కృష్ణ

తలిదండ్రుల పేర్లూ రాయలేని స్థితిలో విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 26: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించే ప్రభుత్వ లక్ష్యాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని డీఈఓ ఎ సుబ్బారెడ్డి అన్నారు. ప్రాధమికోన్నత విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ చేపట్టిన చైతన్యం కార్యక్రమంలో శుక్రవారం తోట్లవల్లూరులో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతు ప్రాధమికోన్నత పాఠశాలలో చిన్నారులకు సక్రమైన విజ్ఞానాన్ని అందించటంలో ఉపాధ్యాయులు విఫలమవుతున్నారని, అందువల్లే 1 నుంచి 5 వరకు తరగతుల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న తరగతుల నుంచే ఎప్పుడైతే నాణ్యమైన విద్యను అందిస్తారో, అప్పుడు పిల్లలను చేరిక పెరుగుతుందని, దానిని గుర్తించి బాధ్యత ఎరుగాల్సింది ఉపాధ్యాయులేనని అన్నారు. గత 30 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 నుంచి 8 వరకు ప్రభుత్వ పాఠశాలలకు సుమారు 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టిందని, కాని ప్రభుత్వ పాఠశాలు అభివృద్ధి చెందలేదన్నారు. జిల్లా ఈ సంవత్సరం 115 పాఠశాలలు ముతపడ్డాయని, అందులో తోట్లవల్లూరు మండలంలో రెండు పాఠశాలలు ముతపడ్డాయని తెలిపారు. దీనివల్ల విద్యావ్యవస్థ పతనమైన పరిస్థితి నెలకొందన్నారు. ప్రాధమికోన్నత పాఠశాలలో సరైన విద్యను అందిచకపోతే వారు 6వ తరగతిలో ఏ విధంగా చదువుతారని పేర్కొన్నారు. మనం ఉద్యోగం చేస్తు మన పిల్లలను చదివించుకోవటమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సక్రమైన విద్యను అందిస్తే వారు జీవితంలో రాణిస్తే మీరు పేరు చెప్పుకుంటారని సూచించారు. కాని మన జిల్లాలో కొన్నిచోట్ల తప్ప అన్నిచోట్ల కనీసం చిన్నారులు తల్లిదండ్రుల పేర్లు కూడా రాయలేక పోతున్నారంటే మనం ఎటుపోతున్నామో అర్థం కావటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థికి నాణ్యమైన బోధన అందించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ టి రామదాస్, సిఎం రామారావు, ఎంఇఓ కృష్ణదిలీప్, ఎంపిడిఓ ఈశ్వరపద్మసుధ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వీధి లైట్ల కాంట్రాక్ట్ వ్యవహారంలో వైస్ చైర్మన్ అభ్యంతరం

గుడివాడ, ఫిబ్రవరి 26: గుడివాడ మున్సిపాలిటీలో వీధి లైట్ల నిర్వహణ కాంట్రాక్ట్ వ్యవహారంపై మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జి పలు అభ్యంతరాలను కౌన్సిల్ ముందుంచారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. వీధి లైట్ల నిర్వహణ కాంట్రాక్ట్ వ్యవహారంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వకుండా, కౌన్సిల్ తీర్మానం లేకుండా టెండర్లు ఎలా పిలుస్తారని కౌన్సిల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ అధికారులను నిలదీశారు. కాంట్రాక్ట్ పద్ధతిపై 12 మందిని నియమించడం, రెన్యువల్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ అడపా బాబ్జి మాట్లాడుతూ ప్రస్తుత కౌన్సిల్ పదవీకాలం ముగిసేలోగానైనా నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని పూర్తి చేయాలని, ఈ నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్‌లా తయారైందని విమర్శించారు. వార్డుల్లోని డ్రైన్లలో సిల్ట్ తొలగింపు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన పద్మ పురస్కారాలు అందుకున్న వారికి పౌర సన్మానం చేయాలని చైర్మన్ యలవర్తి ప్రతిపాదించగా వీరితో పాటు అమృత్ పథకంలో గుడివాడ పట్టణాన్ని చేర్చేందుకు సహకరించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు కూడా పౌర సన్మానం చేయాలని కౌన్సిల్ తీర్మానించింది. జీరో అవర్‌లో పలు సమస్యలపై వైసిపి, టిడిపి సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తదితరులు పాల్గొన్నారు.

పాత ప్రభుత్వాసుపత్రి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్
మైలవరం, ఫిబ్రవరి 26: మైలవరం నడిబొడ్డున ఉన్న పాత ప్రభుత్వాసుపత్రి స్థలానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వం స్థలం నిరుపయోగంగా ఉందంటూ కొనే్నళ్ళుగా పత్రికలు ఘోషించినా ఏ ప్రభుత్వం ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. ఎన్నో అర్జీలు, విఙ్ఞపనల అనంతరం దీనిపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించింది. షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని రాబట్టాలని జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తలంచారు. ఈమేరకు స్థానిక జడ్పీటిసి దొండపాటి రాము ద్వారా దీనికి సంబంధించి వివరాలు సేకరించి ప్రాధమిక సమాచారాన్ని అందించాలని కోరటంతో శుక్రవారం పంచాయితీరాజ్ డీఈ శేషుబాబుతో కలిసి జడ్పీటిసి రాము సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. ఈస్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం నిర్మాణం ద్వారా అధిక ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని జడ్పీటిసి, అధికారులు గుర్తించారు. కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి ప్రాధమిక సమాచారాన్ని జడ్పీ చైర్ పర్సన్‌కు నివేదించనున్నారు. ఈసందర్భంగా జడ్పీటిసి రాము మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా పడావుగా పడి ఉన్న ఈస్థలాన్ని వినియోగం లోకి తీసుకురావాలని తాను జడ్పీ చైర్ పర్సన్‌కు చెప్పటం జరిగిందన్నారు. తన విన్నపాన్ని మన్నించి కోటి రూపాయల జడ్పీ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించటానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. పంచాయితీరాజ్ డీఈ శేషుబాబు మాట్లాడుతూ చైర్ పర్సన్ ఆదేశాల మేరకు ఈస్థలానికి సంబంధించి, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి ప్రాధమిక నివేదికను అందించనున్నట్లు వెల్లడించారు. ఈకార్యక్రమంలో టిడిపి నేత నందేటి శేషగిరిరావు, పంచాయితీరాజ్ ఏఈ పాల్గొన్నారు.
ఎడ్లబండ్లను ఢీకొన్న లారీ
హనుమాన్ జంక్షన్, ఫిబ్రవరి 26: బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి చెరకు లోడుతో వెళ్తున్న మూడు ఎడ్లబండ్లను ఢీకొట్టింది. సేకరించిన వివరాల ప్రకారం మండలంలోని రంగన్నగూడెం, శోభనాధ్రిపురం గ్రామాలకు చెందిన శ్రీనివాసరావు, కొలుసు రాంబాబు వారి వ్యవసాయ క్షేత్రంలో నరికిన చెరకు పంటను ఎడ్లబండ్లపై వేసుకుని డెల్టా సుగర్స్‌కు బయలుదేరారు. ఎడ్లబండ్లు వీరవల్లికి వస్తున్న సమయంలో మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ 3 ఎడ్లబండ్లను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎడ్లబండ్లు పూర్తిగా ధ్వంసం కావడంతోపాటు, ఎడ్లకు, బండ్ల యజమానులకు సల్పంగా గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాద వివరాలను రాష్ట్ర ఎపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ గన్నవరం శాసనసభ్యుడు డా వల్లభనేని వంశీమోహన్‌కు తెలిపారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న వంశీ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ముగిసిన తిరుపతమ్మ తిరునాళ్ల
పెనుగంచిప్రోలు, ఫిబ్రవరి 26: స్థానిక శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో పూర్ణాహుతి నిర్వహించి తిరుపతమ్మ అమ్మవారి కల్యాణ పీటలపై కూర్చున్న దంపతులకు ఆలయం తరఫున నూతన వస్త్రాలు అందజేశారు. పూర్ణాహుతి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో దీక్షా స్వాములు పాల్గొన్నారు. తిరుపతమ్మ అమ్మవారికి చంద్రమ్మ వంశీకులు కనే్నటి వెంకట రమణ ఆధ్వర్యంలో సుమారు 40 వేల విలువ గల వెండి గొడుగు, తలపాగా బహూకరించారు. వీరిని ఆలయ అధికారులు సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో కార్యనిర్వహణ అధికారి ఎం రఘునాధ్, భక్తజన సేవా కమిటీ సభ్యుడు కర్ల వెంకట నారాయణ, ఎఇఒలు మేడా గోపాలరావు, చల్లా రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
వీరమ్మ తిరునాళ్ళకు పోటెత్తిన భక్తజనం
ఉయ్యూరు, ఫిబ్రవరి 26: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము నుండే భక్తులు వందలాదిగా ఆలయం వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకు భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, నగర పంచాయతీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చే భక్తులతో ఈ ప్రాంతం జనసంద్రమైంది. ఆదివారం శిడిబండి ఉత్సవం జరగనుండటం, ఆ తర్వాత కేవలం మూడు రోజులు మాత్రమే తల్లి ఆలయంలో కొలువు ఉండటం వల్ల భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది.
ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ
-వెండి కిరీటం, నగదు అపహరణ
కైకలూరు, ఫిబ్రవరి 26: వింజరంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ పూజారి శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా గుడికి ఉన్న తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా స్వామి వారి కిరీటం (750 గ్రాములు) సుమారు 15,000 అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే కైకలూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ షబ్బీర్ అహ్మద్ సంఘటనా స్థలానికి వెల్లి విచారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రతి ఒక్కరూ తల్లిని దైవంగా కొలవాలి
బంటుమిల్లి, ఫిబ్రవరి 26: ప్రతి ఒక్కరూ తల్లిని దైవంగా కొలవడమే ముక్తి మార్గమని గుంటూరు జిల్లా తాళ్ళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. మండల పరిధిలోని పెదతుమ్మిడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి ఆలయ మొదటి వార్షికోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న శివ స్వామి అనుగ్రహభాషణం చేశారు. స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మట్టా బసవ నాగార్జున (నాగబాబు), లక్కాప్రగడ మాధవరావు, జల్లూరి శరబయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు.

బందరు రైల్వే స్టేషన్‌కు మహర్దశ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 26: బ్రిటీష్ వారి హయాంలో వర్తక, వాణిజ్య కేంద్రంగా భాసిల్లిన మచిలీపట్నం రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఎదుగు బొదుగు లేకుండా ఉన్న ఈ రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దడానికి రైల్వే శాఖ సన్నద్ధమైంది. ఈ మేరకు గురువారం పార్లమెంట్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌లో మచిలీపట్నం స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా మార్చేందుకు రూ.5కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మరుసటి రోజైన శుక్రవారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా మచిలీపట్నం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ అభివృద్ధికి తీసుకోవల్సిన చర్యలపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు సోదరుడు జగన్నాధరావు, విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ అశోక్ కుమార్, ఇతర అధికారులతో చర్చించారు. మచిలీపట్నం-నిడదవోలు వరకు డబ్లింగ్ లైన్, విద్యుద్దీకరణకు రూ.79కోట్లు బడ్జెట్‌లో కేటాయింపు జరిగిందని, ఈ పనులను సత్వరమే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు రవీంద్ర గుప్తా తెలిపారు. అలాగే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతుందన్నారు. భవిష్యత్తులో బందరు పోర్టు నిర్మాణం జరగనున్న దృష్ట్యా మచిలీపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధి పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర పలు ప్రతిపాదనలను జియం రవీంద్ర గుప్తా దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ ప్రాంత చిరకాల వాంఛ కోస్తా లింక్ రైలు మార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే కోచ్‌ల నిర్వహణ కోసం అదనపు పిట్‌లైన్ నిర్మించాలని, మచిలీపట్నం-గుడివాడ సెక్షన్ డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులను వేగవంతం చేయాలని, వారానికి మూడు సార్లు మచిలీపట్నం నుండి నడిచే యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌ను డైలీ నడపాలని, విశాఖ ప్యాసింజర్‌కు అదనపు స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేయాలని, పినాకిని ఎక్స్‌ప్రెస్‌ను మచిలీపట్నం నుండి నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ద్వారా జియంను కోరారు. మంత్రి రవీంద్ర విజ్ఞాపనలపై జియం రవీంద్ర బాబు సానుకూలంగా స్పందించారు. అనంతరం జియం రవీంద్ర గుప్తా, విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ అశోక్ కుమార్ తదితరులు స్టేషన్‌లో అణువణువు పరిశీలించారు. రిజర్వేషన్ కౌంటర్, వెయింటింగ్ హాల్, పలు విభాగాలలో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పిట్ లైన్‌ను పరిశీలించారు. ఈ పర్యటనలో సీనియర్ డిసిఎం ఎన్‌వి సత్యనారాయణ, సీనియర్ డిఓఎం కె సత్యనారాయణ, సీనియర్ డియస్‌టి సూర్యనారాయణ, డిఇఎన్ వరుణ్ బాబు, కనస్ట్రక్షన్స్ చీఫ్ ఇంజనీర్ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, టిడిపి నాయకులు గొర్రిపాటి గోపిచంద్, ప్రయాణీకుల సంఘం ప్రతినిధులు కె రామచంద్రరావు, లింగం మోజస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మామిడి మురళీకృష్ణ తదితరులు జియం రవీంద్ర గుప్తాను కలిసి బందరు స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నయనానందకరంగా నృత్యరూపక యక్షగానాలు

కూచిపూడి, ఫిబ్రవరి 26: నాట్య క్షేత్రం కూచిపూడి శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో నిర్వహిస్తున్న కూచిపూడి యక్షగాన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రదర్శించిన రామ నాటకం, గజాననీయమ్ నృత్య రూపకాలు ప్రేక్షకులకు నయనానందాన్ని, ఆధ్యాత్మికత భావాలు కల్పించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమి, కూచిపూడి నాట్యారామ కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, నర్తనంల పర్యవేక్షణలో హైదరాబాద్‌కు చెందిన లలిత కళాశాల ఇన్‌చార్జ్ డీన్ భాగవతుల సేతురామ్ నట్టవాంగం, నృత్య పరికల్పనలో అనంతదాసాధ్యులు రచించిన భాగవతుల రామకోటయ్య కొరియోగ్రఫీలో రూపొందించిన ‘రామనాటకం’ 19వ శతాబ్దంలో తెలంగాణలో నాటకాలకు పురుషుల కొరతను అధిగమించేందుకు ప్రారంభించిన స్ర్తిలే పురుష పాత్రల సాంప్రదాయాలో అన్ని పురుష పాత్రలను స్ర్తిలచే తనే ప్రదర్శించబడటం విశేషం. ఈ నృత్య రూపకంలో రామ పట్ట్భాషేకం, సీతమ్మపై చాకలి అపవాదు, గూఢాచారి భద్రుని ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీరామచంద్రుడు, గర్భవతి అయిన సీతమ్మను అడవిలో వదిలి రమ్మని తమ్ములను ఆదేశించడం, ఆత్మహత్యకు సిద్ధపడిన సీతమ్మను వాల్మికి మహర్షి వారించి ఆశ్రమివ్వటం, లవకుశల జననం, శ్రీరాముడు ఆశ్వమేధ యాగం చేయటం, యాగాశ్వాన్ని లవకుశలు బంధించటం, శత్రుగ్నుడు, లక్ష్మణులను ఓడించటంతో శ్రీరాముడే స్వయంగా లవకుశులతో యుద్ధం చేసి మూర్చపోవటంతో సీతమ్మ వచ్చి రాముడే మీ తండ్రి తని తెలపటం, కుమారులను శ్రీరాముడికి అప్పగించి సీతమ్మ భూమాతను చేరటం అనే అంశాలను కళాకారులు అత్యంత చతురతతో, భక్త్భివంతో అభినయించారు. శ్రీరాముడిగా రోహిణి ప్రసాద్, లక్ష్మణుడిగా శ్రీవంతి, సీతగా రేణుక ప్రభాకర్, భరతుడిగా శ్రీలత ప్రసాద్, శత్రుఘు్నడిగా తేజశ్విని గోపాలుడు, వాల్మికిగా రమేష్, భద్రుడుగా శ్రీలత, వశిష్ఠుడుగా రమేష్, లవకుశలుగా విష్ణువందన్, వంశీ వర్ధని, చాకలిగా నవ్యశ్రీ, చాకలి దుర్గిగా కీర్తనరెడ్డి పాత్రోచిత న్యాయం చేశారు. భాగవతుల సీతారాం నట్టవాంగం, డియన్ శాస్ర్తీ, ఇందిరా గోవర్ధన్ గాత్రం, కోలంక అనీల్ వయోలిన్, నాగేశ్వరరావు మృదంగం, వెంకటేష్ ఫ్లూట్ వాద్య సహకారం అందించారు. అంతకుముందుగా దండిభొట్ల వైకుంఠనాధ నారాయణ మూర్తి రచన, దండిభొట్ల శ్రీనివాస వెంకటశాస్ర్తీ సంగీతం, నాట్యకళాధర్ కేంద్రీయ విశ్వ విద్యాలయం డీన్ పసుమర్తి రామలింగశాస్ర్తీ దర్శకత్వంలో గజాననీయం నృత్య రూపక కథ వినాయక చవితిని తలపించింది. ఇందులో గజాసురుడిగా వేదాంతం వెంకట రాఘవ, శివుడిగా సుబ్బరాజు, పార్వతి చిన్మయి, వినాయకుడిగా స్వహుతి, సుబ్రహ్మణ్య స్వామిగా మహతి, విష్ణుమూర్తిగా శ్రీష, లక్ష్మిగా మహిత, మాయా విష్ణువుగా అజయ్ శ్రీనివాస్, బ్రహ్మగా మోహన్, ఇంద్రుడిగా శ్రీనివాస్, నందులుగా ప్రసాద్, సాగర్, శక్తిలుగా ప్రణవి, కావ్య, సాత్విక, రేష్మలు, రాక్షసులుగా మోహన్, వెంకటేశ్వర్లు, సాగర్, ప్రసాద్, నారదుడిగా సురేంద్ర ఆయా పాత్రలలో పరకాయ ప్రవేశం చేశారు. డియన్‌వి శాస్ర్తీ పద్మ ఆర్ శాస్ర్తీ, గాత్రం, మృదంగం రాజగోపాలాచారి, వయోలిన్ దినకర వేణువు మురళి, వీణా నారాయణ రక్తికట్టించారు.

హెల్త్‌వర్సిటీ ఉద్యోగి బ్రెయిన్‌డెడ్
* అవయవదానానికి సిద్ధమైన కుటుంబీకులు
హెల్త్‌వర్సిటీ, ఫిబ్రవరి 26: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కొత్తపల్లి హేమప్రసాద్ (55) శుక్రవారం గుండెపోటుకు గురై వెంటనే కోమాలోకి వెళ్లారు. యూనివర్శిటీలో విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురవ్వడంతో ఉద్యోగులు బందరు రోడ్‌లోని రమేష్ హాస్పిటల్‌కు తరలించగా, పరీక్షించిన డాక్టర్లు బ్రెయిన్‌డెడ్‌గా నిర్థారించారు. బ్రెయిన్‌డెడ్ కావడంతో అతని అవయవాలు దానం చేయడానికి కుటుంబ సన్యులు ముందుకొచ్చారు.

కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పనులు
మరింత వేగవంతం చేయాలి
* కలెక్టర్ బాబు.ఏ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 26: కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పనులు మరింత వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బాబు.ఏ అధికారులను, సోమా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ బాబు.ఏ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న కృష్ణా పుష్కరాలకు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితిలోను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు నిర్మాణ పనులకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తిచేసి ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫ్లైఓవర్‌కు సంబంధించి 320 ఫిల్లర్ పైల్స్‌కు గాను 175 పూర్తిచేయడం జరిగిందని సోమా ప్రాజెక్టు మేనేజర్ సతీష్ కలెక్టర్‌కు వివరించారు. కనకదుర్గమ్మ గాలిగోపురం సమీపంలో ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గానికి సమాంతరంగా కృష్ణానది వైపు నిర్మించనున్న వంతెనకు సంబంధించి 40 ఫిల్లర్ పైల్స్‌కు గాను 18 పూర్తిచేశామని, ఫిల్లర్ పైల్స్‌కు సంబంధించిన ఫైల్ క్యాప్ పనులను ప్రారంభించటం జరిగిందని ఆయన కలెక్టర్‌కు వివరించారు. పనులను మరింత వేగవంతంగా చేయాలని అవసరమైతే అదనపు యంత్ర సామగ్రి, సిబ్బందిని వినియోగించి రాంత్రిబవళ్లు పనులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఏ ఆదేశించారు. జాతీయ రహదారిపై దుర్గాఘాట్ నుండి కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానానికి వెళ్లేందుకు ఏర్పాటుచేసిన ఫుట్ బ్రిడ్జి తొలగింపును పూర్తిచేసి ఫుట్‌ఓవర్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా తక్షణమే చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట సోమా ప్రాజెక్టు మేనేజర్ సతీష్, సైట్ ఇన్‌ఛార్జి మహేంద్ర, ఎన్‌హెచ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు బి.రాజకుమార్, సోమాకంపెనీ, జాతీయ రహదారుల సిబ్బంది పాల్గొన్నారు.

పేదలకు ఇసుక ఫ్రీ!
* ఇక నిర్మాణాలు వేగవంతం
* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 26: బంగారంతో సమానంగా తులతూగుతున్న ఇసుకను పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెల్లకార్డుదారులకు ఇసుకను అందించేందుకు గాను మార్చి 16న విధి విధానాలను కూడా ఖరారు చేయనున్నారు. కృష్ణానదిలోకి ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకువచ్చే ఇసుకకు అంతులేని డిమాండ్ ఏర్పడటంతో ఇసుక వ్యాపారం బంగారంతో సమానంగా మారింది. ఒక దశలో కిలోల లెక్కన కూడా ఇసుకను కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. అనేక సందర్భాల్లో ఇసుక బ్లాక్ మార్కెట్లోకి తరలి వెళ్లి నిర్మాణాలు నిలిచిపోయిన సందర్భాలున్నాయి. లారీ ఇసుకను కనీసం ఐదువేల రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 8 వేల నుంచి 12 వేల రూపాయలకు కూడా ఇసుకను కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడింది. ఇసుకకు ఏర్పడిన డిమాండ్‌తో పెట్టుబడిదారులు అక్రమంగా భారీ పడవలద్వారా నదీగర్భంలోనుంచి ఇసుకను తరలించడం జరుగుతున్నది. బోగస్ సొసైటీల పేరిట పెట్టుబడిదారులు నిబంధనలకు వ్యతిరేకంగా యంత్రాలను ఉపయోగించి ఇసుకను అక్రమంగా కనీసం రోజుకు వెయ్యి లారీలలో హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న విషయంపై ఆంధ్రభూమి దినపత్రికలో ఇటీవల ఒక వార్తాకథనం రావడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఉచితంగా ఇసుక లభించడం పేదప్రజల అదృష్టంగానే భావించాల్సి ఉంది.

రాజధాని అవసరాల కోసం
వైజాగ్ స్టీల్ విక్రయ కేంద్రం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 26: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో అమరావతి అలాగే పరిసరాల్లో జరుగబోతున్న భారీ ప్రాజెక్టులు, ఇతరత్రా బహుళంతస్తుల భవనాల నిర్మాణ అవసరాలను గుర్తించి విశాఖ స్టీలు ప్లాంట్ తన 24వ అమ్మకం కేంద్రాన్ని శుక్రవారం ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని రామచంద్రనగర్‌లో పలువురు రియల్ ఎస్టేట్‌దారులు, బిల్డర్స్ సమక్షంలో ప్లాంట్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ పి.మధుసూదన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇంకా స్టీల్‌కు అనూహ్యరీతిలో డిమాండ్ ఉందని ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నందున సగటు తలసరి వినియోగం 250 కిలోలు కాగా ప్రస్తుతం 60 కిలోలకు మించి ఉత్పత్తి లేదన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జరిగిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన విశాఖ స్టీలు ప్లాంట్‌ను ఆంధ్రుల సెంటిమెంట్‌కు ఎక్కడా.. ఎప్పుడూ భంగం కల్గించని రీతిలో నాణ్యత, ఆపై సరసమైన ధరలకు స్టీల్‌ను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రస్తుతం టన్ను ధర 29వేల రూపాయలుగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉండవచ్చన్నారు. లక్ష టన్నుల నిలువ సామర్థ్యంతో త్వరలో స్టాక్ యార్డును ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ సమావేశంలో ప్లాంట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, ఐఎఫ్‌ఎస్ అధికారి బి.సిద్ధార్థకుమార్, ఎపి రీజనల్ మేనేజర్ పి.ఈశ్వరయ్య, మార్కెటింగ్ హెచ్‌వోడి జికె చక్రవర్తి, జనరల్ మేనేజర్ డాక్టర్ ఎస్‌ఎన్ రావు, రీజనల్ ఫైనాన్స్ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో టాటా ఇంటర్నెట్ సేవలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 26: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృత సేవలందించేందుకు గాను పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) జరిపిన కృషిలో దేశంలోనే తొలిసారిగా టాటా ట్రస్ట్ అంగీకారం తెలుపటమే గాక ఇప్పటికే అన్ని గ్రామాల్లో సర్వీసు కూడా పూర్తి చేయించింది. పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటాను కూడా నగరానికి తీసుకురావటం జరిగింది. ఇదిలా వుండగా ప్రధాని నరేంద్రమోది డిజిటలైజేషన్‌కు ఎంతో ప్రాధాన్యతనిస్తున్న నేపధ్యంలో టాటా ట్రస్ట్ తొలిసారిగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జగ్గయ్యపేట, నందిగామ శాసనసభ స్థానాల్లో 125 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలందించబోతున్నది. టాటా ఇంటర్నెట్ సాతి పేరిట ఒక్కో గ్రామానికి ఒక్కో మహిళను నియమించడం జరిగింది. ఈ ఉద్యోగిని ఇంటింటికెళ్లి ఇంటర్నెట్ ప్రయోజనాలు గురించి తెలియచెప్పటమే గాక అవసరమైతే అక్కడ నుంచే ఇంటర్నెట్ సేవలందించనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని స్థానిక తుమ్మలపల్లివారి కళాక్షేత్రంలో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎంపి కేశినేని నాని అధ్యక్షతన జరిగే ఈ సభలో స్థానిక శాసనసభ్యులు శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య పాల్గొననున్నారు.

రాంగోపాల్‌వర్మ కలకలం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 26: గతంలో విజయవాడ నగరంలో చెలరేగిన రౌడీయిజం.. అదే సమయంలో పలు విద్యాసంస్థల్లో చెలరేగిన విద్వేషాలు.. ఆపై మారణకాండకు దారితీసిన పరిస్థితుల ఇతివృత్తంగా ‘వంగవీటి’ పేరిట చలనచిత్రాన్ని నిర్మించబోతున్న ప్రముఖ దర్శకులు రాంగోపాల్‌వర్మ శుక్రవారం నగరానికి చేరుకున్నారు. అసలు వీరి ప్రవేశమే ఒక్కసారిగా కలకలం సృష్టించినట్లయింది. రంగా అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారంతో నగర డిసిపి కాళిదాసు రంగారావు హుటాహుటిన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని బందోబస్తుతో వర్మను నగరానికి పంపించారు. ఇక ఆయన బసచేసిన హోటల్ పరిసరాల్లోనూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. అసలు సినిమా కథ ఓ కొలిక్కి రాకముందే సినీ డిస్ట్రిబ్యూటర్లు కూడా బయలుదేరారు. మూడు రోజులపాటు నగరంలో మకాం చేయనున్న వర్మ కొన్ని వర్గాలతో నేరుగా భేటీ కానున్నారు. ప్రధానంగా వంగవీటి, దేవినేని కుటుంబాలను కలుస్తారని తెలిసింది. ఇదిలా ఉండగా వర్మ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ సినిమాలో ఎవరినీ కించపరిచే సన్నివేశాలు ఉండవంటూనే వాస్తవాలను ప్రతిబింబింప చేస్తానన్నారు.

రేపు జాతీయ సైన్స్ దినోత్సవం
బెంజిసర్కిల్, ఫిబ్రవరి 26: భారతీయ భౌతిక శాస్తవ్రేత్త సర్ సివి రామన్ రామన్ ఫలితంగా ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఈ నెల 28న నిర్వహించనున్నారు. నగరంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్, కల్పకం, చైన్నై శాస్తవ్రేత్తల బృందంతో రేడియేషన్ ఉపయోగాలు కేంద్రక సామర్థ్యం మరియు పర్యావరణం అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు.