తెలంగాణ

‘డీఎస్’ నిర్ణయంపై అనుచరుల్లో ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 28: ఉమ్మడి రాష్ట్రంలో అగ్రనేతల్లో ఒకరిగా చెలామణి అవుతూ ఆధిపత్యం చాటుకున్న రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌కు గత కొన్నాళ్ల నుండి పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. పార్టీకి ద్రోహం చేస్తున్నారనే ముద్ర వేస్తూ ఆయనను గులాబీ గూటి నుండి సాగనంపేందుకు సొంత జిల్లాకు చెందిన తెరాస నాయకులు అధినేతకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో డీఎస్ తన భవిష్యత్ రాజకీయానికి సంబంధించి ఏ వ్యూహంతో ముందుకెళ్తారన్నది చర్చనీయాంశమవుతోంది. ఆయన తెరాసను వీడడమో లేక ఆ పార్టీ అధిష్ఠానం బహిష్కరణ వేటు నిర్ణయాన్ని వెలువరించడం దాదాపుగా ఖాయమని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్న క్రమంలో, డీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అనుచరుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుని డీఎస్ తెరాసలోకి చేరిన సమయంలో నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల నుండి స్థానిక సంస్థలకు చెందిన కొద్దిమంది ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఆయన వెంట గులాబీ పార్టీలో చేరారు. వారంతా డీఎస్‌నే నమ్ముకుని తమ రాజకీయ భవితవ్యానికి దిశానిర్దేశం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే, దాదాపు మూడేళ్లకు పైగా ఎదురుతెన్నులు చూస్తున్నా అటు డీఎస్‌కు, ఇటు తమకు కూడా తెరాసలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తి వారిలో నెలకొని ఉంది. నెల రోజుల క్రితం డీఎస్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో అనుచరులంతా తెరాస అధిష్ఠానంపై బాహాటంగానే తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే డీఎస్‌పై క్రమశిక్షణ చర్యలు కోరుతూ జిల్లాకు చెందిన తెరాస ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా ముఖ్యమంత్రికి లేఖ పంపడాన్ని పలువురు డీఎస్ అనుచరులు ఈ పరిణామం తమ మంచికే జరిగిందని అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీగా తెరాసలో తాము చేరినప్పటికీ, కనీస గౌరవం అందడం లేదని, ఏ విషయంలో తమను సంప్రదించడం లేదంటూ, ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో తమదే ఆధిపత్యంగా ఉండేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం డీఎస్ తెరాసను వీడితే, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే దానిపై అనుయాయులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిన్న తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ, డీఎస్ మాత్రం తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని మెజార్టీ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతలను డీఎస్ సంప్రదించినట్టు జరుగుతున్న ప్రచారం సైతం ఈ విషయానికి బలాన్ని చేకూరుస్తోంది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధం సైతం డీఎస్‌ను అటు వైపే మొగ్గు చూపేలా చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికీ సోనియాగాంధీ, ఇతర కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల వల్ల డీఎస్‌కు మంచి పలుకుబడి ఉండడంతో ఆయన సేవలను వినియోగించుకునేందుకు అధిష్ఠానం కూడా డీఎస్ పునరాగమనానికి పచ్చజెండా ఊపిందనే ప్రచారం ఆయన అనుచరుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అయితే డీఎస్ తెరాస తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న దరిమిలా ఇప్పటికిప్పుడు పార్టీ ఫిరాయిస్తారా? అనే సంశయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలన్నింటి గురించి డీఎస్ సమగ్రంగా ఆలోచించుకున్న మీదటే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసి ఉంటారని, తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో సరైన నిర్ణయం తీసుకుంటారని ప్రధాన అనుచరులు ధీమాను వెలిబుచ్చుతున్నారు. అయితే డీఎస్ తీసుకునే నిర్ణయాలకు పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయన్నది వేచి చూడాల్సి ఉంది.