తెలంగాణ

గుండ్లపోచంపల్లి అపెరల్ పార్కుకు పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 3: గుండ్లపోచంపల్లి అపెరల్ ఎక్స్‌పోర్ట్ పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచి పూర్వవైభవం తీసుకురావాలని అధికారులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లిలోని టీఎస్‌ఐఐసీ పార్కు జోనల్ కార్యాలయంలో శనివారం మంత్రి కేటీఆర్.. అపెరల్ పార్కుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. టీఎస్‌ఐఐసీ అపెరల్ పార్కులో ఎన్ని యూనిట్లు ఉన్నాయి.. ఎంతమంది పరిశ్రమలు స్ధాపించారు.. భూము లు పొంది పరిశ్రమలు స్థాపించని వారికి నోటీసులు జారీ చేశారా.. ఎంత మందికి ఉపాధి లభిస్తుంది.. తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. 63 యూనిట్లు ఉన్నాయని సుమారు మూడువేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్పగా పదివేల మందికి ఉపాధి లభించాల్సి ఉండగా కేవలం మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందా అని అధికారులను నిలదీశారు. లేబర్ ఆఫీసర్‌ను సమావేశానికి ఎందుకు పిలువలేదని అధికారులను ప్రశ్నించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌కు అనుగుణంగా హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉన్న గుండ్లపోచంపల్లి టెక్స్‌టైల్ పార్కును అభివృద్ధి చేసి గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. 90 శాతం మంది మహిళలకు అవకాశం కల్పించాలని అవసరమైతే శిక్షణ ఇప్పించి పది వేల రూపాయలకు వేతనం తగ్గకుండా చూడాలని పేర్కొన్నారు. అపెరల్ పార్కులో గోదాంలను వెంటనే ఖాళీ చేయించాలని, గోదాంలుంటే వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినప్పుడు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అపెరల్ పార్కును మొత్తం పచ్చగా మార్చడంతో పాటు ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైటెక్స్ స్థాయిలో గుండ్లపోచంపల్లిలో హ్యండ్‌క్రాఫ్ట్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలోనే పది ఏకరాల్లో యంగ్ వన్ అనే సంస్థ ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. ఫ్యాషన్ సిటీగా అపెరల్ పార్కును తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహా రెడ్డి, హ్యండలూమ్స్ టెక్స్‌టైల్ డైరెక్టర్ శైలజ రామయ్యర్, జోనల్ ఇన్‌చార్జి మాధవి, డిప్యూటీ జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస్, జనరల్ మేనేజర్ రవీందర్, సర్పంచ్ బేరీ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి సమన్వయకర్త నందారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వీర్లపల్లి భాగ్యరెడ్డి, బలరాంరెడ్డి పాల్గొన్నారు.

ఏడీపై కేటీఆర్ ఆగ్రహం
టీఎస్‌ఐఐసీ ఏడీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశంలో ఏడీని అపెరల్ పార్కులో ఏమి జరుగుతుందని లెక్క పత్రం చూసుకోవా.. టూరిజానికి వచ్చినట్లు వచ్చి వెళ్లిపోవడమేనా అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశం ఉందని తెలిసినా సమాచారం లేకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావుడిగా ఏర్పాట్లు చేశారని కేటీఆర్‌కు ఎంపీ మల్లారెడ్డి వివరించారు.
ఘనస్వాగతం.. నవ్వులతో ఉల్లాసం
సమీక్షా సమేశానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్‌కు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజు, అధికారులు టీఎస్‌ఐఐసీ కార్యాలయం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయం పక్కనే ఇంకుడుగుంత తవ్వకాన్ని ప్రారంభించాలని కోరారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఎంపీ మల్లారెడ్డినే తవ్వాలని సూచించారు. కూలీ ఇవ్వాలని ఎంపీ చెప్పడంతో.. నువ్వు కాస్లీ కూలీవని మంత్రి చమత్కరించి అందరిని నవ్వించారు. తర్వాత మొక్కను నాటుతూ రక్షణను ఎంపీ మల్లారెడ్డి తీసుకోవాలని నవ్వుతూ కోరా రు. అందరితో కేటీఆర్ ఉల్లాసంగా గడిపారు.

చిత్రం..జోనల్ కార్యాలయం ఆవరణలో మొక్కను నాటి నీళ్లు పోస్తున్న మంత్రి కేటీఆర్