ఈ వారం స్పెషల్

శోధించు.. రాణించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్కంలోనే శాస్త్రం ఉంది.
ఆ శాస్త్ర పురోగతిలో మనిషి మనుగడ ఉంది. బాల్యంనుంచి వృద్ధాప్యం వరకు మనిషి జీవితం, జీవనం ప్రశ్నలమయం. ఆ ప్రశ్న నుంచి ఉద్భవించిందే - ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తూ వేలాది కొత్త ఆవిష్కరణలను విరజిమ్ముతూ అప్రతిహతంగా సాగుతున్న సైన్స్. పుట్టుకతో ఎవరూ శాస్తవ్రేత్తలు కాలేరు. అధ్యయనమే గీటురాయిగా, పరిశోధనే కొలమానంగా జీవితాలను తీర్చిదిద్దుకోగలిగినవారే ప్రపంచ గతిని, గమనాన్ని మార్చగలుగుతారు. ఈ అవకాశం ఒక్క విద్యార్థి లోకానికే ఉంది. విద్యార్థుల్లో తర్కం ఎంతగా రాణిస్తే ప్రశ్నించే గుణం ఎంతగా పరిమళిస్తే, పరిశోధనా జిజ్ఞాస అంతగా ఇనుమడిస్తుంది. ఇది భారతదేశమైనా కావొచ్చు, అమెరికా అయినా కావొచ్చు. భవిత విద్యార్థులదే. వారిలో పెంపొందే శాస్త్ర పరిశోధనా పాటవానిదే. భిన్నరంగాల్లో కొత్త పుంతలు తొక్కుతున్న భారత్ సైన్స్ టెక్నాలజీలోనూ అందె వేసిన చేయిగా మారాలి. దేశ విదేశాల్లో జరుగుతున్న సైన్స్ టాలెంట్ పోటీలు ఇందుకు స్ఫూర్తి, దీప్తి కావాలి. ప్రధాని మోదీ చెప్పినట్లుగా దేశంలోని స్కూళ్లతో పరిశోధనా రంగాలు అనుసంధానమైతే పరిశోధనా సాగరాన్ని దాటేందుకు బలమైన వారధి ఏర్పడినట్లే. ఇటీవల న్యూజెర్సీలో జరిగిన సైన్స్ టాలెంట్ పోటీలో భారత సంతతి బాలిక ఇంద్రాణి దాస్ జూనియర్ నోబెల్‌ను దక్కించుకోవడమే ఇందుకు ఉదాహరణ. అంతేకాదు, మరో నలుగురు విద్యార్థులు టాప్ టెన్‌లో నిలిచి భారత ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు.

మనిషి మేధస్సు అనంతం. ఆలోచనే ప్రగతికి, ప్రతిభకు దివిటీ. సమకాలీన సవాళ్లను అధిగమిస్తూ సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ అనునిత్యం కొత్తదనంతో ముందుకు దూసుకుపోవడమే ఆశయంగా మానవ జీవనం సాగుతోంది. దాని ఫలితంగానే క్షణానికో కొత్త ఆవిష్కరణ దర్శనమిస్తోంది. జీవన శైలిలోనూ విధానంలోనూ అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ మార్పులను ఔపోసన పడుతూ మరింత ముందుకు దూసుకుపోవాలన్న జిజ్ఞాసే నాగరిక సమాజాన్ని నవ నాగరికం చేస్తోంది. వీటన్నింటి వెనుక ఉన్నది మెరుగైన జీవనాన్ని, జీవితాన్ని అందిపుచ్చుకోవాలన్న ఆరాటమే. అందుకే విద్య, వైజ్ఞానిక పరంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవ జీవనం నవనవోనే్మషంగా సాగుతోంది. అంతరిక్షంలోనూ విహరిస్తూ అనంతమైన రోదసిని శోధిస్తోంది.
రాకెట్ ప్రయోగించినా, ఇతర గ్రహాలను అందిపుచ్చుకున్నా అందుకు కారణం అవధుల్లేని మేధస్సే. ఆ మేధస్సుకు పదును ఎప్పటికప్పుడు తర్కం నుంచే పుడుతోంది. ఓ ప్రశ్నకు సమాధానం దొరికితే ఆ సమాధానం నుంచి మరో ప్రశ్న ఉదయించడం, దానికీ జవాబును అందుకోవడంలోనే మనిషి గతి, ప్రగతి, మనుగడ ఆధారపడి ఉన్నాయి.
వీటన్నింటికీ ఆలంబన తొలి అడుగులో అక్షరాలు దిద్దించే పాఠశాలలే. అనంతర పయనంలో విజ్ఞానాన్ని బోధించే కళాశాలలు, విశ్వవిద్యాలయాలే. అందుకున్న వాడికి అందుకున్నంత అన్నట్లుగా భారతీయ విద్యా విజ్ఞాన భాండాగారం అందుబాటులో వుంది. ఎవరు ఎంతగా బావినుంచి నీరు చేదినట్లుగా ఈ విజ్ఞాన సౌధాన్ని అందిపుచ్చుకోగలిగితే అంతగానూ మేధస్సు పరిమళిస్తుంది. కొత్త ఆలోచనలకు దారులు తీస్తుంది. ఇవే సరికొత్త విజ్ఞాన వీచికల ఆవిష్కరణకు ఆలంబన అవుతాయి. తదుపరి పరిశోధనలకు లక్ష్యాల నిర్దేశనకు కొలమానంగా నిలుస్తాయి. ఆలోచన మనిషి ప్రతి అడుగులోనూ ఉంది. బాల్యం, శైశవం, యవ్వనం, వృద్ధాప్యం - ప్రతి దశలోనూ మనిషి ఆలోచన భిన్న రీతుల్లోనే ఉంటుంది. అది శాస్ర్తియం కావచ్చు, ఆశాస్ర్తియం కావచ్చు, వాస్తవికం కావచ్చు, ఊహాజనితం కావచ్చు. ఏదైనా ఆలోచన అన్నది మనల్ని నడిపిస్తుంది. మన నడవడికను తీర్చిదిద్దుతుంది. ఈ జిజ్ఞాసకు ఆలోచనకు శాస్ర్తియత తోడైతే అద్భుతాలకే ఆస్కారం ఉంటుంది. జన్యుపటాన్ని ఆవిష్కరించినా, మానవ శారీరక నిర్మాణాన్ని అంగుళం అంగుళం అధ్యయనం చేసినా, వృక్ష, జంతు జాతులపై పరిశోధనలు చేసినా - ఇదంతా శాస్త్ర, సాంకేతిక పటిమే. ఎప్పటికప్పుడు దీనికి సాన పెట్టుకోవడం వల్లే మనిషి జీవితం మరింత మెరుగ్గా, మరింత ఆనందంగా, మరింత వెసులుబాటుతో సాగుతోంది. శాస్త్ర విజ్ఞానమే భవి
తకు పునాది. వర్తమానంలో దీనికి ఎంతగా పదును పెట్టుకుంటే అంతగానూ రాణించే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తి పతాకను అంతర్జాతీయంగా ఎగురవేసిన శాస్తవ్రేత్తలు ఎందరో ఉన్నారు. నేటి తరంలో కూడా అగ్రరాజ్యమైన అమెరికాతోపాటు అనేక దేశాలు శాస్త్ర సాంకేతికపరంగా తలమానికం కావటానికి దోహదం చేసిన, చేస్తున్న వ్యక్తుల్లో భారతీయులదే అగ్ర తాంబూలం. అపారమైన యువశక్తి, అద్భుతమైన ప్రతిభా పాటవం, దేన్నైనా విడమరిచి విశే్లషించగలిగే అధ్యయన నైపుణ్యం భారతీయుల సొంతమనడంలో అతిశయోక్తి ఏమీ కాదు. ప్రపంచ దేశాలన్నీ ఈర్ష్య పడేంతగా భారత్‌లో యువశక్తి మేటవేసింది. ఎంతగా దేశంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రాథమిక దశనుంచీ పాదుకొల్పగలిగితే అంతగానూ భారతావని ఖ్యాతి జగత్ ప్రసిద్ధమవుతుంది.
ఏటేటా మనం సైన్స్ కాంగ్రెస్‌లు నిర్వహిస్తున్నాం. ఉపన్యాసాలు ఉపోద్ఘాతాలతోనే కాలక్షేపం చేయకుండా శాస్త్ర విజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయినుంచి విద్యార్థుల్లో పాదుకొల్పే ప్రయత్నం చేయాలి. ఓ వ్యక్తి రాణించడానికి, రాణించకపోవడానికి భిన్న రంగాల్లో తన ప్రతిభా సంపత్తులను చాటుకోవడానికి, చాటుకోలేకపోవడానికి కేవలం అవకాశాలు రాకపోవడమే కారణం. అలాంటి అవకాశాలను అందరికీ అందుబాటులోకి తెస్తే శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ భారతదేశం నిరుపమానమే అవుతుంది. పరిశోధనే శాస్త్ర విజ్ఞానానికి సోపానం. సరికొత్త ఆవిష్కరణలకు ఇక్కడే అంకురార్పణ జరుగుతుంది. ఉన్నదానితో సరిపెట్టుకుంటే జీవితం అక్కడితో ఆగిపోతుంది. ఓ కవి అన్నట్లుగా సాధించినదానితో సంతృప్తి చెంది అదే విజయమనుకుంటే పొరపాటే. అంటే ఈ పరిశోధనా జిజ్ఞాస ఎప్పటికప్పుడు కొత్త పుంతలు వేయాలి. కొత్త సొబగులను సంతరించుకోవాలి. నిత్యం కొత్తదాని కోసం కొత్త ఆవిష్కరణల కోసం తాపత్రయపడే ఆసక్తికి ప్రేరణ కావాలి. ముఖ్యంగా నేటి విద్యార్థులే రేపటి పౌరులని మనం వారి గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు. ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లోనూ పోటీని తట్టుకునే విధంగా వీరిని తీర్చిదిద్దడంలోనే అంతిమ విజయం ఆధారపడి ఉంటుంది.
(మిగతా 13వ పేజీలో)

శోధించు... రాణించు
(7వ పేజీ తరువాయ)
ఇంతకీ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సముపార్జనలో భారత్ సాధించిందేమిటి? వర్తమాన ప్రపంచంలో దాని స్థానమేమిటన్నది కూడా ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అంశమే. ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా విద్యార్థి దశనుంచి పిల్లల్లో పరిశోధనా జిజ్ఞాసను పెంపొందించేందుకు భారీగానే నిధులు కేటాయిస్తూ వచ్చాయి. మొక్కుబడి చందంగా కాకుండా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతాయుతమైన రీతిలో పరిశోధనలు జరిపి కొత్త ఆవిష్కరణలు చేయాలన్నదే ఇంత భారీగా నిధులు కేటాయించడం వెనుక ముఖ్యోద్దేశం. దేశంలో లెక్కకు మిక్కిలిగానే సాంకేతిక సంస్థలున్నా వాటి ప్రామాణికత మాత్రం అరకొర చందంగానే ఉన్నది. పేరుకు మాత్రమే సాంకేతిక సంస్థలుగా నెలకొల్పినా బోధనాపరంగా వీటివల్ల విద్యార్థులకు ఒరిగిందేమీ లేదన్న వాస్తవం ఈ తరహా అనేక సంస్థలు మూతపడిన వాస్తవాన్ని బట్టి అర్థమవుతున్నది. ఖర్చుపెట్టిన ప్రతి పైసాకు తగిన ఫలితం ఉంటేనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయులు కొత్త పుంతలు తొక్కగలుగుతారు. అంటే ఈ తరహా పరిశోధనాసక్తిని పాఠశాల స్థాయినుంచే విద్యార్థుల్లో పెంపొందించగలిగితే క్రమానుగతంగా వారు ఎదగడానికి తాము ఎంచుకున్న రంగంలో ఆసక్తితో ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకమైన పరిశోధనా రంగంలో అమెరికా తదితర దేశాలతో పోటీపడాలంటే వాటితో సమానంగా కొత్త విజ్ఞాన వీచికలు సాధించాలంటే అందుకు తగ్గట్టుగా ప్రాథమిక స్థాయినుంచి విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపట్ల ఆసక్తిని పెంపొందించాలి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే ఈ రంగంలో ఎంతగానో ముందుకు దూసుకుపోయాయి. భారతదేశ శాస్త్ర పరిశోధనా రంగంలో, రోదసీ విజ్ఞానంలో ఇస్రో సాధించిన విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకం. మనకంటూ మనం సొంతంగానే వాయువేగంతో పయనించే తేజాస్‌ను రూపొందించుకోగలిగాం. అదేవిధంగా టెక్నాలజీపరంగా ఇతర రంగాల్లోనూ మన ముద్ర వేసుకోగలిగాం. ఆవియోనిక్స్ రంగంలోనూ మన శాస్తవ్రేత్తలు రష్యాకంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించారు. ఇక ఉపగ్రహాలు, క్రూయిజ్ క్షిపణులు, క్షిపణి రంగంలో కూడా మనం ఆరితేరిపోయాం. అయితే ఈ రంగాల్లో పూర్తిస్థాయిలో భారత్ స్వయం ప్రతిపత్తిని, స్వయం సమృద్ధిని సాధించాలంటే పరిశోధనాపరంగా మరిన్ని పటుతరమైన చర్యలను చేపట్టాలి. కొత్త తరం శాస్తవ్రేత్తలను జగతికి అందించే రీతిలో భారతీయ విద్యార్థులను తీర్చిదిద్దగలగాలి. దేశ ఆర్థిక వ్యవస్థ అన్నివిధాలుగా ఇనుమడిస్తోంది. ఒకప్పుటి ఆకలి మంటలు ఇప్పుడు అవకాశాల కోసం అర్రులు చాస్తున్నాయి. ప్రతి పౌరుడు కూడా తనదైన శైలిలో, తనదైన రీతిలో ముందుకు సాగాలని, తాను ఎంచుకున్న రంగంలో అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షిస్తున్నాడు. నిన్నటి తరానికి నేటి తరానికి ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ ఎంతో తేడా ఉంది. ఇక రాబోయే తరానికి నేటి తరానికి మధ్య ఈ అంతరం కచ్చితంగా ఉంటుంది. అంటే కొత్త తరం మరింతగా దూసుకుపోవడానికి తాము ఎంచుకున్న మార్గంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. అలాంటి అవకాశాలు మిగతా రంగాల్లో వున్నా శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మించిన వేదిక మరొకటి లేదు. సైన్స్ కాంగ్రెస్‌లు, సైన్స్ టాలెంట్ పోటీలు నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఇదే. బాలల్లో ఈ రకమైన ఆలోచనను పాఠశాల దశనుంచే పాదుకొల్పాలన్నది, అందుకు అవసరమైన రీతిలో ప్రోత్సాహాన్ని అందించాలన్నది వీటి ఉద్దేశం. ఇప్పటికే అమెరికాతో పోటీగా ఇటు సాఫ్ట్‌వేర్, అటు హార్డ్‌వేర్ రంగాల్లో భారత్ ఎన్నో ఆవిష్కరణలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించడానికి ఇది ఎంతగానో దోహదం చేసింది. అయితే, భవిష్యత్తు అన్నది కచ్చితంగా ఈ రంగాల ఆలంబనగానే సాగుతుందన్న ది వాస్తవం.
ఇప్పటికే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్ర భాగాన ఉన్న దేశాల జాబితాలో చేరిన భారత్ మరింత పైకి దూసుకుపోవాలంటే దేశంలో పరిశోధన రంగం మరింతగా వేళ్లూనుకోవాలి. ప్రాథమికమైన విజ్ఞానమన్నది వినూత్న ఆవిష్కరణలకు దారితీయాలంటే అందుకు తగ్గ రీతిలో పరిశోధనా రంగం వ్యవస్థీకృతం కావాలి. అంటే ప్రాథమిక దశలోని ఈ ఆసక్తి విద్యార్థులకు తదుపరి అడుగులు వేయడాని కి దోహదం చేసే విధంగా అన్ని వైపులనుంచి ప్రోత్సాహం లభించాలి. అందుకు తగ్గ రీతిలో దేశంలోని పరిశోధనా రంగాలను మేళవించి ఎప్పటికప్పుడు వాటి సారాంశాన్ని అందించగలగాలి. అంటే ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లుగా దేశంలోని అన్ని పాఠశాలలతోనూ ఈ పరిశోధనా విభాగాలు అనుసంధానమైతేనే ఇది సాధ్యమవుతుంది. తిరుపతిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ ఈ దిశగా తొలి అడుగు వేసింది. భవిష్యత్తు శాస్తవ్రేత్తలు భారత్ నుంచే రావాలంటూ మోదీ, శాస్త్ర పరిశోధనా రంగంలో నోబెల్ బహుమతి తెస్తే కోట్లాది రూపాయలు బహుమతిగా ఇస్తానంటూ చంద్రబాబు చెప్పడం వెనుక ఉద్దేశం - బాల్య దశలోనే పిల్లల్లో పరిశోధనల పట్ల, సైన్స్ అధ్యయనం పట్ల ప్రేరణను కలిగించడమే.
పాఠశాల దశలోనే శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచుకుని స్వయం ప్రకాశంతో రాణించిన భారతీయ విద్యార్థులకు కొదవ లేదు. ఎన్నో అంతర్జాతీయ సైన్స్ శిఖరాగ్ర సదస్సుల్లో అవార్డులు సాధించి ఎందరో విద్యార్థులకు మార్గదర్శకులయ్యారు. భారతీయ సంతతికి చెందిన విద్యార్థులెందరో అమెరికా సహా అనేక దేశాల్లో తమ పటిమను చాటుకున్నారు. అందుకు కారణం అక్కడ విద్యార్థులకు లభిస్తున్న ప్రోత్సాహమేననడం అతిశయోక్తి ఏమీ కాదు. అదే స్థాయిలో దేశంలోని అన్ని పాఠశాలలను తీర్చిదిద్దగలిగితే సరైన బోధనా సిబ్బందిని అందించగలిగితే దేశీయంగా ఈ శాస్త్ర పరిశోధనా పాటవం మొగ్గ తొడుగుతుంది అనంతర పరిశోధనలతో వికసించి ప్రపంచ విద్యార్థి లోకానికే కొత్త వెలుగును అందిస్తుంది. సరికొత్త శాస్త్ర పరిశోధనా బాటలో ముందుకు వెళ్లేందుకు దోహదం చేస్తుంది. మరెందరో బాల శాస్తవ్రేత్తలు ప్రపంచ శాస్త్ర విజ్ఞాన అవనికపై భారతీయ ప్రతిభను మరింతగా ఇనుమడింపజేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

‘జూనియర్ నోబెల్’ ఇంద్రాణి దాస్

సూర్యుడిలా ప్రకాశించాలంటే, ముందు సూర్యుడిలా ప్రజ్వలించు - ఈ మాటలన్నది ఎవరో కాదు.. భారత అణు శాస్తవ్రేత్త ఎపిజె అబ్దుల్ కలామ్. ఈ లక్షణం బాల్యంలోనే అలవడితే ఎంతటి అద్భుతాలనైనా ఆవిష్కరించవచ్చనేందుకు అంతర్జాతీయ సైన్స్ టాలెంట్ పోటీల్లో భారత సంతతి బాలలు చూపిన ప్రతిభే ఉదాహరణ. భారతీయ శాస్తవ్రేత్తలకు నోబెల్ బహుమతి అందని ద్రాక్షగా ఊరిస్తుంటే, జూనియర్ నోబెల్ బహుమతిని భారత సంతతి బాలిక సాధించి రికార్డు సృష్టించింది. అమెరికాలో ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక రీజెనెరాన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ పోటీలో భారత సంతతి బాలిక ఇంద్రాణి దాస్ అగ్రభాగాన నిలిచి ఏకంగా జూనియర్ నోబెల్‌ను సాధించింది. ఈమెతో మరో నలుగురు భారత సంతతి బాలలు టాప్ టెన్‌లో నిలిచి భారత వైజ్ఞానిక ప్రతిభను ప్రపంచానికి చాటారు. 1942 నుంచి నిరాఘాటంగా సాగుతున్న ఈ సైన్స్ టాలెంట్ సెర్చ్ పోటీలను జూనియర్ నోబెల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ప్రతి ఏటా వివిధ దేశాలకు చెందిన 1700మంది హైస్కూల్ విద్యార్థులు పోటీపడుతుంటారు. ఈ ఏడాది జరిగిన పోటీల్లో ఫైనల్స్‌కు 40మంది విద్యార్థులు ఎంపిక కాగా, వీరిలో 14మంది భారత సంతతివారే. ప్రథమ బహుమతితో పాటు మరో నలుగురు భారత సంతతి విద్యార్థులు టాప్ టెన్‌లో నిలిచి ఔరా అనిపించారు.
ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన విద్యార్థుల్లో అగ్రభాగాన నిలిచి జూనియర్ నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఇంద్రాణి దాస్ (18) న్యూజెర్సీ నివాసి. మెదడుకు తగిలిన గాయాలవల్ల కానీ, నాడీవ్యవస్థ క్షీణతవల్ల కానీ న్యూరాన్లు దెబ్బతినకుండా ఎలా కాపాడుకోవచ్చనే దానిపై ఆమె చేసిన పరిశోధన జూనియర్ నోబెల్‌ను సాధించిపెట్టింది. అల్జీమర్స్, పార్కిన్సన్ తదితర వ్యాధులు సోకినప్పుడు మెదడుకు చెందిన కీలక న్యూరాన్లు నశించిపోతాయి. ఈ న్యూరాన్లకు రక్షణగా నిలిచే ఆస్ట్రోసైట్స్ సరిగా స్పందించేలా చేయగలిగితే న్యూరాన్లను రక్షించవచ్చని ఇంద్రాణి చేసిన ప్రయోగం ఈ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకుగాను 2,50,000 డాలర్ల బహుమతిని గెలుచుకుంది.
మూడో బహుమతిని ఇండియానాకు చెందిన అర్జున్ శ్రీనివాసన్ (18) చేజిక్కించుకున్నాడు. బహుమతి మొత్తం 1,50,000 డాలర్లు. ఇక టాప్‌టెన్‌లో నిలిచిన అర్చనా వర్మ (17) న్యూయార్క్‌వాసి. బహుమతి మొత్తం 90,000 డాలర్లు. వర్జీనియాకు చెందిన ప్రతీక్ నాయుడు, ఆర్లాండోకు చెందిన వ్రిందా మదన్ కూడా టాప్‌టెన్‌లో నిలిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న మొత్తం విద్యార్థుల్లో 40మంది ఫైనల్స్‌కు చేరుకున్నారు. వీరిలో 14మంది భారత సంతతివారే. అమెరికా జనాభాలో కేవలం ఒక్క శాతంగా భారత సంతతి నుంచి 14మంది ఫైనల్స్‌కు ఎంపిక కావడం, వారిలో ఐదుగురు టాప్ టెన్‌లో ఉండటం భారత సంతతి విద్యార్థుల సృజనకు నిదర్శనం.

ఒకేరోజు...
44,000మంది విద్యార్థులు
35,000 ప్రయోగాలు

రికార్డు సృష్టించిన బస్తర్

బస్తర్... ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకొచ్చేది మందుపాతరల పేలుళ్లు, మృతులు! మావోయిస్టుల ప్రభావిత రాష్టమ్రైన చత్తీస్‌గఢ్‌లో హింసకే కాదు, సృజనకూ చోటుందని చాటారు అక్కడి అధ్యాపకులు, విద్యార్థులు. ఒకే రోజు బస్తర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏకకాలంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించి చరిత్ర సృష్టించారు. 637 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 44వేలమంది విద్యార్థులు పాల్గొని 35వేల ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించి తమ సృజనను చాటారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లాలో 119 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు సైన్స్ పరిశోధనల్లో తమకున్న అభిరుచిని బయపెట్టారు. అన్ని విభాగాల్లో విద్యార్థులు తమ ప్రయోగాలను ప్రదర్శించారు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు, పరిశోధనలద్వారా వారిలో దాగిన సృజనను వెలికి తీసేందుకు జిల్లా కలెక్టర్ అమిత్ కటారియా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నైపుణ్యం, ఆసక్తి కలిగిన 24మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి ‘స్పెషల్-24’ బృందంగా ఏర్పరిచారు. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారని, భారతదేశంలోనే ఇది తొలి అతిపెద్ద వైజ్ఞానిక ప్రదర్శనగా నిలుస్తుందంటారు అమిత్ కటారియా. దేశ సైన్స్ విద్యలో ఇదొక అరుదైన రికార్డుగా ఆయన అభివర్ణించారు.

నా లక్ష్యం ఫిజిషియన్-సైంటిస్ట్: ఇంద్రాణి
‘నువ్వేం చేస్తావో మాకు తెలియదు, కానీ డాక్టర్ చదవడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ కావొద్దు. ఎందుకంటే అది చాలా ఖరీదైన విద్య’ - ఇదీ ఇంద్రాణి తల్లిదండ్రుల మాట. ఈ మాటలే ఇంద్రాణిని రెచ్చగొట్టాయి. వారి భావనపై ఏకంగా తిరుగుబాటే చేసింది. ‘ఎలాగైనా నేను డాక్టర్‌ని కావాలి’ అని అప్పుడే నిర్ణయించుకుంది. అందుకే తనను తాను ‘రెబల్’గా అభివర్ణించుకుంది కూడా. ఇంద్రాణి తల్లిదండ్రులు విద్యుత్, తనీమాదాస్. కోల్‌కతాకు చెందిన వీరు అమెరికాలో వృత్తిరీత్యా బ్యాంకర్లు. తల్లిదండ్రుల అభీష్టాన్ని ధిక్కరించినా డాక్టర్ కావాలన్నది ఇంద్రాణి కల. వైద్య వృత్తితో పాటు పరిశోధనలు కూడా చేయాలన్నది ఆమె లక్ష్యం. ఫిజిషియన్-సైంటిస్ట్‌గా తన కెరీర్‌ను మలుచుకుంటానని, అది నా జీవిత ఆశయమంటోంది జూనియర్ నోబెల్ గ్రహీత ఇంద్రాణి.

నిన్నటి తరానికి నేటి తరానికి ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ ఎంతో తేడా ఉంది. ఇక రాబోయే తరానికి నేటి తరానికి మధ్య ఈ అంతరం కచ్చితంగా ఉంటుంది. అంటే కొత్త తరం మరింతగా దూసుకుపోవడానికి తాము ఎంచుకున్న మార్గంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. అలాంటి అవకాశాలు మిగతా రంగాల్లో వున్నా శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మించిన వేదిక మరొకటి లేదు. వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ టాలెంట్ పోటీలు, సైన్స్ కాంగ్రెస్‌లు, నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఇదే.

- బి. సుధ