ఈ వారం స్పెషల్

బొడ్డుతాడు... రోగాలకు ముకుతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్య రహస్యం మన శరీరంలోనే ఉంది. శరీరంలోని ప్రతి భాగంలోనూ ఉంది. వాటిలో నిబిడీకృతమైన ప్రతి మూలకణంలోనూ ఉంది. వైద్యశాస్త్రం, వైద్య విజ్ఞానం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నా అంతుబట్టని వ్యాధులు, రుగ్మతలు వేధిస్తూనే ఉన్నాయి. సరికొత్త రీతిలో పరిశోధనలు సాగించి విరుగుడును కనిపెడితే తప్ప ఈ కొత్త జాడ్యాల వైపరీత్యానికి అడ్డుకట్ట పడే అవకాశమే కనిపించడం లేదు.

మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, ప్రతికూల పర్యావరణం, చుట్టూ ఆవహించిన కాలుష్యం - అన్నింటికీ మించి సమతూక రహితమైన జీవన విధానం మానవ జీవితాన్ని వ్యథాభరితంగా, రుగ్మతల మయంగానే మారుస్తోంది. వీటన్నింటికీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ఈ వ్యాధుల మూలాన్ని పసిగట్టగలిగితే వాటి అంతు చూడటమన్నది అత్యంత సునాయాసం. ఇందుకు పరిష్కారం ఎక్కడో లేదు. ప్రతి మనిషిలోనూ ఉంది. అది పుట్టుకతోనే అంటిపెట్టుకుని ఉంది. ...ఇల్లంతా వెదికిన చందంగా సమస్య మన గుప్పిట్లోనే వుందన్న వాస్తవాన్ని గుర్తించక లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకుంటున్నాం. అయినా ఫలితం పూజ్యం. వ్యాధులు మరింత ముదురుతున్నాయే తప్ప తగ్గుతున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మూలకణ చికిత్సా విధానానికి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఇటీవలి కాలంలో విస్తృత స్థాయిలో ప్రాధాన్యత చేకూరింది. జన్మతః ఉండే బొడ్డుతాడును భద్రపరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఏ రకమైన వ్యాధినైనా క్షణాల్లో నయం చేసే అవకాశం ఉంటుందన్నది ఈ మూలకణ చికిత్సా విధానం ద్వారా వెలుగుచూస్తున్న సరికొత్త వైద్య వాస్తవం. గతంలో కూడా ఈ మూలకణానికి సంబంధించిన పరిశోధనలు జరిగినప్పటికీ అత్యంత జటిలంగా పరిణమిస్తున్న వ్యాధుల నిర్మూలన, నివారణ విషయంలో దీని అవసరం మరింతగా పెరిగింది. ఎలాంటి జటిల వ్యాధినైనా మూలకణ చికిత్స ద్వారా నయం చేయవచ్చునన్న ధీమా, నమ్మకం వైద్యుల్లోనూ, పరిశోధకుల్లోనూ సామాన్యుల్లో కూడా ఇటీవలి కాలంలో మరింతగా ఇనుమడించింది. దీనికి సంబంధించిన అవగాహన కూడా పెరగడం వల్ల మూలకణం నిబిడీకృతమై ఉన్న బొడ్డుతాడును భద్రపరుచుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఏ తల్లి అయినా తన బిడ్డ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల జీవితాన్ని కొనసాగించాలని భావిస్తుంది. అందుకు వీలు కల్పించేదే మూలకణాన్ని భద్రపరుచుకోవడం. అంటే మన భవిష్యత్ ఆరోగ్యాన్ని భద్రపరుచుకోవడమే. ఎలాంటి రుగ్మత వచ్చినా ఎంతటి జటిలమైన అనారోగ్యం తలెత్తినా బెంబేలెత్తిపోకుండా బొడ్డుతాడులో ఉన్న మూలకణాలతోనే దీన్ని సునాయాసంగా జయించవచ్చునన్న ధీమా పెరిగింది. పిల్లలు పెరిగేకొద్దీ వాతావరణ ప్రభావం, ఆహార అలవాట్లు, జీవన విధానం మొదలైన వాటి కారణంగా ఏదో రకంగా అస్వస్థతకు, రోగాలకు, జబ్బులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.
అసలు మూలకణం అంటే ఏమిటి? అన్న వౌలిక అవగాహన పెంచుకోగలిగితే దాని ప్రాధాన్యత గురించి ప్రతి విషయం కరతలామలకం అవుతుంది. ప్రతి ఒక్కరూ తమంతట తాముగానే దీన్ని భద్రపరుచుకోవడానికి ముందుకొచ్చే అవకాశమూ ఉంటుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి ఒక్కరిలోనూ ఈ అవగాహన ఇటీవలి కాలంలో పెరిగింది.
మూలకణాలు శరీరంలో అనంతంగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఒకే మూల కణంనుంచి అదే రకానికి చెందిన మిలియన్ల కొద్దీ మూలకణాలు ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ కూడా అనేక రకాలుగా ప్రత్యేకతను కలిగివున్నవే. మనందరి శరీరంలో వుండే ఈ ప్రత్యేకమైన మూలకణాలు వివిధ రూపాల్లో జీవితాంతం మనతోనే వుంటాయి. అంటే మన శరీర తత్వాన్ని బట్టి, లక్షణాన్ని బట్టి వీటి లక్షణం కూడా మారుతూ వుంటుంది. కణ విచ్ఛిత్తి ద్వారా మూలకణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అవి కొత్త శక్తిని, పునరుత్పత్తిని సంతరించుకుంటుంటాయి. దీర్ఘకాలం పాటు అచేతనంగా వున్నా కూడా ఇవన్నీ మళ్లీ కొత్త శక్తిని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒక కణం రెండుగా విడిపోయినప్పుడు కణవిచ్ఛిత్తి జరుగుతుంది. ఈ కణాలు ఇలా విడిపోవడమన్నది దీర్ఘకాలంపాటు కొనసాగే ప్రక్రియ. వాటి నుంచే ఇవి అనంతంగా పుట్టుకొస్తాయి. వీటి ద్వారానే శరీరంలో దెబ్బతిన్న ధాతువులు పునరుజ్జీవనం పొందుతాయి. శరీర అవయవాల పటుత్వానికి కూడా ఇవి దోహదం చేస్తాయి. మనిషి శరీరంలో అత్యంత కీలకమైన మెదడు వంటి కీలక భాగాలు దెబ్బతినే పక్షంలో అవి కోలుకోవడానికి కొన్ని రకాల ప్రత్యేక కణాలు అవసరమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని మూలకణాలు ఈ దెబ్బతిన్న ధాతువును తీర్చిదిద్దగలుగుతాయి. అంటే అవి సక్రమంగా పనిచేసేలా చేయగలుగుతాయి. అలాగే మెదడు పనిచేయని స్థితిలో కూడా ఈ మూలకణాల వల్ల అది తిరిగి చైతన్యం పొందడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. మూలకణాలు ఏవిధంగా భిన్న రకాల రుగ్మతలనుంచి మనిషిని కాపాడతాయన్న దానిపై దీర్ఘకాలంగానే అవగాహన ఏర్పడినప్పటికీ వీటిని కొత్త మార్గాల్లో వినియోగించుకునే దిశగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త రకాల రుగ్మతలను ఎదుర్కొనేందుకు ఈ మూలకణాలను ఏవిధంగా వినియోగించుకోవచ్చునన్న దానిపై నిపుణులు ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే వీటిని సేకరించే పద్ధతిలోనూ భిన్న మార్గాలను అనుసరిస్తూ వస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు ఎముకల మూలుగలోనే గరిష్ఠ స్థాయిలో మూలకణాలు ఉంటాయని శాస్తవ్రేత్తలు భావించారు. అలాగే గర్భస్థ పిండంలోనే ఇవి అధికంగా ఉండే అవకాశం ఉందని కూడా భావించేవారు. అయితే తాజాగా జరిగిన పరిశోధనలు ‘కార్డ్ బ్లడ్’ (బొడ్డుతాడు)లో కూడా ఎముకల మూలుగలో ఉన్నట్టుగానే అధిక పరిమాణంలో మూల కణాలు ఉంటాయని నిర్థారించారు. మిగతా శరీర భాగాలనుంచి మూల కణాలను సేకరించడం కంటే కూడా ఎలాంటి కష్టం నష్టం లేనివిధంగా బొడ్డుతాడు నుంచి మూలకణాలను సేకరించడమన్నది అత్యంత తేలికైన ప్రక్రియగా మారింది.
బొడ్డుతాడు అంటే...?
ఇటీవలి కాలంలో బొడ్డుతాడును సంరక్షించుకునే ప్రక్రియ ప్రాచుర్యాన్ని సంతరించుకోవడంతో దీన్నుంచి మూలకణాలను సేకరించడంద్వారా ఆయా శిశువుల భవిష్యత్తు ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే అవకాశాలను బలోపేతం చేస్తున్నారు. బొడ్డుతాడులో ప్రధానంగా రెండు రకాల కణాలుంటాయి. వాటిలో ఒకటి హెమాటో పొయటిక్ కణాలు కాగా, రెండోవి మెసెంచిమల్ కణాలు.
ఈ రెండు రకాల కణాలు కూడా అనేక రకాలుగా శక్తివంతమైనవి. ఇవి తమ జీవితకాలంలో భిన్న కణాలుగా రూపాంతరం చెందే లక్షణాన్ని కలిగివుంటాయి. హెచ్‌ఎస్‌సిగా పేర్కొనే హెమాటో పొయటిక్ మూలకణాలు విచ్ఛిన్నమై భిన్న రక్తకణాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. వీటినుంచే మూడు ప్రధాన రకాలుగా కణాలు ఏర్పడతాయి. ఇవి శరీరంపై అనేక రకాల ప్రభావాన్ని చూపిస్తాయి. మొదటిది ఎర్ర రక్తకణాలు. ఇవి అత్యంత సహజమైన రక్తకణం. ఎర్ర రక్తకణాల వల్ల ప్రాణవాయువు శరీరంలోని భిన్న అవయవాలకు శ్వాసకోశ వ్యవస్థ ద్వారా అందుతుంది. ఇక రెండోది తెల్ల రక్తకణాలు. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంటే ఏ వ్యాధి సోకకుండా శరీరం శక్తివంతం కావడానికి ఈ తెల్ల రక్తకణాలు అధికంగా ఉండటమన్నది ఎంతైనా అవసరం. మూడోది ప్లేట్‌లెట్స్. వీటివల్ల రక్తస్రావం జరగకుండా అరికట్టడం సాధ్యమవుతుంది. వీటితోపాటు మెసెంచిమల్ మూలకణాలు ఎక్కువగా ఎముకల మూలుగలో లభిస్తాయి. ఈ కణాలు బొడ్డుతాడులో అధికంగా ఉంటాయన్న విషయాన్ని తాజా పరిశోధనల్లో శాస్తవ్రేత్తలు గుర్తించారు. వీటిని శరీరంలో ప్రవేశపెడితే వాటినుంచి ఎముకల కణాలు, కొవ్వు కణాలు ఉత్పన్నమవుతాయి. ఎముకల కణాల ద్వారా ఎముకల పటుత్వం పెరుగుతుంది. ఎముకలు అరిగిపోవడం, దెబ్బతినడం, చిట్లిపోవడం వంటి వాటిని తగ్గించడానికి దాదాపుగా నిరోధించడానికి ఈ కణాలు తోడ్పడతాయి. ఎముకల కణాల మాదిరిగా కార్టిలెజ్ కణాలు కూడా అరుగుదలను అరికడతాయి. ఇక కొవ్వును పెంచే యాండీపో సైటెస్ అనే కణాలు కొవ్వు రూపంలో శరీరంలో శక్తిని నిల్వ వుంచుతాయి. అవసరమైనప్పుడు శరీరం ఈ శక్తిని వినియోగించుకుంటుంది. మెసెంచ్‌మల్ కణాలకు సంబంధించి జరుగుతున్న అధ్యయనం ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. వాస్తవంగా ఇది బొడ్డుతాడులోనే ఎక్కువగా లభిస్తాయి. అంటే రక్తంలో కాదన్నమాట. దేశవ్యాప్తంగా అనేక స్టెమ్‌సెల్ బ్యాంక్‌లు బొడ్డుతాడు అలాగే ధాతువు తాడులను కూడా పరిరక్షించే ప్రక్రియను చేపట్టాయి. వీటిద్వారా రోగులకు భిన్న స్థాయిలో మూలకణాలను అందించే ప్రక్రియను బలోపేతం చేశారు. శిశు జననం తర్వాత వైద్య బృందం బొడ్డుతాడును తొలగిస్తుంది. వీటిని ప్రత్యేకంగా భద్రపరుస్తారు. కార్డ్‌బ్లడ్ సంరక్షణే కాకుండా ఇటీవలి కాలంలో కార్డ్ టిష్యూ బ్యాంకింగ్ కూడా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. బొడ్డుతాడుతో పాటే దీన్నీ పరిరక్షిస్తున్నారు. కార్డ్‌టిష్యూ బ్యాంకింగ్ వల్ల వెనె్నముకకు సంబంధించిన వ్యాధులను సునాయాసంగా నయం చేసే అవకాశం ఉంటుంది.
శరీరం మూలకణాలమయం
మానవ శరీరంలోని ఏ భాగంలోనైనా మూలకణాలు లభించే అవకాశం ఉంది. అయితే అన్నిచోట్లా ఒకే పరిమాణంలో కాకుండా శారీరక భాగ పరిమాణాన్ని బట్టి ఈ మూలకణాలు లభిస్తాయి. అయితే సాధారణంగా అతి తక్కువ పరిమాణంలోనే ఈ మూలకణాలు ఉంటాయన్నది వైద్యుల నిర్ధారణ. ముఖ్యంగా అవయవాలు, ధాతువులు, రక్తం ప్రవహించే మార్గాల్లో మూలకణాలు లభించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే వ్యాధి చికిత్సలో భాగంగా శరీరంలోని అన్ని భాగాల నుంచి అంతే తేలికగా మూలకణాలను తీసేందుకు అవకాశం ఉండదు. చాలా సందర్భాల్లో ఇవి అత్యంత సంక్లిష్ట ప్రక్రియగానే మారతాయి. ముఖ్యంగా శరీర భాగాలనుంచి లేదా టిష్యూల నుంచి మూలకణాలు తీయడమంటే శాశ్వతంగా ఆ భాగాలను వాటికి దూరం చేయడమే అవుతుంది. మూలకణాలు తీసేందుకు ఆయా శరీర భాగాలనుంచి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో అదే స్థాయిలో కొన్ని సమస్యలూ తలెత్తుతాయి. ముఖ్యంగా కార్డ్‌బ్లడ్ బ్యాంకింగ్ అన్నది తక్కువ సమస్యతో కూడుకున్నది. అయితే బొడ్డుతాడు నుంచి మూలకణాలు తీయడంపై ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో విస్తృత పరిశోధనలు జరగలేదు. అయితే బయటికొచ్చిన ఆధారాలు, విశే్లషణలన్నీ సానుకూలంగానే ఉన్నప్పటికీ కార్డ్‌బ్లడ్ మూలకణాలను భద్రపరిచే విషయంలో ఇంకా ఎంతో పరిశోధనలు జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో మూలకణాలు, కార్డ్‌బ్లడ్ బ్యాంకింగ్ అన్నది ఇటీవలి కాలంలో విస్తృత ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్డ్‌బ్లడ్ బ్యాంకింగ్ అంటే ఒక శిశువు బొడ్డుతాడును సురక్షితంగా భద్రపరచడమే. ఇప్పటికే లక్షలాదిగా ఈ రకమైన సౌకర్యం అందుబాటులో ఉంది. మరో ఐదు లక్షల యూనిట్లు ప్రపంచవ్యాప్తంగా ఇందుకోసం ఆవిర్భవిస్తున్నాయి. అయితే తల్లి కాబోతున్న వ్యక్తులు వీటి ఆవశ్యకతను ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. అత్యంత కీలకమైన ఈ మూలకణాలను భద్రపరిచేందుకు ఒకేసారి అవకాశం ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఒక్కసారి వీటిని భద్రపరచగలిగితే ఆ శిశువు అమృతం తాగినట్టే. దాదాపు 80 రకాల వ్యాధులను నయం చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందనడం అతిశయోక్తి ఏమీ కాదు. దీనివల్ల ఎంత ప్రయోజనం ఉన్నా, ఎంతగా సౌకర్యాలు అందుబాటులో ఉన్నా వీటిని భద్రపరిచేందుకు అయ్యే వ్యయం మాత్రం చాలామందిని వెనుకాడేలా చేస్తోంది. ఎప్పుడో కలిగే ప్రయోజనం కోసం ఇంత భారీ మొత్తాన్ని ఇప్పుడే పెట్టాలా అన్న ఆలోచన వీరిని ముందుకు వెళ్లనివ్వడం లేదు. వీటిని భద్రపరుచుకునే తల్లిదండ్రులు వార్షికంగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని భద్రపరుచుకున్న కుటుంబమే తదుపరి వ్యాధుల నివారణకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రైవేటు బ్యాంకులు ఎంతగానో అవకాశాన్ని ఇస్తున్నాయి. అయితే తమ కోసం కాకుండా ఇతరుల కోసం ఈ రకంగా కార్డ్‌బ్లడ్‌ను అందించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అంటే పుట్టిన వెంటనే తమ శిశువు మూలకణాలను ఓ రిజిస్ట్రీకి దానం చేయడం వల్ల కూడా భవిష్యత్తులో ఎందరికో మూలకణ చికిత్సను అందించే అవకాశం ఉంటుందనేది నిజం. ఈ దిశగా కూడా విశాల హృదయంతో, సుహృద్భావంతో ముందుకొచ్చే తల్లిదండ్రుల సంఖ్య తక్కువేమీ కాదు. ఒక్కసారి ఈ మూలకణాలను ఈ విధంగా దానం చేస్తే మళ్లీ సదరు శిశువు తల్లిదండ్రులు మళ్లీ వినియోగించుకునే అవకాశం ఉండదు. అదే ప్రైవేటు బ్యాంకుల్లో వీటిని భద్రపరుచుకుంటే, అందుకయ్యే వ్యయాన్ని భరించగలిగితే అది తమ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయన్నమాట. ఈ విధంగా విరాళంగా ఇచ్చిన మూలకణాలను వివిధ రోగాల చికిత్స కోసం పరిశోధనలు చేయడానికి వైద్యులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రోగాలన్నవి ఏవిధంగానైనా రావొచ్చు. అవి వంశపారంపర్యం కావొచ్చు, ఆహార ఇతర అలవాట్ల వల్ల కావొచ్చు. జన్యుపరంగా వచ్చే వ్యాధులను కార్డ్‌బ్లడ్‌ను భద్రపరచుకోవడం ద్వారా చికిత్స చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవసరాలకు ప్రైవేటు బ్యాంకులే ఎంతగానో ఉపయోగపడతాయి. అదే వీటిని దానం చేస్తే మాత్రం సొంత అవసరాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉండదు. అంటే సదరు రోగులు ఇతరుల మాదిరిగానే అందుబాటులో ఉన్న అవకాశాన్ని వదులుకుని ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందన్నమాట. గత రెండు దశాబ్దాలుగా అమెరికా సహా అనేక దేశాల్లో ఈ రకమైన బొడ్డుతాడును భద్రపరుచుకునే ప్రక్రియ అమలులోవుంది. దీనిద్వారా అనేక రకాల వ్యాధులను చికిత్స చేయడానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు 80 రకాల వ్యాధులను నయం చేయవచ్చునని గుర్తించినప్పటికీ ఎప్పటికప్పుడు ఈ జాబితాలో చేరే వ్యాధుల సంఖ్య పెరుగుతోంది. అంటే మూలకణ చికిత్సకు ఎంత ప్రాధాన్యత ఉందో, తొలి అడుగు బలంగా పడితే ఎలాంటి వ్యాధినైనా ఎలా ఎదుర్కోవచ్చో ఇది స్పష్టం చేస్తోంది. వైద్య విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఎప్పటికప్పుడు అంతుబట్టని ఎప్పటికీ అదుపులోకి రాని జటిల వ్యాధులెన్నో తలెత్తుతూనే ఉన్నాయి. ఎబోలా సహా అనేక వ్యాధులను నయం చేసే విషయంలో ప్రపంచ వైద్య విజ్ఞానమే తలమునకలు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికీ కూడా సరైన మందులు లేక ఎన్నో జటిల వ్యాధుల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో సంజీవని లాంటి బొడ్డుతాడు పరిరక్షణ ఓ ఉద్యమంగా మారి భవిష్యత్తులో మానవాళికి ఏ రకమైన రోగం రాని ఆహ్లాదకర ఆనందకర వాతావరణానికి దారితీస్తే అంతకుమించిన సంతృప్తి ఉండదు. జనన సమయంలో తీసుకునే నిర్ణయం ఆ బిడ్డ ఆరోగ్యాన్ని శ్రీరామరక్షలా కాపాడుతుందన్నది ఇప్పటికే రుజువైంది. ప్రతి ప్రయత్నం వెనుక విమర్శ అనివార్యంగానే ఉంటుంది. అయితే ఈ రకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తే... ఈ బాటలో ప్రతి ఒక్కరూ నడిస్తే అది ఆరోగ్య భారత్ ఆవిష్కరణకు బలమైన పునాది అవుతుంది. ప్రజారోగ్యంపై వందల కోట్లను ఖర్చుపెడుతున్న ప్రభుత్వాలు తొలి దశలోనే ఆరోగ్యానికి పెద్ద పీట వేసే ఈ బొడ్డుతాడు పరిరక్షణ అంశానికి మరింత తోడ్పాటును అందిస్తే... తగిన రీతిలో జనంలో చైతన్యం తీసుకొస్తే నవభారతం ఆరోగ్యశోభితమవుతుంది.

పరిరక్షించేది ఇలా...!
బొడ్డుతాడును పరిరక్షించుకునేందుకు ఓ స్పష్టమైన వైద్య ప్రక్రియ ఉంది. ఓ పద్ధతి ప్రకారం దీని సంరక్షణ చర్యలను ఆసుపత్రులు చేపడతాయి. శిశు జననం వెంటనే బొడ్డుతాడును కత్తిరిస్తారు. అది సహజంగా జరిగేదే. ఈ ప్రక్రియ ప్రకారం ఆ బొడ్డుతాడును మరొక గదిలోకి తీసుకెళ్లి అందులోని రక్తాన్ని బయటకు తీస్తారు. దాన్ని ఓ సురక్షితమైన పాత్రలో భద్రపరుస్తారు. ఇందుకు సంబంధించి అత్యంత వౌలికమైన పద్ధతులివి. ముందుగా ఈ బొడ్డుతాడును అన్నివిధాలుగా నియంత్రిత ఉష్ణోగ్రత కలిగిన కంటైనర్‌లో ఉంచుతారు. ఇందుకు సంబంధించిన విభాగమే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ రక్తాన్ని ఉంచిన పాత్రను ఓ ప్రైవేట్ వాహనంలో స్టోరేజీ కేంద్రానికి తరలిస్తారు. ఈ రక్తం నుంచి మూలకణాలను సంబంధిత సిబ్బంది వేరుచేస్తారు. అనంతరం ఈ కణాలను దీర్ఘకాల క్రయోజనిక్ సంరక్షణ కేంద్రంలో ఉంచుతారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ మూలకణాలను వైద్య చికిత్స నిమిత్తం ఉపయోగించుకునే వీలుంటుంది.

కోల్‌కతాలో తొలి కేంద్రం
భారతదేశంలో మూలకణ చికిత్సా విధానం మొదలైనప్పటినుంచి బొడ్డుతాడు పరిరక్షణ విషయంలో అవగాహన పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వపరంగా ఈ రకమైన కేంద్రం తొలిసారిగా కోల్‌కతాలో ఆవిర్భవించింది. ఈ కేంద్రాన్ని ప్రారంభించినప్పటినుంచి తమ శిశువుల ఆరోగ్య పరిరక్షణకు గాను తల్లిదండ్రులు బొడ్డుతాడును సంరక్షించుకోవాలనే ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇలా సంరక్షించిన రక్తం నుంచి ఆ శిశువుకు ఏ వయసులోనైనా ఎలాంటి వ్యాధి వచ్చిన సులభంగా చికిత్స చేయడం సాధ్యమవుతుంది. అవి జన్మతః వచ్చిన సమస్యలైనా జన్యుపరమైనవైనా మూలకణ చికిత్స ద్వారా తేలికగానే నయం చేయవచ్చు. సాధారణ వైద్య చికిత్స ద్వారా నయం కాని వ్యాధులను ఈ బొడ్డుతాడు పరిరక్షణ ద్వారా సేకరించిన మూలకణాలను వినియోగించి నయం చేయవచ్చునని ఇప్పటికే వేలాది కేసుల్లో రుజువైంది. ఈ కేంద్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, నియంత్రణ, మార్గదర్శకాల ప్రకారమే పనిచేస్తోంది.

బ్లడ్‌క్యాన్సర్ భయం లేదు
ఇటీవలి కాలంలో అనేక రూపాల్లో కేన్సర్ వ్యాధి మానవాళి పాలిట పెను శాపంగా మారింది. పూర్తిగా ముదిరిపోయిన తర్వాత గానీ ఈ వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం లేకపోవడంతో ప్రాణాంతక దశలోనే రోగులను ఆసుపత్రులకు తీసుకురావాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. నయమవుతుందనుకున్న దశలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయిన కేసులు కోకొల్లలు. భారతదేశంలో 70 శాతానికి పైగా పిల్లలు అనేక రకాల కేన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. బొడ్డుతాడు పరిరక్షణ వల్ల సంరక్షించుకునే మూలకణాల ద్వారా బ్లడ్ కేన్సర్‌ను నయం చేయవచ్చునని కూడా రుజువైంది. ఇందుకు సంబంధించి అనేక బ్లడ్ బ్యాంకులు ఆశాసౌధాలుగానే ఆహ్వానం పలుకుతున్నాయి. మూలకణాలను తక్షణ ప్రాతిపదికన అత్యవసర పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వాసుపత్రులు, అటు ప్రైవేటు బ్లడ్‌బ్యాంకులు కూడా సమకూరుస్తున్నాయి. ముఖ్యంగా ఎర్ర రక్తకణాలను దెబ్బతీసే తలసీమియా వ్యాధి పిల్లల పాలిట అత్యంత జటిల రుగ్మతగా మారింది. ఇది సోకిన పిల్లల్లో తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇలాంటి వారికి తక్షణ ప్రాతిపదికన చికిత్స చేయడం అత్యవసరం. ఇలాంటి కేసులెన్నో బ్లడ్‌కార్డ్ పరిరక్షణ వల్ల స్వల్పకాలంలోనే నయమవుతున్నాయంటే అందుకు ఈ ప్రక్రియే కారణం. అందుకు దోహదం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యభారత్ ఆవిష్కరణలో తమవంతు సేవనందించేవారే అవుతారు.

- బి. రాజేశ్వర ప్రసాద్