స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

అన్నింటినీ సృజించి జీవులకు ప్రసాదించేవాడు ఆ ఒక్క పరమాత్మ మాత్రమే. అంతేకాదు. అసలు భగవంతుడు సమస్త విశ్వాన్ని సృజించినది ఆ విధంగా కోరే జీవులకోసం మాత్రమే. భోగమోక్షాల కొఱకే దృశ్యమానమైన ఈ ప్రపంచమంతా సిద్ధమైయుంది.
‘్భగ పవర్గార్థం దృశ్యమ్’ (యో.ద.2-18) అన్న సూత్రం ఈ వేదమంత్రార్థాన్ని సమర్ధించే సూత్రమే. పతంజలి యోగదర్శనంలోని 1-25 సూత్ర వ్యాఖ్యానమైన ‘తస్యాత్మానుగ్రహాభావే- పి భూతానా మనుగ్రహః ప్రయోజనమ్’పరమాత్మకు స్వయంగా ఏ ప్రయోజనంలేకున్నా విశ్వాన్ని సృజించింది కేవలం జీవుల భోగమోక్షాల ప్రయోజనం కొఱకు మాత్రమే అని వ్యాసుడు భారత గ్రంథకర్త కాదు) చెప్పిన రీతిగా విశ్వసృష్టి జీవుల కల్యాణార్థమే.
తల్లిదండ్రులు తమ బిడ్డల ఆనందానికి అనేక వస్తువులను సమకూర్చుతారు. కాని అవి వారికి సమకూర్చింది భగవంతుడే కదా. అందుచేత నిజమైన తండ్రి- ఆ తండ్రికి తండ్రి కూడ జగత్పితరుడే.
అందుకే ఈ మంత్రం ‘సఖాపితా పితృతమః పితృణమ్’ఆయన తండ్రి - మిత్రుడే కాదు. వారితోబాటు అందరను సంరక్షించేవాడు పరమాత్ముడే అని స్పష్టపరచింది.
వేదమంతటితో సంతృప్తిపడలేదు. ఆ జగద్రక్షకుడు ఎలా రక్షిస్తాడో కూడ వివరించింది. జీవితంలో మనిషికి నిప్పు-నీరు- గాలి -నేలల వలన తరచుగా ప్రమాదం మరియు భయాలు సంభవిస్తూ ఉంటాయి. అట్లే నదులు- చెరువులు- పర్వతాలు సముద్రాలు కూడ భయోత్పాతాలకు గురిచేస్తాయి. ఆ విధంగా అవి ఎన్నిసార్లు జీవులను భయభ్రాంతుల్ని చేసినా అన్నిసార్లు రక్షించేందుకు జీవులముందు ఏదోరూపంలో ఆ భగవానుడు ఆర్తత్రాణ పరాయణుడై దర్శనమిస్తాడు.
‘త్రాతా నో బోధి దదృశానః’అని వేదం జగద్రక్షకుని రక్షక దక్షతను ప్రశంసించింది.
కుటుంబంలో భేదాభిప్రాయాలు పొడసూపితే కుటుంబ పెద్ద అలిగి తన బాధ్యతలను విడిచివెళ్లిపోతాడు. దీనజన బాంధవుడైన భగవంతుడట్టివాడు కాడు. ఆయన జీవుల చేతినెన్నడూ వీడడు. అందుకే ఈ మంత్రము భగవంతుణ్ణి జీవులకు ‘ఆపిః’ ఆప్తబంధువంది.
వేదమే మరో సందర్భంలో ఇదే విషయాన్ని ఇలా పునరుద్ఘాటించింది. ‘సనో బంధుర్జనితా స విధాతా’ ఆయనే జీవులను సృజించేవాడు. సుఖప్రదాత. ఆత్మబంధువు అని. లోకంలో బంధువులెవరైనా ఏదో ఒక ప్రయోజనంతో ముడిపడిన వారే. వారందరూ పరమేశ్వరుడి వలె సత్యమైన బంధువులు కారు.
జీవితంలో తప్పుచేయని వాడెవడుంటాడు? అప్పుడు మనస్సులోనుండి నీవు తప్పుచేసావన్న హెచ్చరిక ఆరంభమవుతుంది. అది ఎవరిదోకాదు. సాక్షాత్తు అంతర్యామియైన పరమాత్మదే. అందుకే వేదం విధాతను ‘అభిఖ్యాతా’ ఎదురుగా కూర్చుని హితవునుపదేశించే జ్ఞానబోధకుడని పేర్కొంది. నిజమైన బంధువు లక్షణమిదే. అతడు మిత్రుడై చెడుమార్గంలో పోయేవాడిని కనిపెట్టుకొని సన్మార్గంలోపెట్టి రక్షిస్తాడు. ఋగ్వేదం మిత్ర లక్షణాన్ని చెబుతూ ‘సఖా సఖాయ మతరద్ విషూచో?’ (ఋ.7-19-6) మిత్రుడు మిత్రుణ్ణి విషమ దశనుండి రక్షిస్తాడని వర్ణించింది.
పరమాత్ముడు సర్వజ్ఞుడు. జీవులకు సంభవించే సమ-విషమ పరిస్థితులేవో ఆయనకు తెలుసు. జీవులకు విషమ పరిస్థితులు సంభవిస్తున్నాయని ఆయన గ్రహించినంతనే చైతన్యవంతుల్ని చేస్తాడు. మేల్కొల్పుతాడు. మిత్రధర్మాన్ని నిర్వహిస్తాడు. అందుకే వేదం శాంతికాముకులకు- మహాత్ములకు శాంతి ధనాన్ని అనుగ్రహిస్తాడు. ‘మర్దితా సోమ్యానామ్’ అని వివరించింది.
మరి నిజమైన తండ్రి, బంధువు, సంతోషప్రదాయకుడు, సంరక్షకుడు, హితప్రబోధకుడు, మిత్రుడు అయిన సర్వజగద్రక్షకునికి మనం ప్రేమపాత్రులం కావలదా?
***