సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ధనం’జయం
మీరంతా బాగా సంపాదించుకోవాలి. అయితే మీరు సంపాదించుకోవాల్సింది ఏమిటి? పొలాలు, యిండ్లు, ఫ్యాక్టరీలు, బంగళాలు, బ్యాంక్ బ్యాలన్సులు- ఇవి కాదు. అత్యద్భుతంగా నడిచే విశ్వాన్నీ, దానిని అమోఘంగా నడిపే ఆ పరమాత్మ మహత్మ్యాన్నీ అవగాహన చేసికోగల జ్ఞాన సంపదను సంపాదించుకోండి!
అర్జునుడికి ధనంజయుడు అన్న పేరుంది. ఆయన జయించిన ధనం ఏమిటి? మనిషిని రక్షించే ధనం. రాజు పన్ను వేయలేనిదీ, దొంగ దొంగిలించలేనిదీను. అదే తత్వజ్ఞాన సంపద. ‘అధన’-అంటే, డబ్బులేకపోవడం, డబ్బు పట్ల సంగాన్ని వదలటం. ఈ తత్వజ్ఞాన సంపదను సంపాదించుకొనేందుకు అధనయే సరయిన మార్గం.
అదే ‘గీత’
నరుడు అర్జునుడు. నారాయణుడు కృష్ణుడు. నారాయణుని స్ఫూర్తితో నరుడు మాయను-అంటే కౌరవులను జయించాలి.
భారత యుద్ధం అంతరార్థం యిది. ఆ యుద్ధం అశాశ్వతమైన విషయాలకూ, శాశ్వతమైన విలువలకూ మధ్య జరుగుతుంది. ఖండ శక్తికీ, అఖండ శక్తికీ మధ్య జరుగుతుంది. ఇంద్రియ వ్యామోహానికీ, అతీంద్రియ నిస్సంగానికీ మధ్య జరుగుతుంది.
నీలమేఘంపై విరిసే తటిల్లత(మెరుపు) ఆత్మ! అదే గీత!(మెరుపు గీత, భగవద్గీత). ఆ గీతను కనుగొంటే, గీతాపారాయణ ఫలం దొరికినట్లే!
ఆ సంగతి ముందే తెలిస్తే...
రణరంగంలో అర్జునుడు కర్ణుడిని సంహరించాడు. యుద్ధం అంతా ముగిసిన తర్వాత ధర్మరాజుకు కర్ణుడెవరో కాదు, తన అన్న అని తెలిసింది. ఇక ఆయన దుఃఖానికి అంతులేదు. ఈ సంగతి ముందే తెలిసివుంటే, ఆ అనర్థం జరక్కపోయేది కదా!
మీరు కూడా ఒకరినొకరు చూచి అసూయాద్వేషాలు పెంచుకొంటారు. ‘అంతా ఆయన స్వరూపమే’అన్న గ్రహింపు చిక్కిన తరువాత ప్రేమాభిమానాలు పొంగిపొరలుతాయి!
యోగ రహస్యం
భగవద్గీత భక్తి, జ్ఞాన, కర్మయోగాలను గురించి ప్రబోధిస్తుంది. పతంజలి యోగమంటే ‘చిత్తవృత్తి నిరోధం’అన్నాడు.
విష్ణువు కన్న యిందుకు తార్కాణం మరొకరు లేరు. ఆయన ‘శాంతాకారం’మరి! శాంతంగా ఉన్నాడు, ఏ పరిస్థితిలో? ‘్భజగ శయనం’- పాముపై పవ్వళించినప్పుడు. ఆ పాముకూడా ఒకటో, రెండో పడగలదా? వేయి పడగల ఆదిశేషుడు! అలా ఎలా ఉండగలిగాడు? నిస్సంగం వల్ల! అదీ రహస్యం!
సంగమే సంకెల
కోతి యొకటి ఒక కూజాలోనున్న తినుబండారములను చూసి ఆశపడి, చేయి పెట్టి పిడికిటి నిండా పట్టుకొన్నది. కూజా మెడ మిక్కిలి సన్నముగా నున్నందున, పిడికిలి వదిలితే కాని చేయి ఇవతలికి వచ్చుటకు సందులేదు. పిడికిలి వదులుటకు కోతికిష్టం లేదు. అందువలన ఎంత లాగినను చేయి బయటికి రాక అది యమయాతన పడ్డది. ఈనాటి మానవుని పరిస్థితి సరిగ్గా ఇట్లే ఉంది. ఆస్తిపాస్తులు చేజిక్కించుకున్నాడు. అవి మనశ్శాంతి కలిగించునని అతని భ్రాంతి. కాని, అవి అసూయాద్వేషాలను పెంచుతాయి. మనస్సును కలవరపెడతాయి. కాని శాంతినీయవు. వాటిని అతడు వదలలేడు. వాటిని వదిలితేనేకాని అతనికి విముక్తిలేదు.
సన్యాసి
సన్యసించే వాడేం చేయాలో తెలుసా! తను చనిపోయినట్లు భావించి, జీవశ్రాద్ధం చేసుకోవాలి. గతంతో తెగతెంపులు చేసికోవాలి. తన పేరు తన చరిత్ర, వంశం అన్నీ వదిలేయటమే కాదు ఇంద్రియ సుఖాలపై ఆసక్తిని చంపుకోవాలి. తన పాత మిత్రులు, శత్రువులు, పాత అలవాట్లు, అభిరుచులు, సరదాలు, సంబరాలు, పాత క్షక్షలు అన్నీ వదిలేయాలి. ‘గతం గోష్ఠి న కర్తవ్యం’ -అన్నది వారికి విధ్యుక్త్ధర్మం.
అందుకే గీత కర్మ సన్యాసాన్ని తప్ప యింకే రకమైన సన్యాసాన్ని నిర్దేశించలేదు.
చింత డొల్ల
మనసు వివేకానికి బంటుకావాలి కాని విషయ వ్యామోహానికి బానిస కారాదు. దేహం వేరు, ఆత్మ వేరు అన్న విచక్షణను పెంచుకొని, అది విడివడగలగాలి. చింతకాయ పండవగానే, కాయపై పెంకులోని గుజ్జుకు అంటకుండా గుల్లబారినట్లు, దేహానికి సంబంధించినవి మనసు కంటకుండా నిస్సంగం అలవరచుకోవాలి.

ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.