సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మనసే పునాది
మనసు నిర్మలంగా వుంటే శాంతి లభిస్తుంది. మనలో చెడు వుంటే మనసు కలతచెందుతుంది. మనిషిని అది నిద్ర పోనీయదు. వళ్లు గుల్ల చేస్తుంది. మంచితనం అలాకాదు. మనసు మంచిగా వుంటే నడత చక్కగా వుంటుంది.
నడత చక్కగావుంటే ఇంట్లో సంతోష. సామరస్యాలు చిగురిస్తాయి. ఇంట్లో సామరస్యం వుంటే జాతిలో నీతి మొగ్గతొడుగుతుంది. జాతిలో నీతి వుంటే, ప్రపంచంలో శాంతి విరిసి వికసిస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి మంచిగా వుండాలి. కులం, మతం, రంగు, ఆస్తి, అంతస్థులనే తేడాలు లేకుండా అందర్నీ ప్రేమించు! ఎవరినీ తక్కువగా చూడకు!
నీలో వున్న దైవానే్న అందరిలోనూ దర్శించు!
దుస్తుల పొందిక
నాకు నిరాడంబరత అంటే యిష్టం. నీ దగ్గరికి ఆశీస్సుకోసమో, ఆసరా కోసమో, సాయం కోసమో వద్దామనిపించినవారు బెరుకుపడేట్లుగా నీ డ్రెస్ వుండకూడదు. దుస్తులు శుభ్రంగా వుండాలి. నీటుగా వుండాలి. కాని ఎబ్బెట్టుగానో, వింతగానో వుండరాదు. నలుగురి కంటిలో పడాలనేట్లుగా దుస్తులు వుండరాదు. నీ దుస్తులు శుభ్రంగా, నీ వంటికి హాయిగా వుండాలి. అలాగే నీ మనసులో కూడ అంతశ్శౌచం ఉండాలి.
నీవు చక్కగా యిస్ర్తిచేసిన చొక్కా వేసికుంటావు. కాని లోపల బనియన్ వుతికింది కాదనుకో, హాయిగా వుంటుందా? పోనీ, బనియన్ వుతికిందే వేస్తావు. కాని చొక్కా విడిచిందే వేసికోవాల్సి వచ్చిందనుకో, బాగుంటుందా? రెండూ వుతికినవైతేనే కదా హాయిగా వుండేది! అలాగే బాహ్యశౌచం. అంతశ్శుద్ధి రెండూ కావాలి. వళ్లు సబ్బుపెట్టి రుద్ది, నీళ్లుపోసికొని కడుక్కున్నట్లే మనసును కూడా దృఢవిశ్వాసం అనే సబ్బుతో రుద్దు; నిరంతర సాధన అనే నీటితో కడుగు.
అంతశ్శుద్ధి
ఒక రాజు ఒక భవనం కట్టడానికి ఒక కాంట్రాక్టర్‌ను పిలచి, ‘నాకు గంట్లు లేని నునుపు కఱ్ఱలు కావాలి’ అన్నాడు. ఆ కాంట్రాక్టర్ అనేక వృక్షాలను చూసి, గణుపులేని కర్రకోసం వెదికాడు. చివరకు అరటితోట వద్దకు వచ్చాడు. రాజు అడిగినట్లే అరటి బోదెకు గణుపులు లేవు. నునుపు వుంది. కనుక అరటిబోదెను తీసుకొని రాజువద్దకు వెళ్లాడు. అది చూసి రాజు, ‘నేనడిగిన నునుపు ఉంది కాని, పటుత్వం (గట్టి) లేదే!’అన్నాడు. అట్లే మనంకూడా పైపైకి బాగా ఉంటే లాభంలేదు. అంతర్భావంలో కూడా శుద్ధిఉండాలి. పటిమ ఉండాలి.
అదండీ, భారతం!
భారత కథ కౌరవ పాండవ గాథ మాత్రమేనా! కాదు. అది పంచప్రాణాల కథ! పంచప్రాణాలూ నూరు అడ్డంకులను ఎలా దాటగలిగాయో వివరిస్తుంది భారతం.
ధర్మరాజు నీతికి ప్రతీక. భీముడు దేహబలం: అర్జునుడు దైవభక్తికి గుర్తు: నకులుడు స్థైర్యం: సహదేవుడు సమచిత్తం: ఈ అయిదు గుణాలూ క్షీణిస్తే, హస్తిన- అంటే, దేహం- అధర్మంలో మునిగిపోతుంది!
పరోపకారం
నిరంతరమూ మనం పవిత్రమైన కార్యములో పాల్గొంటుండాలి. ఈ జగత్తులో కొంతమందికి సహాయమూ, దానధర్మములుచేయటం పుణ్యమని భావిస్తున్నాం. ‘పరోపకారః పుణ్యాయ’ పరులకు ఉపకారం చేయటం పుణ్యమని భావించారు లోకులు. కాని ఇదికాదు దీని అర్థము. పర+ఉప+కర= పరోపకార. పర=దివ్యత్వానికి, ఉప= సమీపముగా, కర= చేరటం (వెళ్లటం) అనగా దివ్యత్వానికి దగ్గరగా చేరటమే పుణ్యము అని అర్థము. కనుక భగవంతునికి భక్తులను అత్యంత సమీపంగా చేయటమే నిజమైన పుణ్యము. ఈ పుణ్యం ‘కురు అహోరాత్రం’-రాత్రింబగళ్లు చేయాలి.
ద్వంద్వాల బంధాలు
తీవ్రంగా ఆత్మవిచారం చేయి. సదసద్వివేకం కలిగించుకో. నీవు అనుసరించాల్సిన దారేదో తేల్చుకో.
అవిద్యను అంతం చేసికోడమే మోక్షం. ఎండమావుల వెంట పడకుండా యథార్థాన్ని దర్శించు. కష్టం, సుఖం: ఆకలి, తృప్తి: స్వస్థత, అస్వస్థత: కాంక్ష, సాఫల్యం ఈ ద్వంద్వాలలో చిక్కుపడటానే్న జీవితం అంటారు. వాటినుండి బయటపడు. ముక్తి లభిస్తుంది.
చిత్రగుప్తుని చిట్టా
యమధర్మరాజు కొలువులో చిత్రగుప్తుడనే ఆయన వున్నాడు. మీరు చేసే మంచీ, చెడూ అంతా ఆయన చిట్టా రాసిపెడతాడు. చనిపోయిన వారిని యముని ముందుకు తెచ్చినప్పుడు అదంతా ఏకరువు పెడతాడు.
మంచీ-చెడూ, జమా-ఖర్చు తేలుస్తాడు. అప్పుడు యముడు తగిన శిక్షా, ప్రాయశ్చిత్తం విధిస్తాడు.
ఆ చిత్ర గుప్తుని ఆఫీసు ఎక్కడుంటుంది? మనిషి మనసులోనే. మీరు నిద్రబోయినా, అది మేలుకొనే వుంటుంది. మనసులో ఆలోచనకలిగి ఆచరణలోకి మారేదంతా అక్కడే రికార్డవుతుంది. దోవ తప్పబోతే, వార్నింగు యిస్తుంది. వార్నింగును పట్టించుకోకుండా వుంటే ఆ సంగతీ రికార్డవుతుంది. నీకు చెడు ఆలోచనలు కలిగినప్పుడు, ‘వద్దు’అని దైవికంగా మనసు యిచ్చే ఆదేశాలను నీవు పాటించాలి.
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.