ఈ వారం స్పెషల్

సూకీ.. సునామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నియంత.. నువ్వెంత..?’- అంటూ రాక్షస పాలకులను ప్రజలు తరిమికొడుతున్న శతాబ్దమిది. హక్కులే ఊపిరిగా, స్వేచ్ఛా స్వాతంత్య్రాలే ఆభరణాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం పురివిప్పుతున్న ఆశావహ తరుణమిది. ప్రపంచానికి దూరంగా, ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలకుల నియంతృత్వ నీడల్లో సాగిన మైన్మార్ కొత్త పుంతలు తొక్కుతోంది. అంగ్‌సాన్ సూకీ (70) సారథ్యంలో నియంతృత్వ శృంఖలాలు తెంచుకుని హక్కుల ఊతాన్నందుకుంటోంది ఆ దేశం. రెండున్నర దశాబ్దాల అహరహ పోరాటంతో తన దేశ ప్రజలనే కాకుండా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఊతాన్నిచ్చిన సూకీదే ఇక మైన్మార్. ఓ వ్యక్తిగా, శక్తిగా, శాంతిదూతగా ఇనే్నళ్లూ తన పార్టీని నడిపించిన ఆమె ఇప్పుడు మైన్మార్ కొత్త ప్రభుత్వానికి కొండంత ధైర్యం కాబోతున్నారు.

మైన్మార్‌లో మహోజ్వల శకం మొదలైంది. నిలువునా నీరుగారిపోయిన ప్రజాస్వామ్యం ఊపిరి పోసుకుంది. ఐదు దశాబ్దాల పాటు సైనిక పదఘట్టనల్లో నలిగిన మానవ హక్కులు రెక్కలు కట్టుకున్నాయి. హక్కుల ఆలంబనగా ప్రజాస్వామ్య వినీలాకాశంలో విహరించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఆధునిక మానవ గతిలో ఏ దేశ చరిత్ర చూసినా హక్కులన్నవి పోరాటం ద్వారానే సిద్ధించాయన్న వాస్తవం కళ్లకు కడుతుంది. అధికారానికి, నియంతృత్వ పోకడలకు అలవాటు పడ్డ పాలకులు ఉక్కు పిడికిలితోనే ప్రజల హక్కులను, మానవ విలువలను హరించిన ఉదంతాలు, దురంతాలు ఎన్నో.. ఎనె్నన్నో..! తనను నిలువునా నీరుగార్చేందుకు ప్రయత్నించిన సైనిక పాలకులనే దారికి తెచ్చుకున్న ధీశాలి అంగ్‌సాన్ సూకీ. రెండున్నర దశాబ్దాల క్రితం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఆమె ప్రభుత్వాన్ని రద్దు చేయడమే కాకుండా.. ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతనే కటకటాల పాలు చేసిన సైనికులు తుది వరకూ తమ పట్టును బిగించేందుకే ప్రయత్నించారు. జైల్లో ఉన్నా ఎడతెగని స్ఫూర్తే ఊపిరిగా, పట్టుదలే ఆరోప్రాణంగా మనుగడ సాగించిన సూకీ ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని తన నిరుపమాన వ్యక్తిత్వాన్ని, పట్టుదలను చాటిచెప్పారు. ఓ మహిళను దాదాపు పదేళ్ల పాటు నిర్బంధించడమంటే మామూలు విషయం కాదు. కరడుగట్టిన అధికార అహంకారానికి, ఎలాగైనా సరే తమ ఆధిపత్యానికి విఘాతం కలుగకూడదన్న తెగింపు ఉంటే తప్ప ఇలాంటి దురాగతానికి ఏ పాలకులూ ఒడిగట్టరు. కానీ, మైన్మార్ సైనిక పాలకులు తమ తీరే వేరని నిరూపించారు. ఓ పక్క ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్యం కోసం ఆరాటపడుతూంటే.. ప్రజలు ఎన్నుకున్న సూకీ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆమె ఎన్నికే చెల్లదంటూ తమదైన శైలిలో తీర్పునిచ్చేసి తొంభైయవ దశకం తొలినాళ్లలో జైలుపాలు చేశారు. అప్పటి నుంచి గత దశాబ్దం ద్వితీయార్థంలో విడుదలయ్యే వరకూ సూకీ మానసికంగా ఎంతో క్షోభను అనుభవించారు. అయినా.. తన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న పట్టుదల ఆమెలో ఎప్పటికప్పుడు బలోపేతం అవుతూ వచ్చిందే తప్ప వత్తిళ్లలకు సడలిపోలేదు. సూకీ కాకుండా ఇంకెవరికైనా ఇలాంటి మానసిక వత్తిళ్లతో కూడిన పరిస్థితి ఎదురై ఉంటే ఎప్పుడో మైన్మార్‌లో ప్రస్తుత ఆనందం ఉండేది కాదు. తమ భవిష్యత్‌ను తామే నిర్దేశించుకునే మహత్తర అవకాశం ప్రజలకు దక్కి ఉండేది కాదు. తన వ్యక్తిగత సౌఖ్యం కంటే, తన పిల్లల భవితవ్యం కంటే దేశం, ప్రజలు, మానవ హక్కుల పునరుద్ధరణే ఆరో ప్రాణంగా సూకీ భావించారు. కాబట్టే ఎలాంటి విపత్కర పరిస్థితినైనా తట్టుకోగలిగారు. నిజానికి 1990లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో ప్రతిపక్ష జాతీయ ప్రజాస్వామ్య లీగ్ (ఎన్‌ఎల్‌డి) అధ్యక్షురాలిగా ఉన్న సూకీ 59 శాతం ఓట్లను, 81 శాతం సీట్లను గెలుచుకున్నారు. అంటే పార్లమెంట్‌లో ఉన్న 485 స్థానాల్లో 392 సీట్లు సూకీ పార్టీ ఎన్‌ఎల్‌డికే దక్కాయి. అంత భారీ మెజార్టీతో నెగ్గిన ఆమెకు అప్పటి సైనిక పాలకులు పట్టం కట్టాలి. అధికారాన్ని వెండి పళ్లెంలో పెట్టిమరీ అప్పగించి ఉండాలి. కానీ.. అంతటి విస్తృత ప్రాధాన్యత కలిగిన ఎన్నికలనే రద్దు చేశారు. నిజానికి అప్పటి ఎన్నికలకు ముందే అంటే 1989 జూలైలోనే సూకీని నిర్బంధించారు. ఆ పరిస్థితి కూడా 1990లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీకి అంతటి మెజార్టీ లభించడానికి కారణమైంది. అయినా సైన్యం ఆ ఎన్నిక ప్రాధాన్యతను విస్మరించి సూకీని 2010 వరకూ నిర్బంధంలోనే ఉంచింది. అప్పుడు కూడా ఆమెను విడుదల చేయడానికి ఇష్టపడని సైన్యానికి ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం అనివార్యం కావడానికి కారణం- అంతకు ముందు ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వాలు కుప్పకూలిపోవడమే. హోస్ని ముబారక్, గద్ద్ఫా వంటి కరడుగట్టిన నియంతలకు వ్యతిరేకంగా ఆయా దేశాల్లో జరిగిన ప్రజా ఉద్యమాలు సాధించిన ఫలితాలు మైన్మార్ పాలకుల్లోనూ కనువిప్పు కలిగించాయి. సూకీని ఇంకా నిర్బంధంలో కొనసాగిస్తే తమ ఉనికికే ముప్పు వాటిల్లుతుందన్న భయంతో ఆమెను షరతులతో విడుదల చేశారు. ఆ నిర్ణయానికి ముందు తమ అధికారానికి ఎలాంటి ఇబ్బంది లేని విధంగా కొత్త రాజ్యాంగాన్నీ రూపొందించుకున్నారు. అంటే దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సూకీ కారణంగా తమ పదవులకు లేదా అధికారానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదన్నదే ఆ రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా సైనికులు రూపొందించుకోవడానికి ప్రధాన కారణం. గృహ నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత సూకీ ప్రభావం మరింతగా పెరిగింది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఆమె ప్రాబల్యం విస్తరించింది. అప్పటి వరకూ మైన్మార్‌పై కనె్నత్తయినా చూడని అమెరికా వంటి దేశాలు తమ దృష్టిని కేంద్రీకరించాయి. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రెండుసార్లు మైన్మార్‌లో పర్యటించి అన్ని విధాలుగా సహకరిస్తామన్న బలమైన హామీ ఇచ్చారు. అనంతరం అనేక దేశాల ప్రధానులు, అధ్యక్షులు ఒకరొక్కరుగా మైన్మార్‌ను సందర్శించడంతో సైనిక పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సూకీ విషయంలో తాము చేసేది ఏమీ లేదని, ఆమె అనుకున్నట్టుగా దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితుల్ని పునరుద్ధరించడమన్నది అనివార్యమన్న నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలోనే ఆంక్షలు, నిబంధనలు, అడ్డంకులతో కూడిన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. పరిస్థితి ఎలాంటి మలుపు తిరిగినా, ప్రతిపక్ష ఎన్‌ఎల్‌డి అధికారంలోకి వచ్చినా తమకు ముప్పు సూకీ నుంచే కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాధ్యక్ష పదవిని చేపట్టకుండా రాజ్యాంగ పరంగా కట్టడి చేశారు. ఓ విదేశీయుడ్ని పెళ్లి చేసుకుంది కాబట్టి సూకీకి దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు ఎలాంటి అవకాశం ఉండకుండా బలమైన రాజ్యాంగ నిబంధననే తీసుకొచ్చారు. అయినా తనకు అధ్యక్ష పదవి కంటే దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణే ముఖ్యమనుకున్న సూకీ మూడేళ్ల క్రితమే దేశ పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం లేకపోయినా తమ పార్టీ అధికారంలోకి వస్తే అనుకున్న విధంగా దేశ చరిత్ర గతినే మార్చేయవచ్చునని భావించారు. ఆమె అనుకున్నట్టుగానే తాజా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 1990లో జరిగిన ఎన్నికలకు మించిన స్థాయిలోనే 80శాతానికి పైగా ఓట్లు, సీట్లు దక్కాయి. అయితే సూకీ పార్టీకి ఇంత భారీ మెజార్టీ వస్తుందని కల్లో కూడా ఊహించని సైనిక పాలకులకు ఈ పరిణామం అశనిపాతంగా పరిణమించింది. తొలి దశ ఫలితాల్లోనే అంతిమ ఫలితం ఎలా ఉండబోతోందన్న విషయం స్పష్టం కావడంతో ఎన్నికల ఫలితాల విడుదలలో ఎనలేని జాప్యం జరిగింది. పాతికేళ్ల నాటి పరిస్థితిని పునరుద్ధరించేందుకు సైనిక పాలకులు ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా ఒక దశలో కలిగాయి. అంతిమంగా రంగంలోకి దిగిన సూకీ ‘ఇక ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు సాగవ’వంటూ సింహగర్జనే చేశారు. తనకు అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం లేకపోయినా తమ పార్టీదే ప్రభుత్వమని, అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహించినా ఆ వ్యక్తి వెనుక బలమైన శక్తిగా తానే పని చేస్తానని తేల్చిచెప్పారు. దాంతో ఇక తమ ఆటలు సాగవని భావించిన సైనిక పాలకులు తమ ఒటమిని అంగీకరించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు సూకీని అభినందించక తప్పలేదు. ఎన్నికల్లో ఒడిపోయినా తాము రూపొందించుకున్న రాజ్యాంగం ప్రకారం సైన్యానికి బలమైన అధికారాలే ఉన్నాయి. పోటీ చేయకపోయినా పార్లమెంట్‌లో పాతిక శాతం సీట్లు సైనికులవే! పైగా, దేశ భవితకు అత్యంత కీలకమైన మూడు బలమైన మంత్రి పదవులనూ ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా చేపట్టే అధికారమూ వారి చేతిలోనే ఉంది! ఇలాంటి పరిస్థితుల్లో సూకీ పార్టీకి ఎంత బలమైన, తిరుగులేని మెజార్టీ వచ్చినా మైన్మార్ చరిత్ర గతిని మార్చేసేందుకు అన్ని విధాలుగా అనువైన అవకాశాలు లభిస్తాయా? అన్న అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. మొత్తం పరిస్థితి తలకిందులైనప్పుడు, ఇక సూకీ పార్టీకి అధికారం దక్కకుండా చేసేందుకు ఎలాంటి మార్గమూ లేనప్పుడు ఎంతటి సైనిక పాలకులైనా దారికిరాక తప్పదు. అందుకే పార్లమెంట్‌లో సూకీ పార్టీకి లభించిన మెజార్టీని అంగీకరించారు. ఎన్‌ఎల్‌డికే అధికారాన్ని అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని అన్ని విధాలుగా తమ కబంధ హస్తాల్లో నడిపించిన సైన్యాన్ని ఇంత ధీరోదాత్తంగా ఎదుర్కోవడం.. చివరి వరకూ రాజీలేకుండా పోరాటం చేయడం ఒక్క సూకీకే సాధ్యమైంది. ఈ పాతికేళ్ల కాలంలో ఆమె ఏ ఒక్క క్షణం రాజీపడ్డా.. ఫలితం మరోలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. నమ్ముకున్న సిద్ధాంతం బలమైనదైనప్పుడు, మొత్తం ప్రజలే తనకు వెన్నుదన్నుగా నిలిచినప్పుడు ఏ రాజకీయ నాయకుడిడైనా, నాయకురాలికైనా తిరుగులేని శక్తి లభిస్తుంది. ఈ జీవితం తనది కాదు ప్రజలదేనన్న బలమైన నమ్మకం కలుగుతుంది. సూకీని ఇన్ని దశాబ్దాల పాటు ముందుకు నడిపించింది ఇలాంటి బలమే. అందుకే తాను వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నష్ట పోయినా, తనను నమ్ముకున్న ప్రజల ఆశలు, ఆశయాలను ఈడేర్చాలన్న బలమైన సంకల్పంతోనే సూకీ పని చేశారు. సూకీ లేనిదే ఎన్‌ఎల్‌డి లేదు, ఆ పార్టీ ప్రభుత్వమూ ఉండదు. అందుకే రానున్న కొన్ని దశాబ్దాల పాటు మైన్మార్‌కు దశ, దిశ సూకీనే. పగ్గాలు లేకపోయినా సూపర్ పవర్‌గానే సూకీ కొనసాగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ని దశాబ్దాల పాటు అధికారానికి అలవాటు పడ్డ సైనిక పాలకులు కొత్త ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తారా? అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వంలో సైనికులకూ కీలక పదవులు ఇవ్వాలన్న రాజ్యాంగ నిబంధనను సూకీ పార్టీ ఎంత మేరకు ఆచరిస్తుందన్నది ఈ నేపథ్యంలో అత్యంత కీలకం. ఎందుకంటే.. అధికారం ఎన్‌ఎల్‌డిదే అయినా ఏ క్షణంలోనైనా చక్రం తిప్పే అధికారం రాజ్యాంగం ప్రకారం సైన్యానికి ఉంటుంది. ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో విలసిల్లాలంటే ఇలాంటి మెలికలు ఉండటం అన్నది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పుడే ఏ దేశమైనా సక్రమంగా ముందుకు సాగుతుంది. అధికారంలో ఉన్న పార్టీలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్లగలుగుతాయి. ఇప్పుడు సూకీ పార్టీదే అధికారం అయినప్పటికీ దేశాన్ని, ప్రభుత్వాన్ని నడిపించేది ఆమే కాబట్టి.. ఆమె శక్తియుక్తులను శంకించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇప్పటి వరకూ అణచివేత..హక్కుల ఉల్లంఘనే జీవితంగా, జీవనంగా మారిన మైన్మార్ ప్రజలకు స్ఫూర్తి ప్రదాత సూకీనే. దేశాన్ని నిజమైన ప్రజాస్వామ్యం దిశగా బలంగా నడిపించాల్సిన బాధ్యత కూడా ఆమెదే. ప్రభుత్వాన్ని నడిపించడంలో ఎన్‌ఎల్‌డి ఎంపీల కంటే కూడా పాతిక శాతం సీట్లలో తిష్టవేసే సైనిక ప్రతినిధులను ఒప్పించడం ఎంత వరకూ ఆమెకు సాధ్యమన్నది వేచిచూడాల్సిందే. ఇనే్నళ్లూ మైన్మార్ అంటే చిన్నచూపు చూసిన పశ్చిమ దేశాలకు ఇప్పుడు బలమైన అవకాశం కలిగింది. అందుకు సూకీ నాయకత్వం, నేతృత్వం అనేక విధాలుగా దోహదం చేసింది. ఐదేళ్ల క్రితం జైలు నుంచి విడుదలైనప్పటి నుంచీ విస్తృతంగా విదేశీ పర్యటనలు చేపట్టిన సూకీ చాలా బలమైన సంబంధాలనే ఏర్పరచుకున్నారు. ఇవన్నీ కూడా ఎన్‌ఎల్‌డి ప్రభుత్వం స్థిరంగా, ఎలాంటి రాజకీయ అనిశ్చితికి తావులేకుండా మైన్మార్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేసే అవకాశం ఎంతైనా ఉంది. దేశంలోని అన్ని వర్గాలనూ కలుపుకుని ముందుకు పోవడంలోనే నిజమైన రీతిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం సాధ్యమవుతుంది. ఈ రకమైన ఉమ్మడి స్ఫూర్తి, నాయకత్వ పటిమ సూకీకి పుష్కలంగా ఉన్నా.. సైనిక ప్రతినిధులు ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు కలిగిస్తారోనన్న ఆందోళన కలుగుతోంది. నియంతృత్వాలు కాలగర్భంలో కలిసి పోయి, సైనిక పాలకులూ పలాయనం చిత్తగిస్తున్న నేటి బలమైన ప్రజాస్వామ్య పరిస్థితుల్లో మైన్మార్ సైనిక పాలకులూ వాస్తవాలను అంగీకరించి వాస్తవిక దృక్పథాన్ని అలవరచుకోవడం అనివార్యం. సూకీకి అవరోధాలు కల్పించడం కంటే, మరోసారి తమ అధికారాన్ని పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నించడం కంటే కూడా ఆమెకు, ఆమె పార్టీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడంలోనే వారి ఉనికి బలపడుతుంది. ఇలాంటి గుణాత్మక ధోరణి మైన్మార్‌కు ఎంతైనా అవసరం. సూకీ నాయకత్వంలో మైన్మార్ అభివృద్ధి పరంగా, ప్రగతి పరంగా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనన్యమైన పురోగతిని సాధించాలని శాంతికాములంతా ఆశిస్తున్నారు.
*

ఘనమైన నేపథ్యం
అలనాటి బర్మాలో రాజకీయంగా బలంగా వేళ్లూనుకున్న కుటుంబం నుంచి సూకీ ప్రజాజీవితంలోకి వచ్చారు. ఆమె తండ్రి అంగ్‌సాన్ ఆధునిక బర్మా సైన్యాన్ని ఏర్పాటు చేసిన ఘనుడు. ఆంగ్ల పాలకుల నుంచి బర్మాకు విముక్తి కలిగించడంలో ఆయన తిరుగులేని భూమిక పోషించారు. బర్మాకు స్వాతంత్య్రం వచ్చిన 1947లోనే ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. 1945 జూన్‌లో జన్మించిన సూకీది చిన్నప్పటి నుంచి తండ్రి లేని జీవితమే. తల్లి, ఇద్దరు సోదరులతోనే ఆమె జీవితం సాగింది. మొదటి సోదరుడు చిన్నప్పుడే చనిపోయాడు. రెండో సోదరుడు అమెరికాకు వలసవెళ్లాడు. ఇక తల్లితోనే ఉన్న సూకీ దేశంలో రాజకీయ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అవగతం చేసుకుంటూ వచ్చింది. సూకీ తల్లి ఖిన్ కీ కూడా బర్మా రాజకీయాల్లో చురుగ్గానే వ్యవహరించారు. 1960లో భారత్‌లో బర్మా రాయబారిగా పని చేశారు. ఆమెతో పాటే అనేక దఫాలుగా చిన్నారి సూకీ భారత్ వచ్చేది. సూకీ 1960లో దిల్లీ వచ్చాక అక్కడి లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. 1964లో లండన్ చేరుకుని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతుండగా మిఖాయల్ అరీస్‌తో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. సూకీ, అరీస్ దంపతులకు ఇద్దరు సంతానం. 1988లో స్వదేశానికి చేరుకున్నాక, అప్రజాస్వామిక చట్టాలకు వ్యతిరేకంగా, మైన్మార్ల రాజకీయ స్వేచ్ఛ కోసం ఆమె పూర్తిగా రాజకీయాలకు అంకితమైపోయి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

1947: సూకీ రెండేళ్ల వయసులో ఆమె తండ్రి, మైన్మార్ స్వాతంత్య్ర సమర యోధుడు జెన్ అంగ్‌శాన్ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. తండ్రి గౌరవార్థం ఆమె తన తలపై రంగురంగుల పూలు ధరించడం అలవాటు చేసుకున్నారు.
1960: తల్లి దా కిన్ కీ వెంట దిల్లీ చేరుకున్నారు. అక్కడి లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.
1964: లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ కాలేజీలో చేరారు. అక్కడ మిఖాయిల్ అరిస్‌తో పరిచయం ప్రేమగా మారి దాంపత్యబంధానికి దారితీసింది.
1988: మైన్మార్ చేరుకుని తల్లి నుంచి ఉద్యమ బాధ్యతలు చేపట్టారు.
1989: మైన్మార్ నుంచి వెళ్లిపోవాలంటూ సూకీపై ఆంక్షలు. తన ఇద్దరు కుమారులు, భర్తను కలుసుకునేందుకు వీలులేకుండా ఆమెకు అనుమతి నిరాకరణ.
1990: సూకీ పార్టీ ఎన్‌ఎల్‌డికి ఎన్నికల్లో మెజారిటీ లభించినా ప్రభుత్వం ఏర్పాటుకు మిలటరీ ప్రభుత్వం నిరాకరణ. ఎన్నికల ఫలితాలను పట్టించుకోని పరిస్థితి.
1991: సూకీకి నోబెల్ పురస్కారం.
1995: గృహనిర్బంధం నుంచి స్వేచ్ఛ.
2000: మళ్లీ గృహనిర్బంధం విధిస్తూ మిలటరీ ప్రభుత్వం ఆదేశాలు.
2002: గృహనిర్బంధం నుంచి స్వేచ్ఛ లభించినా, దేశంలో అల్లర్లకు కారణమన్న ఆరోపణలపై జైలుకు తరలింపు.
2007: నాలుగేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చిన సూకీ.
2010: గృహనిర్బంధం నుంచి విడుదల. సూకీని కలుసుకునేందుకు ఆమె కుమారుడు కిమ్‌కు అనుమతి.
2012: మైన్మార్ పార్లమెంటు ఉపఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి జయభేరి. ప్రతిపక్ష నాయకురాలిగా సూకీ ఎన్నిక.
2013: ఇరవై నాలుగేళ్ల విరామం తర్వాత ఇతర దేశాల్లో పర్యటన. మైన్మార్‌లో ప్రజా ఉద్యమానికి మళ్లీ ఊపు.

- బి.ఆర్.పి