తెలంగాణ

ప్రాణమున్నంత వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 12: ప్రాణమున్నంత వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌లోనే ఉంటారని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నల్లగొండ, నార్కట్‌పల్లిలో జరిగిన కార్యక్రమాల సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ముందుండి పోరాడుతున్న తాము కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను టిఆర్‌ఎస్‌లోకి సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నారని మీడియాలో వచ్చిన కథనాలు ఊహాజనితమైనవని, తమతో టిఆర్‌ఎస్ నేతలెవరూ పార్టీ మార్పుపై సంప్రదించలేదని, తాము కూడా సీఎం కేసీఆర్‌నుగాని ఆ పార్టీ ఇతర నేతలను గాని కలువలేదన్నారు. గతంలో బీజేపీలో సైతం చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలు సైతం పూర్తిగా అవాస్తవమన్నారు. 30ఏళ్లుగా విద్యార్థి దశ నుండి కాంగ్రెస్‌లో కొనసాగుతూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ రైతాంగం సమస్యలపైన, మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త, తన ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ హత్య ఘటనపైన, ఇందులో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ప్రమేయంపైన, కేసీఆర్ ప్రాజెక్టుల అవినీతిపైన, కుటుంబ పాలనపైన కోమటిరెడ్డి బ్రదర్స్ నాలుగేళ్లుగా నిత్యం పోరాటం సాగిస్తున్నారన్నారు. శాసనసభలో టీఆర్‌ఎస్ హత్యా రాజకీయాలను, కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను, పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తానన్న భయంతో తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయగా దీనిపై తాను కోర్టు ద్వారా ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నానన్నారు. అలాంటి తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామంటూ ప్రచారం జరుగడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాజకీయంగా తమను దెబ్బతీసే లక్ష్యంతో గిట్టన వారు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు.. తన రాజకీయ నిర్ణయాలను తాను ధైర్యంగా ప్రకటించే స్థాయి తనకుందన్నారు. తన పార్టీ మార్పుపై ఊహాజనిత వార్తలకు మీడియా ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ విద్యార్థుల ఆత్మబలిదానాలను చూసి తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ సాధన కోసం తాను ఆనాడు పార్టీని సైతం ధిక్కరించి పోరాడి ఆమరణ దీక్ష సైతం చేశానన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానీగా చేయడం, సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకరావడం, సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే తన ముందున్న లక్ష్యాలన్నారు. నేడు సోమవారం తన శాసన సభ్యత్వ కేసు తీర్పురాగానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు తెలంగాణ అంతా పర్యటించి నా వంతు ప్రయత్నం చేస్తానన్నారు. రాజ్యంగ పదవిలో ఉన్న సీఎం కేసీఆర్ కోర్టు తీర్పును కూడా అమలు చేయకపోవడం పరిపాలన వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదముందన్నారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎల్‌బిసి సొరంగం వంటి పలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై పరుగులు పెడుతున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కుమారుడైన రాహుల్‌గాంధీ పర్యటన పట్ల అడుగడుగున కేసీఆర్ ప్రభుత్వం నిర్భంధాలు, ఆంక్షలు పెట్టడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాహుల్‌గాంధీ పర్యటనను, సభలను విజయవంతం చేసేందుకు, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కుటుంబానికి మద్ధతుగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకంటే ఎక్కువగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు హాజరై ఏయిర్‌పోర్టు నుండి రాహుల్‌గాంధీకి ఘనస్వాగతం పలికేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ డైరక్టర్ పాశం సంపత్‌రెడ్డి, డీసీసీ నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.