్య పురాణేతిహాసములను మనకు అందించినవారు వాల్మీకి వ్యాస మహర్షులు. భాగవత శిఖామణియై, లోక కల్యాణాన్ని సర్వదా కాంక్షిస్తూ భగవన్నామ సంకీర్తనలతో తరలించవచ్చునని నిరూపించిన పరమ భాగవతోత్తముడు, నారద మహర్షి. సర్వవస్తువుల యందు వాసుదేవ భావనగల్గి త్రికరణశుద్ధిగా దేవుని భజిస్తూ, సర్వులకు దైవభక్తిని బోధిస్తూ తను తరించి ఇతరులను తరింపజేయగల మోక్షసాధనం ‘సంగీతం’ అని చాటి చెప్పిన వాగ్గేయకారులు- వాసుదేవ విఠలుని వాసిగా భజించిన పురందరదాసు, గీత గోవిందాన్నందించిన జయదేవుడు, శ్రీకృష్ణ లీలా తరంగిణిని అందించిన శివనారాయణ తీర్థులు, భక్త్భివాన్ని యోగశాస్త్రాన్వయంతో మనకు దర్శింపజేసిన సదాశివ బ్రహ్మేంద్రులు, ఆర్తితో శరణాగతితో సీతారాములను కీర్తించిన రామదాసు, పద కవితా కమలములతో కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పాద పద్మములను అర్చించిన తాళ్ళపాక అన్నమయ్య, అమ్మమీద కీర్తనలను అనితర సాధ్యముగా ‘శ్యామకృష్ణ సోదరి’ ముద్రతో వెలయించిన కామాక్షీ వరప్రసాది ‘లయబ్రహ్మ’ శ్యామశాస్ర్తీ, భావగంభీరమైన కృతులను ‘గురుగుహ’ ముద్రతో సర్వ దేవదేవతలమీద అందిస్తూ జగన్మాత శ్రీ చక్రార్చనగా నవావరణ కీర్తనలను అనుగ్రహించిన ముత్తుస్వామి దీక్షితులు మున్నగువారు ఈ కోవకు చెందినవారు.
యోగముచేతను, సంగీతముచేతను మోక్షము సాధించుట సులభమని, యోగము కంటె సంగీతావలంబనము చేత తరించుట సులభసాధ్యమని, తన జీవితానే్న మనకు ఆదర్శంగా చూపి, సద్భక్తి సహిత సంగీత వినీలాకాశంలో ధృవతారగా నిల్చిన పరమ భాగవతోత్తముడు- సద్గురు త్యాగరాజ స్వామి.
వాగ్గేయకారులు
‘‘వాచం గేయం చ కురుతే యస్య వాగ్గేయ కారకః’’ అనేది వాగ్గేయకారుని నిర్వచనం. తామే రచించి, గానం చేసేవారిని ‘వాగ్గేయకారులు’ అంటారనేది స్థూలార్థం. సంగీత సాహిత్యాలలో సమాన ప్రజ్ఞ కలవారు ఉత్తమ వాగ్గేయకారులు. అనగా, వారే సాహిత్యాన్ని వ్రాసినారని, వారే సంగీతాన్ని సమకూర్చుకొని, స్వయంగా గానంచేసేవారు వాగ్గేయకారులని వాడుకలో వున్న అర్థం.
సామవేద సారమైన సంగీతానికి, భక్తిరసాన్ని మేళవించి బంగరామునకు తావి అబ్బినదా అన్నట్లుగా, గేయములు, పదములు, తరంగములు, కీర్తనలు, కృతులు అనే సాహితీ సౌరభాలను వెదజల్లిన వాగ్గేయకారులు ఎందరో మహానుభావులు.
రామతారక బ్రహ్మోపాసనముతో నాదోపాసనమును మేళవించి, సప్తస్వర సుందరుల భజించి, ఆరాధించి, ఉపాసించి, సాహిత్యమందు సంగీత సంప్రదాయములను, సంగీత సాహిత్య పొందికను, అర్థవంతముగా మేధాశక్తి సంపన్నముగా, హృద్యంగా ఆర్ద్రతతో ఆర్తిగా రూపొందించి, భావ గాంభీర్యంతో, రామభక్తి నిండారిన అనేక కృతులను వివిధ రాగములలో వెలయించి ‘తెలిసి రామచింతన’ చేసిన బ్రహ్మవిద్యా సార్వభౌముడు, సంగీత సాహిత్య సమగ్ర సమ్యక సమ్మిళిత సమ్రాట్- సద్గురు నాదయోగి శ్రీ త్యాగరాజస్వామి.
కళాస్రష్ట శ్రీత్యాగరాజస్వామి
పరమాత్మ స్వరూపమును మనస్సునందు లయింపజేసి, భక్తి పారవశ్యంతో రాముని దివ్య సౌందర్యమును కన్నులారదర్శించి ఆ మధురానుభవమునకు కీర్తనాకృతినిచ్చి, భగవంతుని భజనానందమే తరుణోపాయమని సిద్ధాంతీకరించి, స్వరరాగలయాదులతో భావ గాంభీర్యాన్ని అనుభవించి, గానం చేసేవారికి దైవ సాక్షాత్కారం సాధ్యమని చెబుతూ దృశ్య రాగ చిత్రాన్ని అందించిన కళాస్రస్ట శ్రీ త్యాగరాజస్వామి.
భారతీయ సంగీతానికి ఆత్మస్వరూపులు- శ్రీ త్యాగరాజస్వామి. నాదోపాసనా సిద్ధితో సాక్షాత్తూ శ్రీరామ సాయుజ్యం పొందిన జీవన్ముక్తుడు శ్రీ త్యాగరాజస్వామి.
మహోన్నతమైన ఆదర్శములతో, గంభీరమైన రాగ భావలయాది చరణ విన్యాసములతో, ముచ్చటగొలిపే తెలుగు నుడికారపు సొంపులతో చక్కని సందేశములతో, శ్రుతి స్మృతి పురాణేతిహాస తాత్పర్యములతో శ్రీరామ మధుర నామమును భజిస్తూ, ఆడుతూ పాడుతూ మనకందించిన త్యాగయ్యగారి కీర్తనలు (కృతులు) అజరామరం.
త్యాగోపనిషత్తులు: త్యాగయ్య కృతులు
ఉపనిషత్తుల సారమే త్యాగయ్యగారి రచనలలో గోచరమవుతుంది. కనుక మహనీయులందరూ వారి కృతులను ‘త్యాగోపనిషత్తు’లని వ్యవహరిస్తూ ఉంటారు. ఉదాహరణకు త్యాగయ్యగారి ఒక కీర్తన తీసుకుందాం.
‘‘పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే హరియట హరుడట సురులట నరులట అఖిలాండకోటులట యందరిలో గగానిలతేజో జల భూమయమగు మృగ ఖగ నగ తరు కోటులలో సగుణములలో విగుణములలో సతతము సాధు త్యాగరాజర్చితుడిలలో వాగధీశ్వరీ రాగం, ఆదితాళ నిబద్ధనలోని అద్భుత కృతి యిది. పరమాత్మ వెలుగు అంతటా నిండి ఉన్నది. ‘‘అంతర్భహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః’’ అన్నది శృతి. పరమాత్మ వెలుగు అంతటా నిండి వున్నది. హరిహరాది దైవ భేదములు, దేవ మానవ భేదములు కన్పట్టినా, ఉన్నా, అన్నింటా పరమాత్మ చైతన్య ప్రకాశ రూపమును సాక్షీమాత్రమై వెలుగుతున్నాడు. పంచభూతములందు మృగ పక్షులలో, చెట్లు లతాదృయందు సైతము అంతర్లీనమై భగవంతుడే వెలుగుతున్నాడు. బంగారు నగలయందు అంతటా బంగారమే నిండి యున్నట్లు, కుండలందు మట్టియే వ్యాపించినట్లు, అంతటను భగవంతుడే నిండి యున్నాడనే తత్త్వమును ఈ కీర్తనలలో విశదపరిచారు- శ్రీ త్యాగరాజస్వామి. బ్రహ్మాపనిషత్, ఈ భావానే్న స్పష్టం చేసింది. ‘‘ఏకోదేవః సర్వ భూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాద్యక్షః సర్వభూతాది వాసః సాక్షీ చేతాకేవలో నిర్గుణశ్చః’’ అఖిల సృష్టిలోను నిత్యుడై పరమాత్మ వెలుగొందే ముచ్చటను త్యాగయ్య దర్శించి, మనకు సాక్షాత్కరింపజేసిన త్యాగోపనిషత్. ఈ విషయానే్న పోతనగారు శ్రీమద్భాగవతంలో ‘‘ఇందుగలడందు లేడని సందేహము వలదు’’ అని ప్రహ్లాదుని చేత చెప్పించాడు.
ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకే మనసా
‘‘సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చౌతి’’- సూర్యుడు స్థావర జంగమాత్మకమగు ప్రపంచమునందు అంతర్యామిగా ఉన్నాడు. అంటే ఈ విశ్వమందున్న వారందరిలోనూ వున్నది సూర్యుని చైతన్యమే.. ఒకే చైతన్యం అందరిలోనూ ఉన్నది. కనుక మనమందరం సూర్యభగవానుని ఆత్మస్వరూపులం. నారాయణుడు సూర్యమండల మధ్యమందుడి సర్వ శరీరములందున జీవులకు అధిష్ఠానమై యున్నాడు. నారాయణుడు సమష్టి స్వరూపుడు. జీవులు వ్యష్టిస్వరూపులు. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయములు తేజోమయుడైన పరబ్రహ్మ చేతనే కలుగుతున్నాయి. శ్రీరాముని పరబ్రహ్మ స్వరూపునిగా వర్ణించారు త్యాగయ్య. ‘‘రామ ఏవ పరం బ్రహ్మ’ అన్నది ఉపనిషద్వాక్యం. అంతర్భాహ్యములందు పరబ్రహ్మ స్వరూపమైన రామరూపము సమన్వయమవుతుంది.
అజ్ఞానం తొలగి జ్ఞాన వెలుగు ప్రకాశించగానే సమిష్టిరూపుడై సర్వజీవులకు అధిష్ఠానమై జగమంతా నిండి వున్న శ్రీరాముడు సూర్య మండలంలో దర్శనమిస్తాడు. ‘‘ఏకం సద్విప్రా బహుధా వదంతి’’, ‘‘ఏకమేవా ద్వితీయం బ్రహ్మ’’ అనే వేద వాక్కులను దృష్టిలో ఉంచుకొని, పరమాత్మ గాక అన్య వస్తువే లేదని, ‘ఉండేడి రాముడొకడే’నని, ఊరక వ్యర్థముగా భ్రమించి చెడవద్దని, హరి కాంభోజిరాగంలో అద్భుతమైన కీర్తనను గానం చేశారు త్యాగయ్య. ఇది వేదోపనిషత్తులు, శ్రీమద్రామాయణ సారమైన ఎన్నికగన్న త్యాగరాజు స్వామి వారి కృతి.
నవవిధ భక్తి మార్గములు
‘‘మోక్షసాధన సామగ్య్రాం భక్తిరేవ గరీయసి’’ అన్నాయి నారద భక్తి సూత్రములు. భక్తి, మోక్ష సాధనకు మంచి మార్గం. మోక్షాన్ని పొందటానికి చాలా మార్గాలు చెప్పబడినా, భక్తిమార్గం సులభమయిన మార్గం. అందులోనూ, సధ్భక్తి సహిత సంగీతజ్ఞానం, అదే నాదోపాసన మిగిలిన మార్గములకంటె మోక్షమునకు, మంచి మార్గం తేలిక మార్గం. నవవిధ భక్తిమార్గములు నిర్దేశింపబడినాయి. అవి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. వీటిని పొందుపరుస్తూ త్యాగయ్యగారు ఎన్నో కృతులను వ్రాశారు. ఉదాహరణకు ఒక్కొక్కటి తీసుకుందాం.
శ్రవణం: ‘‘రామకధా సుధారస పానమొక రాజ్యము చేసునే..’’ సీతతో లక్ష్మణ భరత శత్రుఘు్నలతో ఇలలో అవతరించిన రామకధ రాజ్యము చేస్తున్నదని, అదే ధర్మఫలమునిస్తుందని, రామకధ ధైర్యాన్ని, ఆనందాన్ని సుఖాన్ని యిస్తుందని, మనసు బాధించే కర్మబంధమనే అగ్నిని చల్లార్చే మేఘము అని, కలి దోషాన్ని హరించే రామకధను శ్రవణం చేసి, తరించమని మధ్యమావతి రాగంలోశ్రవణభక్తి సంకేతంగా కీర్తించాడు త్యాగయ్య.
స్మరణం: నరుడై పుట్టినందుకు రామనామ స్మరణ చేయుటే సుఖమని, ‘కలౌస్మరణాన్ముక్తి’ అని స్మరణ భక్తికి ఉదాహరణగా జనరంజని రాగంలో ‘స్మరణే సుఖము రామనామ స్మరణే సుఖము నరుడై పుట్టినందుకు రామా’ అన్న కీర్తనను అనుగ్రహించారు త్యాగరాజస్వామి.
పాదసేవనం: ‘శ్రీరామపాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే..’ ఇది శ్రీరామ పాదస్తుతి. బ్రహ్మ సనక సనందనులు దేవేంద్రుడు నారదాదులు పూజించిన శ్రీరామపాదం. శ్రీరాముని పాదసేవా దురంధరుడు, ఆంజనేయుడు. ఇది త్యాగయ్య అమృతవాహిని రాగంలో పాదసేవన భక్తికి సూచితంగా అందించారు.
అర్చనం: ‘‘చల్లరే రామచంద్రునిపై పూలు సొంపైన మనసుతో ఇంపైన బంగారు గంపలతో మంచి చంపకములను..’’ అన్న కీర్తనలో అర్చనభక్తి మార్గాన్ని విశేషంగా విశదీకరించిన త్యాగయ్య, పరమ భక్తశిఖామణి.
వందనం:‘‘వందనము రఘునందనా సేతు బంధనా భక్తచందనా రామ’’ అనే సద్గురు త్యాగరాజస్వామి వారి శహనరాగ కీర్తన, వందనా భక్తి మార్గానికి స్ఫూర్తినిస్తుంది. ఇది అయ్యవారి ‘ప్రహ్లాద భక్తి విజయము’ అనే సంగీత రూపకములోనిది, హృద్యమైనది.
దాస్యం: ‘‘బంటురీతి కొలువియ్యవయ్య రామ.. రోమాంచమనే ఘన కంచుకము, రామభక్తియనే ముద్ర బిళ్ళయును.. రామ నామమనే వర ఖడ్గమిడ్చి రాజిల్లునట్లు త్యాగరాజునికి’’. భగవద్భక్తికి సేవాధర్మము ముఖ్యమైనది. అందులో దాస్యము విశిష్టమైనది. శ్రీరామచంద్రుని దర్బారులో రామబంటుగా కొలువును అనుగ్రహించమని వేడుకుంటున్నారు. ఎప్పుడూ శ్రీరాముని కొలువులో, ఆయన సన్నిధిలో జవాను (బంట్రోతు) ఉద్యోగమిప్పించమని అడుగుతున్నారు, హంసనాదం రాగకీర్తనలో. ఇది దాస్యభక్తి మార్గానికి ఉదాహరణగా నిలుస్తుంది.
సఖ్యం: ‘‘చెలిమిని జలజాక్షుగంటే చెప్పరయ్య మీరు పలుమారు మ్రొక్కెదను దయతో పలుకరయ్యా ఎంతో..’’ ప్రహ్లాదుని నాగపాశములతో కట్టి, రాక్షస భటులు, సముద్రములో పడవేస్తే, సముద్రుడు ప్రహ్లాదునికి స్వాగతం పలికి, సమస్త ఉపచారములు చేసినాడు. ప్రహ్లాదుడు హరిని చూడాలనే కుతూహలంతో వున్నాడు. మునులందరూ ఈ వార్త విని అక్కడికి వచ్చారు. వారిని హరి జాడ తెలుపమని ప్రార్థిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఇది ‘ప్రహ్లాద భక్తి విజయము’ అనే సంగీత రూపకములోనిది. ప్రహ్లాద విజయం అనకుండా, త్యాగయ్య ‘ప్రహ్లాద భక్తి విజయం’ అని చెప్పటం వలనే భక్తికి విజయంగా తేల్చారు. అది ఎవరికి ఉంటే, వారు జయాన్ని పొందుతారు అనేది వారి దృక్పథం. యదుకుల కాంభోజి రాగంలో సఖ్య భక్తి మార్గాన్ని రమణీయంగా మనకందించారు సద్గురు త్యాగరాజస్వామి.
ఆత్మనివేదనం:జీవులు భగవంతుని ఆత్మస్వరూపులు. కనుక జీవాత్మలందరును, పరమాత్మకు స్వతస్సిద్ధముగా దాసులు అనే విషయాన్ని ‘‘నీవాడనేగాన నిఖిల లోక నిదాన నిమిష మోర్వగలనా..’’ అన్న సారంగ రాగ కీర్తనలో ఆత్మ నివేదన భక్తిమార్గాన్ని వివరించారు శ్రీ త్యాగరాజస్వామి.
జగదానందకారకము
రాముడు పరాత్పరుడు. సీత పరాప్రకృతి. వారి అనుబంధం సహజసిద్ధం, సర్వలోక రమణీయం. చేతనాచేత జీవరాశికి ప్రతీక సీత. ఆత్మనిష్ఠకు మారుపేరైన సీత, సుఖ దుఃఖములకు అతీతముగా నిలిచి ‘‘రామమేవాను పశ్చతి’ అని యగాద్వైత స్థితిలో, రామునే ఏకాగ్రతతో దర్శించిన విజ్ఞాన జ్యోతి. భగవంతుని జీవుడు ఆశ్రయించటం కల్యాణం, మంగళప్రదం, ఆనందదాయకం. రాముడు పరబ్రహ్మము, సీత మోక్షలక్ష్మి. రాముడు తపస్వి, సీత తపస్సిద్ధి. సీతారాములు పుణ్యదంపతులు. ఆ కల్యాణ దంపతుల స్మరణము ‘జగదానందకారకము’ అని ఉదాత్తంగా గంభీరమైన పదజాలంతో విశ్వమంతా పంచభూతాత్మకమయి యున్నట్లు, ఉపనిషత్తులు, వేదములు, పురాణములు, భగవద్గీత, బ్రహ్మ సూత్రములలోని ఆధ్యాత్మిక విషయములను హరి హరాద్వైత భావముతో, సంగీత సాహిత్య ప్రపంచమంతయూ యిమిడియున్న ‘ఘనరాగ పంచరత్న కీర్తనలను, నాట గౌళ ఆరాభి వరాళి శ్రీరాగములలో ఆదితాళ నిబద్ధనలో భక్తిరస సమ్మితముగా అందించి పూర్ణత్వమొందిన శ్రీ త్యాగరాజస్వామి-బ్రహ్మ విద్యా సార్వభౌముడు.
త్యాగరాజస్వామి జీవితం -శ్రుతి వివరణం
శ్రీరామబ్రహ్మము, సీతాంబ పుణ్యదంపతులకు సర్వజిత్ నామ సంవత్సర మేషమాసం అనగా వైశాఖ మాసం శుద్ధ షష్ఠీ సోమవారం (1783) మూడవ సంతానంగా జన్మించారు -కాకర్ల త్యాగబ్రహ్మం. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభం దగ్గర కాకర్ల గ్రామస్థులు. జీవనోపాధికై వారు తమిళ రాష్ట్రానికి వలస వెళ్లటంతో, త్యాగబ్రహ్మం జీవితం అక్కడే గడిచింది.
తల్లి నిత్యము పాడుకొను నారాయణ తీర్థ, రామదాస, పురందరదాసాది వాగ్గేయకారుల కీర్తనలతో ప్రభావితుడై, ఏకసంథాగ్రాహియై, అచిరకాలంలోనే కృష్ణయజుర్వేద ఘనాంతము అధ్యయనము పూర్తిచేసి, సంస్కృత సాహిత్య పటిమతో శాస్తమ్రులందునూ పరిచయము గడిచి, జ్యోతిష విజ్ఞానవంతులై పంచాంగ గణితము చేయు శక్తి సామర్థ్యములు కలిగినవాడైనాడు. అంతేకాదు మంత్రశాస్త్ర కోవిదుడు కూడా. తంజావూరు ప్రభుత్వ ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ శొంఠి వేంకట రమణయ్యగారి వద్ద సంగీత విద్యనభ్యసించి, సంగీత శాస్త్ర మర్మములను గ్రహించాడు. పదునెనిమిదవ ఏట విద్యలను పూర్తిచేసి, వివాహమాడి, తండ్రిగారి తదనంతరం వారి శ్రీరామ పంచాయతనం పిత్రేయమైన ఆస్తికాగా, దైవారాధనతో జీవయాత్ర ఉంఛవృత్తితో సాగించాడు త్యాగయ్య.
శ్రీరామ కృష్ణానంద యతీశ్వరుల దర్శనమయి, వారుపదేశించిన రామతారక మంత్రమును తొంబది యారుకోట్లు దీక్షగా ఆర్తితో చేసి ఫలసిద్ధుడర, ప్రాప్తించిన వాక్సుద్ధిని విశ్వమానవ కల్యాణానికి ఉపకరించిన ఆదర్శవంతుడు -శ్రీ త్యాగరాజస్వామి. సర్వస్వము రాముడే అని విశ్వసించి, సర్వులయందు రామునిగాంచి, అద్వైత సిద్ధినొంది, ఆదర్శవంతుడై, జీవన్ముక్తుడైన త్యాగరాజస్వామి, భద్రగిరిపై నెలకొన్న రాముని ‘‘గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి’’ అని శహనరాగంలో ఆర్తితో కీర్తించాడు. 1847 పుష్యశుద్ధ ఏకాదశి వేకువ జామున భద్రాచల రాముడు దర్శనమిచ్చి ‘‘పది పూటలలో కరుణింతు’’నని అనుగ్రహించగా, పుష్యశుద్ధ పూర్ణిమనాడు త్యాగయ్య ఆపత్సన్యాసము స్వీకరించి ‘‘త్యాగరాజస్వామి’ సంకేతుడయినాడు. పుష్యబహుళ పంచమినాడు, వేకువ జామునే స్నానానుష్ఠానములను నిర్వర్తించుకొని, భక్తులు, శిష్యులు శ్రీరామ తారకమంత్ర జపము చేస్తుంటే పది పూటలలో (రోజుల్లో) కరుణింతునన్న ‘‘పరితాపముగని యాడిన పలుకులు మరచితివో’’ అని మనోహరి రాగంలో కీర్తించి, భద్రగిరీశుడు తనకు స్వప్నమందు దర్శనమిచ్చి అనుగ్రహించిన మాటలను జ్ఞప్తి చేస్తూ, శ్యామలవర్ణ సూచితమయిన త్రిగుణాత్మక ప్రకృతియే ఉపాధి కలవాడగుటచే శ్యామలుడైన శ్రీరామచంద్రుని ‘‘శ్యామ సుందరాంగ..’’ అంటూ ధన్యాసిరాగంలో నిండు మనసుతో కీర్తిస్తూ ‘‘సకల శక్తియూ నీవేరా’’ త్యాగరాజు నీకువేరుగాదని పలుకుతూ గంభీర సమన్వయముతో కీర్తించి, సమాధి నిష్ఠతో రామునియందు విలీనమైన బ్రహ్మనిష్ఠుడు -శ్రీ త్యాగరాజస్వామి.సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించి, నాటికి నేటికి ఏనాటికి నాదోపాసన చేసేవారికి, అన్నవస్తమ్రులకు లోటులేని అక్షయ ప్రణాళికలను అందించుటయే గాక, మోక్షమార్గాన్ని కూడా చూపించిన, అనవరత స్మరణీయుడు, బ్రహ్మవిద్యా సార్వభౌముడు నాదయోగి సద్గురు శ్రీ త్యాగరాజస్వామి.

-పసుమర్తి కామేశ్వర శర్మ 9440737464