కథ

సుమ సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజు ‘ప్రశాంతి వృద్ధాశ్రమం’ కళకళలాడుతోంది. చక్కగా మామిడి తోరణాలు కట్టి అందమైన ముగ్గులతో ఉగాది వేడుకలు చేసుకోవడానికి ముస్తాబు అయింది. ఉదయం ఆరు గంటలకే ఆ వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి పండుగ చేసుకోవటానికి వచ్చారు. అక్కడి వృద్ధులందరికీ ఆదిత్య, అతని స్నేహితులు సంవత్సర కాలంగా పరిచయస్తులే. వారికి పరిచర్యలు అందించటానికి అక్కడికి వస్తూ ఉంటారు. ఆ ఆశ్రమ నిర్వాహకులు కూడా నిస్వార్థపూరితులు కావడం వారికి మరింత ఉత్సాహాన్నిస్తోంది.
ప్రతి ఆదివారం వారందరూ వచ్చి ఆ వృద్ధులకు కావల్సిన సేవలు అందిస్తూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా వారికి దూరమైన ప్రేమ, ఆప్యాయతలు అందిస్తూ ఉంటారు.
షామియానా కింద కుర్చీలు సర్దిస్తున్న ఆదిత్య సురేష్‌ని పిలిచి ‘జెన్నీ చెప్పిందిరా. వాళ్ల ఫ్రెండ్ ఎవరో ఈ ఊరు వచ్చారని, ఆ అమ్మాయి ఇలాంటి సేవా కార్యక్రమాలకు చాలా సహాయపడుతుంటుందని. వెజిటబుల్స్ స్పాన్సర్ చేస్తానందిట. ఒక్కసారి ఆమెని కనుక్కో’ అని చెప్పాడు. సురేష్ జెన్నీ దగ్గరకు వెళ్లిపోయాడు.
వృద్ధులందరినీ ఆ కుర్చీలలో కూర్చోబెట్టారు. చక్కగా తలస్నానాలు చేసి కొత్త దుస్తులు ధరించి కళకళలాడుతున్నారు వారంతా. ఆశ్రమం చైర్మన్ రాఘవరావుగారు, సిబ్బంది, ఆదిత్య అతని స్నేహితులు అందరూ వారికి ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. వారు కూడా అందరినీ ఆశీర్వదించారు.
చిన్నచిన్న కప్పులో ఉగాది పచ్చడి అందరికీ ఇచ్చారు. తరువాత ఇడ్లీ, సాంబారు, కేరెట్ హల్వా సర్వ్ చేయసాగారు. అప్పుడే కారు దిగింది జెన్నీ స్నేహితురాలు. జెన్నీ ఎంతో సంతోషంగా ఆమెని ఆహ్వానించింది.
‘హాయ్! నీ గురించే వెయిటింగ్. ఆదిత్యా! ఇదిగో నా ఫ్రెండ్ సుమ. తను ఎంసిఏ చేసింది. ఈ మధ్యనే ఉద్యోగం రావడంవల్ల తను ఈ వైజాగ్ వచ్చింది’ చెబుతూనే ఉంది జెన్నీ.
ఆదిత్య ఆమెనే పరిశీలనగా చూశాడు. అతనిలోని ప్రత్యేకత ఏమిటంటే అవతలి వారి స్వభావాన్ని ఇట్టే గ్రహించగలడు. కాస్సేపటికే సుమ స్వభావం అతనికి చాలా నచ్చింది. సౌందర్యరాశిలా ఉండటమే కాదు, మృదువుగా మాట్లాడే సుమ ఎవరికైనా నచ్చుతుంది. ఆమె అందరితోనూ చక్కగా కలసిపోయింది.
భోజనాలు అయ్యాక అందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు బయలుదేరారు. ఆదిత్య మనసు మాత్రం సుమతోపాటే ఆమె కారెక్కేసింది.
ప్రతీ వారం వారందరూ కలుస్తూ ఉండటంతో ఆదిత్య, సుమల బంధం కూడా చిక్కబడింది. వారిరువురివీ మంచి చదువులు, మంచి ఉద్యోగాలు కావడంవల్ల పెద్దలు వారి అభిమతానికి సమ్మతి తెలపడంతో వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. తన ఆశయాలకు తగిన భర్త లభించినందుకు సుమ ఎంతగానో పొంగిపోయింది. తనకి అవసరం లేని ఉద్యోగం అవసరమైన మరొకరికి ఆసరా అవుతుందని సుమ తన ఉద్యోగాన్ని రిజైన్ చేసేసింది.
పెళ్లి తరువాత ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, బాధ్యతలు పెరగడం, తరచూ క్యాంప్‌లకు వెళ్తూండవలసి రావడంతో ఆదిత్యకి వృద్ధాశ్రమానికి వెళ్లడానికి వీలు చిక్కడంలేదు. దాంతో భర్త ఆశయాలను కూడా తానే నెరవేర్చాలని గట్టిగా సంకల్పించుకుంది సుమ. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి.
ఆదిత్య వారం తరువాత క్యాంప్ నుండి వచ్చేసరికి రాత్రి ఎనిమిదిన్నర
అయింది. ఇంట్లోకి వస్తూనే సుమ కోసం వెదికాడు. కన్పించకపోయేసరికి తల్లి రుక్మిణమ్మని ‘అమ్మా! సుమ ఏది?’ అని అడిగాడు.
దానికి సమాధానంగా తల్లి ‘లేదురా! ఆశ్రమానికి వెళ్లింది. ఈ రోజు వైద్య శిబిరం ఉందని రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పింది’ అని చెప్పి కాఫీ కలపడానికి లోపలికి వెళ్లిపోయిందామె.
‘హు! ఈవిడగారికి తిరుగుళ్లు ఎక్కువయ్యాయి. వచ్చేసరికి మనిషి కనపడదు’ మనసులోనే విసుక్కున్నాడు. వారం తరువాత క్యాంప్ నుండి వచ్చిన అతనికి భార్య కనిపించకపోయే సరికి ఆమె మీద ప్రేమ విసుగుగానూ తరువాత కోపంగానూ ఆ మీదట అలకగానూ రూపాలు మార్చుకుంది. ఈ మధ్య తరచూ ఇలాగే అవుతోంది.
స్నానం చేసి ఫ్రెష్ అయితేగాని విసుగు తగ్గదనుకున్నాడు. తల్లి ఇచ్చిన కాఫీ తాగి స్నానం చేసి మంచం మీద వాలాడు. అయినా మనసు చల్లబడటంలేదు.
సుమ వస్తూనే ‘అత్తయ్యా! ఆయనొచ్చేసారా?’ అని అడిగింది.
‘అవునమ్మా. ఒక అరగంట అవుతోంది’ అంది అత్తగారు.
హడావిడిగా గదిలోకొచ్చిన సుమ అతను పడుకుని ఉండటం చూసి చాలా ఆందోళనగా ‘ఏమయిందండీ? పడుకున్నారేం? ఒంట్లో బాగోలేదా?’ నుదుటి మీద చేయి వేస్తూ అడిగింది సుమ. ఆ చేయిని విసురుగా తోసేస్తూ ‘నేను బాగానే ఉన్నాను. నా మనసుకే ఏదో రోగం వచ్చింది’ అన్నాడు కటువుగా.
అంత కఠినంగా అతని నోటి వెంట వచ్చిన మాటలకు ఆమె హడలిపోయింది. సున్నిత మనస్కురాలైన ఆమె ఆ మాటలను భరించలేక పోయింది. ‘నేనేం తప్పు చేశాను? ఎందుకిలా మాట్లాడుతున్నారు?’ అని అయోమయంగా అడిగింది. ‘అయ్యాయా నీ సమాజసేవలు. ప్రపంచంలో అందరి బాగోగులు చూడటం కాదు. కాస్త భర్తని కూడా చూడడం నేర్చుకో’ అన్నాడు హేళనగా. ఎన్నడూ లేనిది భోజనం కూడా చేయకుండా పడుకుండిపోయాడు. సుమ ఎంత బతిమాలినా అతను మాట వినలేదు.
పెళ్లికి ముందు చేసే పనులు ఆదర్శాలుగాను, తరువాత అవే అర్థవిహీనంగానూ అవుతాయి. బహుశా బాధ్యతలు పెరగటం, పరిధులు తగ్గటం వల్ల కావచ్చు.
తెల్లవారేసరికి అతని కోపం, చిరాకు తగ్గింది. కాని రాత్రి అలకని ఎలా వదలాలో అర్థంకాలేదు. సుమ కాఫీ ఇచ్చింది. వౌనంగానే అందుకున్నాడు.
‘చూడండి.. పెళ్లికి ముందు మీ ఆదర్శాలు, ఆశయాలు చూసి ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. చాలామంది ఆశయాలు, ఆదర్శాలతో అల్లిన నిచ్చెన ఎక్కి ఒక స్థాయికి చేరాక దానిని వదిలి వేస్తారు. బాధ్యతల బరువు మోస్తూ ఆదర్శాలు పాటించమని నేను చెప్పను. కానీ కనీసం పాటించేవారిని అడ్డుకోకుంటే చాలు. ఆలోచించండి. భర్తని నేను చెప్పినట్లే వినాలనే మూర్ఖత్వం మీకు లేదనే నా అభిప్రాయం’ తన మనసులో అభిప్రాయాన్ని సున్నితంగానే అతని ముందుంచి ఆమె గదిలోకి వెళ్లిపోయింది. కాసేపటికి అతను ఆఫీసుకు వెళ్లిపోయాడు.
రోజూ పనులన్నీ పూర్తి చేసుకుని పది గంటలకల్లా ఆశ్రమానికి వెళ్లే ఆమె పనె్నండు అవుతున్నా కదల్లేదు. అత్తగారికి ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఏమ్మా! ఈ రోజు ఆశ్రమానికి వెళ్లలేదేం?’ అని అభిమానంగా అడిగింది రుక్మిణమ్మ.
‘అవును అత్తయ్యగారూ. నేను అక్కడికి వెళుతుంటే మీ అబ్బాయి చిరాకు పడుతున్నారు’ అంది వొకింత బాధగానే.
తన భర్త గురించి అలా చెప్పాల్సి రావడం ఆమెకు బాధగా అనిపించింది.
‘మా అదృష్టంకొద్దీ మంచి కొడుకు, కోడలు దొరకడం వల్ల మా రోజులు సజావుగా సాగిపోతున్నాయి. మరి అందరూ ఉండి కూడా అందరికీ దూరంగా బ్రతుకు ఈడ్చేవారి పరిస్థితి తలచుకుంటేనే బాధగా ఉంటుంది. నువ్వు బయల్దేరి వెళ్లమ్మా. నేను బాబుకి నచ్చజెబుతాలే. నీలాంటి వాళ్ల ఆత్మీయ నీడలో వారి జీవితాలు సేదదీరుతున్నాయి. ఇంకేం ఆలోచించకు. బయల్దేరు’ అంది ఆవిడ భరోసా ఇస్తూ.
సుమ ఇంకేం ఆలోచించకుండా బయలుదేరింది.
ముందు రోజు జరిగిన గొడవతో చికాగ్గా ఉన్న ఆదిత్య ఆఫీసుకి వెళ్లాక కాస్తంత కూల్ అయ్యాడు. పాపం సుమని అంత గట్టిగా కోప్పడకుండా ఉండాల్సింది. త్వరగా ఇంటికెళ్లి ఆమెకి సారీ చెప్పి ఇక ఆశ్రమానికి వెళ్లకుండా ఉండేలా నచ్చజెప్పాలి అనుకున్నాడు.
ఇంటికొచ్చేసరికి సుమ ఆశ్రమానికి వెళ్లిందని తల్లి చెప్పింది. దాంతో అతనిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కోపం మళ్లీ రేగింది.
‘అదేంటమ్మా! మళ్లీ వెళ్లిందా? వాళ్లేమన్నా మన బంధువులా? బాధ్యతలా? వారి గురించి అంత తాపత్రయపడుతోంది? నిజమే. పెళ్లికి ముందు అంత బాధ్యతలు లేవు గనుక అన్నీ చేశాం. పెళ్లై బాధ్యతలు పెరిగాక కన్న తల్లిదండ్రులనే ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. అలాంటిది మన బాధ్యతలు మనకి చాలవా?’ ఆవేశంగా తల్లిని అడిగాడు ఆదిత్య.
‘నిజమేరా! నేను ఇవన్నీ ఆలోచించలేదు సుమా! నేనే బలవంతంగా అమ్మాయిని పంపాను. ఒక పని చేద్దాం. ఇద్దరం వెళదాం. అమ్మాయిని తీసుకొచ్చేద్దువుగాని. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడే వస్తా. వెళదాం’ అంటూనే తల్లి లోపలికి వెళ్లింది. తన గదిలో నుండి సూట్‌కేస్ తీసుకుని ఐదు నిమిషాల్లో బయటకు వచ్చి ‘పదరా’ అంది కొడుకుతో.
‘అదేంటమ్మా! సూట్‌కేస్ తెచ్చావెందుకు?’ ఆశ్చర్యంగా అడిగాడు అతను. ‘అవునురా! నువ్వే అన్నావుగా పెళ్లై బాధ్యతలు పెరిగితే తల్లిదండ్రులను వదిలి వేస్తారని. పైగా వాళ్లు మన బంధువులా అన్నావు. బంధువులైతే వెళ్లొచ్చు అనేగా నీ అభిప్రాయం. అందుకే నేను మీ నాన్నగారు కూడా అక్కడే ఉంటాం. అప్పుడు ఆమె ప్రతీరోజు మా కోసం అయినా వస్తుంది. మేం బంధువులం కాబట్టి బాధ్యతగా పంపిస్తావు కదూ?’ అని తల్లి ఆవేదనగానూ, ఆవేశంగానూ అడిగింది.
ఆదిత్య వెంటనే కారు తాళం తీసుకుని విసురుగా బయలుదేరిపోయాడు. కారు స్టార్టవగానే అతని ఆలోచనలు కూడా స్టార్టయ్యాయి. తల్లి మాటలకు ఒక్కసారిగా మనసుకు పట్టిన మంచుతెర తొలగినట్లయింది. నిజమే. ఎక్కడో దూర ప్రాంతాలలో, విదేశాలలో, చదువులతో, ఉద్యోగాలతో కొట్టుమిట్టాడే వారి తల్లిదండ్రులు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటారని, తనకి తెలిసిన వాళ్లే చాలామంది ఉంచారు. తన మీద వాళ్లందరికీ ఎంతో నమ్మకం.
రుక్మిణమ్మ కోడలికి ఫోన్ చేసి ‘అమ్మాయ్! అబ్బాయి నీ కోసం వస్తున్నాడు. కోపంగా ఉన్నాడో ఏమో! నువ్వు వాడితో ఏమీ వాదన పెట్టుకోకుండా ఇంటికొచ్చేయి’ అని హెచ్చరించింది ఆందోళనగా. ‘అలాగే అత్తయ్యా’ అంది ఆమె.
ఆదిత్య వెళుతూనే ఆశ్రమ నిర్వాహకుని రూంలోకి వెళ్లి ఐదు నిమిషాల్లో బయటకు వచ్చాడు. ‘ఇంక వెళ్దామా’ అన్నట్టు సుమ వంక చూశాడు. ఆమె వౌనంగానే తలూపింది. కారులో ఇద్దరూ ఇంటికొచ్చేశారు. అసలే ఆందోళనగా ఉన్న అత్తగారు కోడలి వంక చూసింది. ‘ఏమీ అనలేదుగా’ అన్నట్టు ‘లేదు’ అని కోడలు కళ్లతోనే చెప్పుకున్నారు.
గదిలో కెళ్లిన ఆదిత్య బట్టలు మార్చుకుని షర్టు బటన్స్ పెట్టుకుంటూ ‘పొద్దునే్న ఎనిమిదింటికల్లా తయారైతే ఆశ్రమానికి వెళ్లి అక్కడ నుండి నేను ఆఫీసుకు వెళతాను. రేపు ఆశ్రమంలో స్పెషల్స్ చేయించమని డబ్బులిచ్చాను. రేపు సుమ పుట్టిన రోజు కదా’ అన్నాడు.
అత్తాకోడళ్లిద్దరూ భోజనం సిద్ధం చేస్తున్నవాళ్లు కాస్తా ఒక్కసారిగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వాళ్ల వదనాలు ఆనందంతో వెలిగిపోయాయి. సుమ వెంటనే గదిలోకి పరిగెత్తుకెళ్లి భర్తని చుట్టేసింది సంతోషంగా. కొడుకు మనసులోని మార్పునకు తల్లి మనసు గర్వంతో పొంగిపోయింది.
*

================
శ్రీమతి ఆదిమధ్యం జానకి
డోర్ నెం.16-143,
జి-2 శ్రీ సింహాద్రి రెసిడెన్సీ
రాజాజీ మార్గ్, ప్రహ్లాదపురం
విశాఖపట్నం-27
9951 450 614

- శ్రీమతి ఆదిమధ్యం జానకి